Abn logo
Sep 13 2021 @ 08:17AM

Sai Dharam Tej యాక్సిడెంట్‌పై ప్రత్యక్ష సాక్షి మాటల్లో.. నా బైక్‌ను ఓవర్‌టేక్ చేసి...!

హైదరాబాద్ సిటీ : తెలుగు సినీ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో.. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ నుంచి దుర్గం చెరువు తీగల వంతెన మీదుగా ఐకియా రోడ్డుపై వెళ్తుండగా కోహినూర్‌ హోటల్‌ సమీపంలో తాను నడుపుతున్న ట్రయంఫ్‌ స్పోర్ట్స్‌ బైక్‌పై నుంచి పడిపోయారు. అయితే ఆయన బండిపైనుంచి పడగానే అబ్దుల్‌ ఫరాన్‌ (ప్రత్యక్ష సాక్షి) అనే కుర్రాడు చూసి సపర్యలు చేయడంతో పాటు అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. ఇతను నిజాంపేట్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో వ్యాలెట్‌ పార్కింగ్‌లో పని చేస్తున్నాడు. అసలు యాక్సిడెంట్‌కు ముందు ఏం జరిగింది..? ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు మీడియాకు వెల్లడించాడు.

ఓవర్‌టేక్ చేసి..

‘‘నా వాహనాన్ని తేజ్‌ ఓవర్‌టేక్‌ చేసి వెళ్లారు. నేను చూస్తుండగానే వెనుక నుంచి దూసుకొచ్చి కిందపడి పల్టీలు కొడుతూ ముందుకు దొర్లిపోయారు. కళ్లముందు అంతా సినిమా ఫైట్‌లా అనిపించింది. తేజ్‌ కింద పడిపోయి ఉన్నాడు. లేపి కూర్చోబెట్టాం. మొదట నేను సాయిధరమ్‌ తేజ్‌ను గుర్తు పట్టలేదు. నీళ్లు తాగించేందుకు ప్రయత్నించా. ఆయన నీళ్లు తాగే స్థితిలో లేరు. షర్టు చిరిగి పోయింది. కిందపడ్డప్పుడు హెల్మెట్‌ ఎగిరిపోయింది. కనురెప్పలపై గాయమై రక్తం కారుతోంది. చాతీ, కాలు ఇతర భాగాల్లో గాయాలయ్యాయి. బైక్‌ హాండిల్‌ బెండ్‌ అయ్యింది. బైక్‌ను తీసి పక్కన పెట్టాం. అతను ఎవరనేది తెలుసుకునేందుకు ప్యాంటు జేబులో నుంచి ఫోన్‌, పర్సు తీసి చూశాం. ఫోన్‌ స్ర్కీన్‌ లాక్‌ ఉండటంతో కాంటాక్ట్స్‌ ఓపెన్‌ కాలేదు. పర్సులో డబ్బులు ఉన్నాయి. ఇతర ఆధారాలు ఏమీ దొరకలేదు’’ అని ఫరాన్‌ చెప్పాడు.


అభినందించారు..

‘‘పర్సు, ఫోన్‌, బైక్‌ కీ అతని జేబులోనే పెట్టేశాం. కొందరు వాహనదారులు సాయి ధరమ్‌తేజ్‌ అని గుర్తించారు. అప్పటికే సుమారు 10 నిమిషాలు గడిచాయి. వాహనదారుల్లో కొందరు 108కు ఫోన్‌ చేశారు. అంబులెన్సు వచ్చాక కొద్ది దూరం దాని వెంట వెళ్లి నాతో పాటు కుటుంబ సభ్యులు ఉండటంతో ఇంటికి వెళ్లి పోయాను. రాయదుర్గం పోలీసులు నాకు ఫోన్‌ చేసి మంచి పని చేశావని  అభినందించారు’’ అని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. తనకు ఇప్పటి వరకు సాయిధరమ్‌ తేజ్‌కుటుంబ సభ్యులను నుంచి ఎలాంటి ఫోన్‌ రాలేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.

అన్ని కోణాల్లోనూ దర్యాప్తు

సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదం కేసును సుమోటోగా స్వీకరించి రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. తేజ్‌పై ఐపీసీ 336, 279, మోటార్‌ వాహన చట్టం 184 కింద కేసు నమోదు చేశారు. ఆ రోజు రాత్రి సుమారు 8.20 గంటలకు ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు అబ్దుల్‌ ఫరాన్‌, ఆసీఫ్‌లను పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బైక్‌ వేగాన్ని అంచనా వేస్తున్నామని పోలీసులు తెలిపారు.


ప్రమాద ఘటన జరిగిన ప్రాంతం నుంచి వెనక్కి వెళ్తూ, అతను బయల్ధేరిన ప్రాంతం వరకు ఎక్కడెక్కడ సీసీటీవీ కెమెరాల్లో సాయిధరమ్‌తేజ్‌ బైక్‌పై వస్తున్న దృశ్యాలు నమోదయ్యాయో సేకరిస్తున్నట్లు సమాచారం. ఏ ప్రాంతంలో ఎంత స్పీడ్‌తో వెళ్లాలి, ఆయన ఎంత స్పీడ్‌తో వెళ్లారు అనే అంశాలపై టెక్నికల్‌ ఎవిడెన్స్‌ సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో రోడ్డుపై ఇసుక ఉండటంతో టీఎస్ఐఐసి (ఐలా) అధికారులకు కూడా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

క్రైమ్ మరిన్ని...