ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట

ABN , First Publish Date - 2021-01-08T08:21:38+05:30 IST

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది.

ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట

అరెస్టుపై తొందరపాటు చర్యలొద్దు

పోలీసులకు హైకోర్టు స్పష్టీకరణ


అమరావతి, జనవరి7 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. నిఘాపరికరాల కొనుగోలు వ్యవహారంలో ఆయన అరెస్టు విషయంలో పోలీసులు రెండువారాల పాటు ఎలాంటి తొందరపాటుచర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, అవినీతి నిరోధక శాఖ డీజీ, సీఐడీ అదనపు డీజీలను ఆదేశించింది. విచారణను జనవరి 18కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.  విచారణ సందర్భంగా.. ఏబీ వెంకటేశ్వరరావు తరఫు సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఏబీ వెంకటేశ్వరరావును పోలీసులు ఏదోవిధంగా అరెస్టు చేసి, 48 గంటల పాటు జైల్లో ఉంచడం ద్వారా సస్పెండ్‌ చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం వాదనలు వినిపిస్తూ, గత ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ...తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషనర్‌ పేర్కొనడం సరికాదన్నారు. ఈ వ్యవహారంలో నేరవిచారణ ప్రారంభం కాలేదని తెలిపారు. ఇరువురి వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పిటిషనర్‌పై రెండువారాలపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు  తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.

Updated Date - 2021-01-08T08:21:38+05:30 IST