‘కరోనా’ కాటికాపరి

ABN , First Publish Date - 2020-05-28T05:30:00+05:30 IST

కరోనా సోకకుండా మనిషికి మనిషి దూరం పాటిస్తున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్‌ బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు సైతం

‘కరోనా’ కాటికాపరి

కరోనా సోకకుండా మనిషికి మనిషి దూరం పాటిస్తున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వైరస్‌ బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రావడం లేదు. కానీ సూరత్‌కు చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌ మల్బారీ (51) మాత్రం ధైర్యంగా వారి దహన సంస్కారాలు పూర్తి చేస్తున్నారు. గత ముప్పయేళ్లుగా ‘ఏక్తా ట్రస్ట్‌’ స్వచ్ఛంద సంస్థ ద్వారా అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ మతం కన్నా మానవత్వం గొప్పది అని నిరూపిస్తున్నారు. ప్రసిద్ధ జర్నలిస్‌ బర్ఖాదత్‌ ఇటీవల అబ్దుల్‌ రెహ్మాన్‌ను ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా ఆయన వార్తల్లో నిలిచారు.


సూరత్‌లోని జహంగీర్‌ పుర శ్మశాన వాటికలో ఉన్న అబ్దుల్‌ రెహ్మాన్‌ మల్బారీకి నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి నుంచి ఫోన్‌ వచ్చింది. గుజరాత్‌లో కొవిడ్‌-19తో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి (67ఏళ్లు) అంతిమ సంస్కారాలు నిర్వహించాలని చెప్పి ఆ అధికారి ఫోన్‌ పెట్టేశారు. ఎక్కడ ప్రాణాంతక కరోనా వైరస్‌ ఎక్కడ తనకు సోకుతుందేమోనని ఆలోచించకుండా అంబులెన్స్‌లో అథ్వాలైన్స్‌లోని మహవీర్‌ ఆస్పత్రికి చేరుకున్నారు మల్బారీ. ముగ్గురు సహాయకులతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించి, ఉమారాలోని శ్మశాన వాటికలో దహనసంస్కారాలు పూర్తిచేశారు. ‘‘ఈ ముప్పయేళ్లలో అనాథ శవాలను ముట్టుకునే సమయంలో నేను ఎప్పుడూ మాస్క్‌ వేసుకోలేదు. కానీ కరోనా వైర్‌సతో చనిపోయిన కేసులు భిన్నమైనవి. ఆ రోజు నేను ఒంటినిండా నాలుగు జతల రక్షణ దుస్తులు ధరించి మహవీర్‌ ఆస్పత్రికి వెళ్లాను. మృతదేహాన్ని అంబులెన్స్‌లో ఎక్కించుకొని శ్మశానవాటికకు చేరుకున్నాం.


  శవాన్ని దించి, రక్షణ దుస్తుల్ని అక్కడే పడేశాం. తరువాత అంబులెన్స్‌తో సహా మేము నలుగురం డిజ్‌ఇన్‌ఫెక్ట్‌ చేసుకున్నాం. ‘కరోనా మహమ్మారి వల్ల ఏ ఒక్కరూ ప్రాణం విడవొద్ద’ని ఆ దేవుడిని ప్రార్థించి అక్కడి నుంచి బయలుదేరాం’’ అని ఆ రోజును గుర్తుచేసుకున్నారు మల్బారీ. గుర్తుతెలియని మృతదేహాలకు అంతిమ యాత్ర నిర్వహించే ఆత్మీయుడిగా నిలవాలనే ఆలోచనతో 30 ఏళ్ల క్రితం ‘ఏక్తా ట్రస్ట్‌’ను మొదలెట్టారు మల్బారీ. ఇప్పటివరకూ ఆయన 70 వేలకు పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు.


లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా...

కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌తో సంబంధం లేకుండా మల్బారీ తన సేవలను కొనసాగిస్తున్నారు. ‘‘లాక్‌డౌన్‌ వేళలోనూ మా ట్రస్ట్‌ పనుల్లో మేమున్నాం. ప్రజల్లో కొవిడ్‌-19 మీద అవగాహన పెంచుతూనే రోజుకు మూడు గుర్తుతెలియని శవాలకు అంత్యక్రియలు నిర్వహించాం’’ అన్నారాయన. 


మల్బారీ అందిస్తోన్న సేవల్ని గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది. 2013లో ఉత్తరాఖండ్‌ వరదలు, 2009లో చెన్నైలో సునామీ, 2001 కఛ్‌ భూకంపం వంటి ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో మృతదేహాల్ని వెలికి తీయడం, వాటికి దహన సంస్కారాలు పూర్తిచేయడంలో అధికారులకు మల్బారీ, తన బృందంతో సహకారం అందించారు. 

Updated Date - 2020-05-28T05:30:00+05:30 IST