ఎవరీ మల్లు స్వరాజ్యం.. ఈమె గురించి మీకేం తెలుసు.. ఆసక్తికర విషయాలివిగో..!

ABN , First Publish Date - 2022-03-20T06:33:34+05:30 IST

ఎవరీ మల్లు స్వరాజ్యం.. ఈమె గురించి మీకేం తెలుసు.. ఆసక్తికర విషయాలివిగో..!

ఎవరీ మల్లు స్వరాజ్యం.. ఈమె గురించి మీకేం తెలుసు.. ఆసక్తికర విషయాలివిగో..!

  • వదిలివెళ్లిన స్వరాజ్యం
  • తీవ్ర అస్వస్థతతో మృతి
  • నేడు ప్రజల సందర్శనార్థం పార్టీ కార్యాలయానికి భౌతికకాయం
  • పార్థీవ దేహాన్ని మెడికల్‌ కళాశాలకు అప్పగించనున్న కుటుంబసభ్యులు


నల్లగొండ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మోత్కూరు, సూర్యాపేటరూరల్‌, తుంగతుర్తి, తిరుమలగిరి రూరల్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (92) శనివారం మృతి చెందారు. రెండు నెలలుగా వెంటిలేటర్‌పై జీవన్మరణ పోరాటం చేసిన ఆమె శనివారం రాత్రి 7గంటలకు మృతి చెందారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థీవ దేహాన్ని ఆదివారం ఉదయం 10గంటలకు నల్లగొండ సీపీఎం జిల్లా కార్యాలయంలో ఉంచనున్నారు. సందర్శనలు ముగిసిన అనంతరం నల్లగొండ పట్టణంలో అంతిమయాత్ర నిర్వహించి సాయంత్రం 3గంటలకు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు ఆమె మృతదేహాన్ని అందజేయనున్నారు. ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతో రెండు నెలలుగా హైదరాబాద్‌లో ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా, బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల కోసం నిరంతరం శ్రమించిన వీరవనిత మల్లు స్వ రాజ్యం. చిన్న నాటి నుంచే సోదరుడు భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పోరాటాలకు అడుగులు వేశారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాంరెడ్డి-చొక్కమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 1931లో మ ల్లు స్వరాజ్యం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరి విరాల కొత్తగూడెం గ్రామంలో జన్మించారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆమకు ఇంటివద్దనే చదువు చెప్పిం చారు. ఆమె చదువుతో పాటు ఈత, గుర్రపు స్వారీ నేర్చు కున్నారు. పదేళ్ల వయసులో మాక్సిజం గోర్కీ రచనలు చది వి ప్రభావితురాలయ్యారు. అప్పటికే పేదలను పలు బాధల కు గురిచేస్తున్న నిజాం సర్కారును చూసి చలించారు. కట్టుబానిసత్వానికి స్వస్తిపలకాలని ఆంధ్రమహాసభ ఇచ్చిన పిలుపుకు కుటుంబ నిబంధనలను ధిక్కరించి 11ఏళ్ల వయసులో హాజరయ్యారు. కార్మికులకు చిన్నతనంలోనే బియ్యం పంపి ణీ, పలు సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో ఆమె ప్రజా జీవితం ప్రారంభమైంది. 13 ఏళ్ల వయసులో సోదరుడు భీం రెడ్డి నర్సింహారెడ్డితో కలిసి పేదల పక్షాన పోరాడారు. ఆ స్ఫూర్తితో నిజాం సర్కారుకు ముచ్చెటమలు పట్టించి రజకా ర్ల బారిన సింహస్వప్నంగా మారారు. మహిళలు గడప దాటడమే పాపంగా ఉన్న ఆ రోజుల్లో జానపద బాణిలో పాటలుకట్టి వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఊరూరా తిరిగి పాటలు పాడుతూ ప్రజలను చైతన్య వంతులను చేశారు.


సాయుధ పోరాటంలో కీలక పాత్ర

తెలంగాణ సాయుధ పోరాటం 1945-1948 మధ్య కాలంలో జోరుగా సాగుతున్న రోజులు. ఆ పోరాటంలో క్రియశీలకంగా పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించారు. ఆమె వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో సాయుధ పోరాటంలో పాల్గొని ఆ ప్రాంత గిరిజనులను చైతన్యవంతులను చేశారు. ఆమె పోరాట స్ఫూర్తిని తట్టుకోలేక 1947-48లో ఆమె ఇంటిని పెత్తందారి దొరలు పూర్తిగా దగ్ధం చేశారు. అప్పట్లోనే మల్లు స్వరాజ్యంకు ఒక ఎరుపు బ్రాండ్‌గా పేరు వచ్చింది.


