ఆంధ్రజ్యోతి(05-01-2021)
భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ప్రాచుర్యంలో ఉన్న ఔషధాలలో ద్రాక్షసవ ఒకటి. దీని తయారీలో ముఖ్యమైనది తాజా ద్రాక్ష పండ్లు. ఈ ఔషధ తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్ర గ్రంథమైన యోగరత్నాకరంలో ఆర్శిరోగచికిత్స అధ్యాయంలో ఐదు శ్లోకాలలో వివరించి ఉంది. అదేవిధంగా భైషజ్యరత్నావళిలో ఆర్శిరోగచికిత్స అధ్యాయంలో కూడా దీని గురించి వివరంగా రాసి ఉంది.
ద్రాక్షసవను తాజా ద్రాక్ష పండ్లతో పాటు లవంగ, కంకోల, పిప్పళ్లు, శ్రీగంధం, దాల్చిన చెక్క, యాలుక, ఆరిగ మొదలగు 14 రకాల మూలికలు కలిపి ఆసవ విధానంలో తయారుచేస్తారు.
ఆర్శస్సులు (పైల్స్), పాండు రోగం (అనీమియా), రక్తపిత్త, భగంధరం (ఫిస్టులా), గుల్మ, ఉదర, క్రిమి, గ్రహణి, శోష, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలకు ద్రాక్షసవ ఔషధంగా ఉపయోగపడుతుంది.
విరోచనం మెత్తగా అయ్యేలాగా చేయటం ద్వారా పైల్స్, ఫిస్టులా వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. విరోచనం గట్టిగా అయ్యే లక్షణం ఉన్నవాళ్లు దీనిని తీసుకోవడం వల్ల పైల్స్, పిస్టులా వంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు.
అలాగే నిద్రలేమి సమస్య ఉన్నవారుద్రాక్షసవ , అశ్వగంధ కలిపి తీసుకుంటే సమస్య తగ్గుతుంది. పైత్యతత్వం వల్ల చర్మం పొడిబారిన వాళ్లలో వచ్చే దద్దుర్లు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది.
ఉపయోగించే మోతాదు: దీనిని పెద్దలు 10మి.లీ, పిల్లలు 5మి.లీ ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచన ప్రకారం వాడవలెను. ప్రస్తుతం ధూత్‌పాపేశ్వర్, జైధ్యనాధ్, వైద్యరత్న వంటి ఆయుర్వేద మందుల సంస్థలు ద్రాక్షసవను తయారుచేస్తున్నాయి.
శశిధర్
అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు
సనాతన జీవన్ ట్రస్ట్, కొత్తపేట, చీరాల-523157,
ఫోన్ నెంబర్. 08594-237666