సబ్-ఇంజనీర్‌ను విడుదల చేసిన మావోయిస్టులు

ABN , First Publish Date - 2021-11-18T00:27:23+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని తీవ్రవాద ప్రభావిత బిజాపూర్ జిల్లా బస్తర్ ప్రాంతం నుంచి వారం రోజుల క్రితం..

సబ్-ఇంజనీర్‌ను విడుదల చేసిన మావోయిస్టులు

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని తీవ్రవాద ప్రభావిత బిజాపూర్ జిల్లా బస్తర్ ప్రాంతం నుంచి వారం రోజుల క్రితం అపహరించుకు వెళ్లిన సబ్-ఇంజనీర్ అజయ్ లక్రాను (35) మావోయిస్టులు బుధవారంనాడు విడిచిపెట్టారు. ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పనుల కోసం వెళ్లిన అజయ్ లక్రా, ప్యూన్ లక్ష్మణ్‌ పార్తగిరి ఈనెల 11 నుంచి కనిపించకుండా పోయారు. గత వారంలో లక్ష్మణ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టగా, సబ్‌ ఇంజనీర్‌ మాత్రం వారి బందీగా ఉన్నాడు. ఈ నేపధ్యంలో 'జన్ అదాలత్' నిర్వహించి మధ్యాహ్నం ప్రాంతలో గంగ్లూర్ రోడ్డు వద్ద అజయ్ లక్రాను మావోయిస్టులు విడిచిపెట్టారు. అజయ్ లక్రాను విడిచిపెట్టిన సమయంలో అతని భార్య అర్పితా లక్రా కూడా హాజరైనట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.


బందీగా ఉన్న సమయంలో అజయ్ లక్రాను కొట్టడం కానీ, బెదరించడం కానీ చేశారా అనేది ఇంకా స్పష్టం కాలేదని, అతను జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు చేరగానే వైద్య పరీక్షలకు పంపిస్తారని అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా సబ్ ఇంజనీర్‌ను విడిచిపెట్టేలా మావోయిస్టులను ఒప్పించేందుకు పాత్రికేయులు, పౌర సమాజం కార్యకర్తలు ప్రయత్నాలు సాగించాయి.

Updated Date - 2021-11-18T00:27:23+05:30 IST