దళ సభ్యుడితోనే వివాహం

తన ఉద్యమ సహచరుడు, దళ సభ్యుడు మల్లు వెంకటనర్సింహారెడ్డిని 1954, మేలో హైదరాబాద్‌లోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు నివా సంలో ఆమె వివాహం చేసుకున్నారు. వీరి వివాహం దళ సభ్యులైన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వర్‌రావు, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు సమక్షంలో జరిగింది. వెంకటనర్సింహారెడ్డి-స్వరాజ్యం దంపతులకు ఇద్దరు కుమారులు మల్లు గౌతమ్‌రెడ్డి, మల్లు నాగార్జున్‌రెడ్డి, కుమార్తె కరుణ జన్మించారు. తల్లి అడుగుజాడలో నడుస్తూ కుమారులిద్దరు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. 2008లో భర్త వెంకటనర్సింహారెడ్డి మృతి చెందారు.


స్వరాజ్యం తలకు రూ.10వేల రివార్డు

మల్లు స్వరాజ్యం ఒక దళానికి కమాండర్‌గా ముందుండి నడిపించారు. ఆ సమయంలో నిజాం సర్కారు ఆమెను పట్టించిన వారికి రూ.10వేల రివార్డు కూడా ప్రకటించింది. అయినా గిరిజన ప్రాంతాల్లో భయపడకుండా తలదాచుకొని పోరాటం కొనసాగించారు. రాజక్కగా మారుపేరుతో గుర్రపు స్వారీ చేస్తూ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. గిరిజన మహిళ సైదమ్మ ఇంట్లో స్వరాజ్యం ఉందని పసికట్టిన నిజాం పోలీసులు ఆమె ఇంటిపై దాడికి చేశారు. ఆమెను తప్పించడానికి ఆ గిరిజన మహిళ తన మూడు నెలల పసికందును స్వరాజ్యం చేతికి ఇచ్చి బాలింత వేషంలో పారిపోవాలని దారిచూపింది. వచ్చిన పోలీసులు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా స్వరాజ్యం జాడను సైదమ్మ చెప్పలేదు.


రెండు దఫాలుగా శాసనసభ్యురాలిగా ఎన్నిక

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 1978-1983, 1983-84సంవత్సరాలల్లో రెండు పర్యాయాలు సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు. రెండు దఫాలు గా ఎన్నికైన మల్లు స్వరాజ్యం పీడిత ప్రజల కోసం అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు. నల్లగొండకు చెందిన ప్రము ఖ సాహిత్యవేత్త, తెలంగాణ యోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డితో కలిసి వామపక్ష భావాలతో మొదలైన ‘చైతన్యమానవి’ పత్రిక సంపాదక వర్గంలో ఆమె ఒకరు. స్వరాజ్యం జానపద బాణిల్లో పాటలు కట్టి స్వయంగా పాడేవారు. గ్రామాల్లో ప్రజలను తన పాటలతో చైతన్యవంతులను చేశారు.


ప్రజా ఉద్యమాల కోసం అత్తగారి ఊరు వదిలి

స్వరాజ్యం అత్తగారి ఊరు మద్దిరాల మండలంలోని మామిళ్లమడవ కాగా, ప్రజా ఉద్యమాల కోసం భర్తతో కలిసి మామిళ్లమడవను వదిలి జాతీయ ఉన్న సూర్యాపేటకు సమీపంలోని రాయినిగూడెం గ్రామానికి తరలివచ్చారు. అక్కడి నుంచి ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. నల్లగొండ, హైదరాబాద్‌, ఆంధ్రాకు రవాణాకు అనుకూలంగా ఉండటంతో రాయినిగూడెంలో స్థిరపడ్డారు. రాయినిగూడెం గ్రామంలో మల్లు వెంకటనర్సింహారెడ్డి పేరు మీద 1.20ఎకరాల భూమిని ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి దానం చేశారు. సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వారి 6ఎకరాల భూమిని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం భూపంపిణీ చేశారు. అప్పట్లో తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు ఉమ్మడిగా ఉన్నాయి. అప్పుడు మల్లు వెంకటనర్సింహారెడ్డి డివిజన్‌ కార్యదర్శిగా పనిచేశారు.


