Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోశయ్య పార్థివ దేహానికి ABN ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాష్ నివాళి

హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య పార్ధివదేహానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్, ఆయన తండ్రి వ్యాపారవేత్త ఈశ్వర్ చంద్ నివాళులర్పించారు. రోశయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోశయ్యతో తమకు 40 ఏళ్ల అనుబంధం ఉందని వ్యాపారవేత్త కోగంటి ఈశ్వర్ చంద్ అన్నారు. రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య లో-బీపీతో నేటి ఉదయం తన నివాసంలో పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.


ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా సహా పలు హోదాల్లో రోశయ్య సేవలందించారు. 1968, 74, 80లలో శాసనమండలి సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు రహదారులశాఖ, రవాణాశాఖా మంత్రిగా పనిచేశారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోశయ్య విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థికమంత్రిగా పని చేశారు. ఏడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత 3 సెప్టెంబర్ 2009-25 జూన్ 2011 వరకూ ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య బాధ్యతలు చేపట్టారు. ఆగస్ట్ 2011 నుంచి ఆగస్ట్ 2016 వరకూ తమిళనాడుకు గవర్నర్‌గా రోశయ్య పని చేశారు.

Advertisement
Advertisement