ఇంద్రకీలాద్రిపై ఆషాఢం సందడి

ABN , First Publish Date - 2021-07-12T16:02:57+05:30 IST

ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస..

ఇంద్రకీలాద్రిపై ఆషాఢం సందడి

దుర్గమ్మకు పవిత్ర సారె సమర్పణ ప్రారంభం 

మొదటి సారె సమర్పించిన వైదిక, అర్చక సిబ్బంది 

అమ్మవారికి కానుకగా బంగారు మయూర హారం

వచ్చే నెల 8 వరకూ కొనసాగనున్న సమర్పణలు


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సందడి మొదలైంది. ఈ మాసంలో భక్తులు, భక్త సమాజాలు, భజన బృందాల ఆధ్వర్యంలో కనకదుర్గమ్మకు పవిత్ర సారె సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం నుంచి వచ్చే నెల 8వరకు అమ్మవారికి సారె సమర్పించవచ్చునని వేదపండితులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ నేతృత్వంతో వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి శాస్త్రోక్తంగా మొదటి సారె సమర్పించారు. కొండ దిగువన కనకదుర్గానగర్‌ మహామండపం నుంచి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఊరేగింపుగా పవిత్ర సారె తీసుకువచ్చారు. పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, సభ్యులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వైదిక, అర్చక సిబ్బంది తరఫున స్థానాచార్యుడు విష్ణుభొట్ల శివప్రసాదశర్మ దంపతులు దుర్గమ్మకు ప్రథమ సారె సమర్పించడంతో ఆషాడ పవిత్ర సారె సమర్పణం ప్రారంభమైంది. అనంతరం మహామండపం ఆరో అంతస్తులో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైదిక, అర్చక సిబ్బంది సుమారు రూ. 3.30 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు మయూరి హారాన్ని అమ్మవారికి కానుకగా అందజేశారు. ఈకార్యక్రమం వచ్చే నెల 8వరకు కొనసాగనుంది. అయితే కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సారె సమర్పణకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు కోరారు. 


చిట్టినగర్‌ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం తరపున సారె

చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం (నగరాలు దేవాలయం) తరపున ఆదివారం కనకదుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు లింగిపిల్లి అప్పారావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు తమ కుటుంబ సభ్యులతోపాటు సుమారు 200 మంది నగరాలు ఊరేగింపుగా సారె తీసుకువచ్చి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు.


Updated Date - 2021-07-12T16:02:57+05:30 IST