Abn logo
Oct 15 2020 @ 19:07PM

ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించిన ఏబీఎన్

హైదరాబాద్: ఈ పదకొండేళ్ల ప్రస్థానంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎన్నెన్నో ప్రయోగాలు చేసింది. సమకాలీన యుగంలో ప్రజలకు ఏది అవసరమో అధ్యయనాలు కూడా చేసింది. పలు మైలురాళ్లను అధిగమించింది. సమాచార యజ్ఞంలో తనదైన ప్రత్యేకతను నిత్యం చూపెడుతోంది. ప్రజలకే నిర్ణయాధికారం వదిలేస్తోంది. 


1 రాజ్‌భవన్‌లో రాసలీలలు

2. బిగ్‌ డిబేట్‌ 

3. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే

4. వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్కే

5. నీ బడి పిలుస్తోంది

6. యంగిస్థాన్‌

7. ఇన్‌సైడ్‌ / న్యూస్‌రూమ్‌ అప్‌డేట్స్‌

8. పాయల్‌ ఘోష్‌ వంటి బాధితులకు అండ

9. రెడ్‌ అలర్ట్‌

10. ది డిబేట్‌

11. కిర్రాక్‌ న్యూస్‌ 

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.. ప్రయోగాలకు కేరాఫ్‌ అడ్రస్‌. దమ్మున్న వార్తలకు డెస్టినేషన్‌. స్పెషల్‌ డిబేట్స్‌కు అసలైన స్క్రీన్‌. ఛానెల్‌ ప్రారంభమైంది మొదలు.. యేటికేడూ తన ప్రసారాలకు పదును పెంచుకుంటూనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలకు తనదైన శైలిలో రూపకల్పన చేస్తూనే ఉంది. జనానికి ఏది అవసరమో అది అందరికంటే ముందే టెలికాస్ట్‌ చేస్తోంది. 


ఈ ప్రయాణంలో ఎన్నెన్నో మైలురాళ్లను అధిగమించింది ఏబీఎన్. ప్రజలకు అవసరమైన, ప్రజా ప్రయోజన మైన, బాధితులకు ఆసరాగా ఉండే కథనాలను అందిస్తూనే ఉంది. వార్తల ప్రసారమే కాదు.. వార్తల వెనక ఉన్న వాస్తవాలను కూడా శోధిస్తూ స్టోరీలను రూపొందిస్తోంది. నిజాల నిగ్గు తేలుస్తూ.. అక్రమార్కుల భరతం పడుతూ, అవసరార్ధుల ఆవేదనను ప్రదర్శిస్తూ.. శరవేగంగా దూసుకెళ్తోంది.

ఏబీఎన్‌ ఎవరికీ భయపడదు. ఎలాంటి కథనం ప్రసారం చేయడానికైనా వెనుకాడదు. ఎవరి గుట్టును బయట పెట్టడానికైనా జంకు చూపించదు. ఏ ఉన్నతాధికారి తప్పు చేసినా, ఏ వ్యవస్థల్లో పొరపాట్లు దొర్లినా ఉన్నది ఉన్నట్లు, నిజమైన, నిఖార్సైన కథనాలను ప్రసారం చేస్తుంది. ఆధారాలతో సహా బయటపెడుతుంది. ఒక అధికార భవనంలో జరిగిన రాసలీలల వ్యవహారాల గుట్టును ధైర్యంగా ప్రసారం చేసింది దమ్మున్న ఛానెల్‌ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ కథనం ప్రకంపనలు సృష్టించింది. 


ఏ పరిణామం ఎదురైనా, ఏ సంఘటన జరిగినా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ప్రజలకు ఆపద ఎదురవుతోందని తెలిసినా, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు.. జనానికి ఇబ్బందులు కలిగిస్తాయని తెలిసినా, నష్టదాయకంగా పరిణమించినా చూస్తూ ఊరుకోలేదు ఏబీఎన్‌. బిగ్‌డిబేట్‌లు నిర్వహిస్తూ వస్తోంది. ప్రభుత్వ పెద్దలను, అధికారులను, విశ్లేషకులను, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి చర్చలు నిర్వహిస్తోంది. ప్రభావితమయ్యేవాళ్లను, పరిష్కారాలు చూపించే నిర్ణేతలను ముఖాముఖిగా కూర్చోబెట్టి సమస్యలను, నిర్ణయాలను విశ్లేషిస్తోంది. ఆ ఒరవడిని అలాగే కొనసాగిస్తూ ఉంది. 

