చిన్నారులను చేరదీసిన ‘ABN‌-Andhra Jyothi’

ABN , First Publish Date - 2022-01-03T15:01:52+05:30 IST

సరైన ఆహారం లేక బక్కచిక్కిన కొంతమంది చిన్నారులు రోడ్లపై భిక్షాటన చేస్తున్న దృశ్యం ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ బృందం కంటబడింది. సార్‌, మేడం అంటూ రోడ్డుపై వెళుతున్న వారిముందు చేతులు చాస్తున్న చిన్నారులు, అమ్మా, అయ్యా ఒక్క

చిన్నారులను చేరదీసిన ‘ABN‌-Andhra Jyothi’

హైదరాబాద్‌ సిటీ: సరైన ఆహారం లేక బక్కచిక్కిన కొంతమంది చిన్నారులు రోడ్లపై భిక్షాటన చేస్తున్న దృశ్యం ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’ బృందం కంటబడింది. సార్‌, మేడం అంటూ రోడ్డుపై వెళుతున్న వారిముందు చేతులు చాస్తున్న చిన్నారులు, అమ్మా, అయ్యా ఒక్క రూపాయి ధర్మం చేయమని వాహనాల చుట్టూరా తిరుగుతూ ఓ కుర్రాడు, తిండిలేక మూడు రోజులు అవుతుందని దీనంగా చెబుతున్న మరో ఇద్దరు బాలికలు రోడ్డుపై తిరుగాడుతున్న విషయాన్ని ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ నిఘా బృందం గమనించింది. చదువుకోవాల్సిన వయసులో భిక్ష మెత్తాల్సిన అవసరమేమొచ్చిందో అని వారి వివరాలు సేకరించి సాయం చేసే ప్రయత్నం చేసింది. మద్యానికి బానిసై బాధ్యత మరిచిన తండ్రి నిర్వాకంతో ఈ పిల్లలు ఇలా మారారన్న విషయం తెలిసింది.  


 నెక్లెస్‌ రోడ్‌లో భిక్షాటన చేస్తున్న ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు బిహార్‌ నుంచి వలస వచ్చారు. పిల్లల తండ్రి వీరేందర్‌ మద్యానికి బానిసయ్యాడు. భార్య ఇళ్లలో పాచిపనిచేసి పిల్లలను పోషించుకునే ప్రయత్నం చేసింది. కానీ, భర్త వీరేందర్‌ భార్యను కొట్టి ఆ డబ్బులు కూడా తీసుకొని మద్యం తాగేవాడు. తండ్రి చేతిలో దెబ్బలు తినలేక పిల్లలు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తూ రోడ్డుపైకి పరిగెత్తేవారు. ఇంటికి వస్తే తండ్రి చేతిలో పిల్లలు తన్నులు తినడం ఎందుకని భావించిన తల్లి వారిని భిక్షాటన చేసుకొని కడుపు నింపుకోమని చెప్పడంతో వారు రోడ్లపై చేరారు. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ బృందానికి ఈ విషయం చెబుతున్న సమయంలో చిన్నారుల కంట్లో నీరు ఆగలేదు. ఈ పిల్లలకు ఎలాగైనా సాయం చేయాలన్న బాధ్యతతో బృందం తల్లితో మాట్లాడింది. దాంతో ఆమె తన భర్త పెట్టిన బాధలు, వేధింపులు అన్ని కూడా పూసగుచ్చినట్లు చెప్పింది. పిల్లలు బతకాలి అంటే తినాలి.. దానికోసం భిక్షాటన చేసినాపర్లేదు అని భావించి తానే ఈ పని చేయిస్తున్నాని చెప్పి కన్నీటి పర్యంతమైంది. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ బృందం ఈ విషయాన్ని ఓ ఎన్‌జీఓ దృష్టికి తీసుకెళ్లగా పిల్లలకు ఆశ్రయమిచ్చేందుకు అంగీకరించారు.  


కరోనా సమయంలో పస్తులే..

లాక్‌డౌన్‌లో ఈ చిన్నారులు రోజుల తరబడి పస్తులున్నారు. ఆకలికి అలమటించి పోయారు. రోజుల తరబడి నీళ్లు మాత్రమే తాగి కడుపునింపుకున్నారు. తండ్రి వేధింపులు చెబుతున్న పిల్లల మాటలు వింటుంటే ఎవరికైనా గుండె పిండేసినట్లు అనిపించక మానదు.


బాధితులకు చేయూత

‘మాకు చదువుకోవాలని ఉంది.. మంచి ఉద్యోగం చేయాలని కోరిక కూడా ఉంది.. అందరిలాగే మంచి దుస్తులు వేసుకోవాలని, మంచి భోజనం తినాలని ఉంది.. కానీ మాకు సాయం చేసేదెవరు’ అని పిల్లలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వారిని పీపుల్స్‌ హెల్పింగ్‌ చిల్డ్రన్‌ అనే స్వచ్ఛంద సంస్థ సాయమందించేలా ప్రయత్నం చేసింది ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ బృందం. రెండు రోజుల్లో చిన్నారులను వెల్ఫేర్‌ హోంకు తరలించి వారి కోరిక నెరవేరే ఏర్పాట్లు చేసింది. ఇలాంటి కష్టాలు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ముందుంటుంది. ఇలాంటి చిన్నారులకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరుతోంది.

Updated Date - 2022-01-03T15:01:52+05:30 IST