చావు బతుకుల మధ్య లాల్‌సలామ్‌

ఈ ఏడాది మార్చి 2న తీవ్ర అస్వస్థకు గురైన మల్లు స్వరాజ్యం హైదరాబాద్‌లోని కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందారు. సీపీఎం పార్టీ దిగ్గజాలు, జాతీయ నేతలు ఆమెను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు వెంటిలేటర్‌పై ఉన్న స్వరాజ్యం పిడికిలి బిగించి లాల్‌ సలామ్‌ అంటూ తనలోని కమ్యూనిజాన్ని చూపెట్టారు.


ఆమె అడుగుజాడల్లోనే...

మల్లు స్వరాజ్యం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా పని చేశారు. తెలంగాణ సాయుధ పోరాట దళ సభ్యురాలిగా, సీపీఎం పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆమె పెద్ద కుమారుడు మల్లు గౌతమ్‌రెడ్డి సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్‌రెడ్డి లాయర్‌గా, రాయినిగూడెం గ్రామ సర్పంచ్‌గా రెండు దఫాలుగా ఎన్నికయ్యారు. కోడలు లక్ష్మికూడా సర్పంచ్‌గా పని చేశారు. 2019 నల్లగొండ పార్లమెంట్‌ స్థానం నుంచి ఆమె కోడలు మల్లు లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. కూతురు పాదూరి కరుణ బీజేపీ రాష్ట్ర నాయకురాలుగా ఉన్నారు.


రాజకీయ ప్రస్థానం

సాయుధ పోరాటం ముగిసిన అనంతరం ఆమె రాజకీ యరంగ ప్రవేశం చేశారు. తొలుత సీపీఐలో ఉన్న ఆమె 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత సీపీఎంలో కొన సాగారు. 1978 నుంచి 1985 వరకు ఏడేళ్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా, నియోజకవర్గ సమస్యలతో పాటు స్త్రీ సమస్య లు, మహిళలపై అత్యాచారాలు, వరకట్న వేధింపులను శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పోరాడారు. ప్రభుత్వ భూములను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లి భూమి లేని పేదలకు ఆమె పంపిణీ చేయించారు. 1994లో సాగిన సారా వ్యతిరేక ఉద్యమంలోనూ కీలక పాత్ర నిర్వహించారు. రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. వామపక్ష భావాలతో స్త్రీల ఆధ్వర్యంలో వచ్చిన ’చైతన్య మానవి’ అనే పత్రిక సంపాదకవర్గ సభ్యురాలిగా పని చేశారు. స్వరాజ్యం జీవిత చరిత్రను హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ ‘నామాటే తుపాకి తూటా’ పేరుతో పుస్తకం ముద్రించింది.


పలువురి సంతాపం

మల్లు స్వరాజ్యం మృతిపై సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.


ఆ పోరాట పటిమ ఎందరికో ఆదర్శం : శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నైజాం గుండాలను తరిమికొట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొ న్న మల్లు స్వరాజ్యం పోరాట పటిమ  ఎందరికో ఆదర్శం. ప్రజాసేవకు పరితపిస్తూ, నిత్యం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజల గుండెల్లో ఆమె నిలిచారు. ప్రజాప్రతినిధిగా ఎన్నోగొప్ప కార్యక్రమాలను నిర్వహించారు. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.


సాయుధ పోరాటానికి ఆమె ఐకాన్‌ : మంత్రి జగదీ్‌షరెడ్డి

తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాటానికి మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత మల్లు స్వరాజ్యం ఐకాన్‌. పోరాట చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే యోధురాలు. సమాజ మార్పు కోసం చివరి క్షణం వరకు అలుపెరుగని పోరాటం చేసిన వీర వనిత. ఆమె చరిత్ర మహిళలకు ఆదర్శం. ఆమె లేని లోటు పూడ్చలేనిది. స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవున్ని ప్రార్థిస్తున్నా.


తెలంగాణ సమాజానికి తీరని లోటు : జూలకంటి రంగారెడ్డి, సీపీఎం నేత

మల్లు స్వరాజ్యం మృతి తెలంగాణ సమా జానికి తీరని లోటు. భూస్వామ్య కుటుం బంలో జన్మించిన ఆమె 15వ ఏటనే దొర లు, జమిందార్‌లకు వ్యతిరేకంగా పోరాడా రు. పేదల విముక్తి కోసం జైలు జీవితం అనుభవించారు. రాయడం, పాడటమే కాదు ఆమె మంచి ఉపన్యాసకురాలు. ఆమె పోరాటాన్ని  స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం ముందుకు సాగాలి.

Updated Date - 2022-03-20T06:33:34+05:30 IST