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే. ఈ కార్యక్రమం గురించి తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదనడంలో అతిశయోక్తి లేదు. అది ప్రసారమయ్యే సమయానికి ఆర్కే నిర్వహించే ఓపెన్‌ హార్ట్‌ కార్యక్రమం కోసం టీవీలను అతుక్కుపోయే వీరాభిమానులను సంపాదించుకుంది. ప్రముఖుల అంతరంగాన్ని, వాళ్ల మనసుల్లోని ఆలోచనలను వడపోత లేకుండా, సెన్సార్‌షిప్‌ లేకుండా ప్రసారం చేసిందీ కార్యక్రమం. ఓపెన్‌ హార్ట్‌లో అస్త్రాల్లా దూసుకెళ్లే ఆర్కే ప్రశ్నలకు ఎదురుగా ఎవరున్నా సరే.. సూటిగా సమాధానం రావాల్సిందే. అసలు విషయం బయటకు తెలియాల్సిందే.


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అంతరాత్మ వేమూరి రాధాకృష్ణ. నిరంతర సమాచార స్రవంతిని నిక్కచ్చిగా ప్రసారం చేస్తూనే.. వారానికోసారి వీకెండ్‌ కామెంట్‌లో రాజకీయ, సామాజిక లోగుట్టును ఆవిష్కరిస్తారు ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ. బయటకు రాని ఎన్నో విషయాలను, ఎన్నెన్నో సంభాషణలను ముక్కుసూటిగా తన కలంతో జాలువారుస్తారు. వర్తమాన రాజకీయ పరిణామాలను సునిశితంగా విశ్లేషిస్తారు. ఎవరి బండారం ఏంటో కుండబద్దలు కొడతారు.

ఏబీఎన్‌ వార్తా స్రవంతిని ప్రజల ముందుకు తేవడమే కాదు.. సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తోంది. వార్తా కథనాలే కాకుండా, ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు రూపొందించి ప్రజలను కూడా భాగస్వాములను చేస్తోంది. 'నీ బడి పిలుస్తోంది' అంటూ.. చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకునేలా చేయడమే కాదు.. ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్లకు.. ఆ చిన్ననాటి పాఠశాల పరిస్థితిని చూపించి అండగా నిలవాలన్న ఆకాంక్షను రేకెత్తించింది. వాళ్ల బాధ్యతగా గుర్తు చేసింది. నేటి యువతే రేపటి దేశ భవిత' అన్న వాస్తవాన్ని చదువుకునే రోజుల నుంచే విద్యార్థులకు గుర్తు చేసింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. యంగిస్థాన్‌ అంటూ యంగ్‌ పీపుల్‌ ఆశలు, ఆశయాలకు పదును పెట్టింది. ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లి.. యువత కర్తవ్యాన్ని గుర్తు చేశారు. వాళ్ల మనసుల్లో ఉన్నతమైన ఆలోచనలు నాటారు. 


రాజకీయాల లోగుట్టును  క్షేత్రస్థాయి నుంచి పసిగట్టి తెరమీదకు తేవడమే ఇన్‌సైడ్‌ ఉద్దేశ్యం. క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ అందరి కంటే ముందుగా సమాచారాన్ని ప్రేక్షకులకు అందిస్తూ న్యూస్‌రూమ్‌ అప్‌డేట్స్‌ దూసుకెళ్తున్నాయి. ఏబీఎన్‌ టీమ్.. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటూ, చురుకైన పాత్రను పోషిస్తూ సంస్థ ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా వార్తా ప్రసారాలకు మెరుగులు దిద్దుతోంది.

ఆపద వస్తే.. ఏబీఎన్‌ అండగా ఉంటుందన్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాల ప్రజల మదిలో మెదులుతుందన్నది అక్షర సత్యం. అలా.. ఎన్నో, ఎన్నెన్నో కష్టాలను కడతేర్చేలా బాధితులకు తోడ్పాటునిచ్చింది ఏబీఎన్‌. గుట్టుగా సాగించే అరాచక పర్వాలను తెరపై చూపించింది. ప్రజలముందుకు నివేదికను తెచ్చి.. నిర్ణయాధికారం ప్రజలకే అప్పగించింది. మొన్నటికి మొన్న పాయల్‌ఘోష్ తనకు ఎదురైన చేదు అనుభవాలను ఏబీఎన్‌ వేదికగా ప్రపంచానికి చెప్పుకుంది. ముంబై పోలీసులు ఈ కేసును ఇప్పుడు సీరియస్‌గా తీసుకొని, పాయల్‌ఘోష్‌కు అండగా నిలబడ్డారు.


రెడ్‌ అలర్ట్‌. నేరవార్తల ప్రసారంలో ఓ సంచలనం. నేరాలు, దారుణాలను రిపోర్ట్‌ చేయడమే కాదు.. వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లనూ పట్టి లాగుతోంది రెడ్అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేసేలా.. నటీనటులతో సీన్‌ టూ సీన్‌ రికార్డ్‌ చేసి ప్రసారం చేస్తోంది. క్రైమ్‌ న్యూస్‌ ఒరవడిలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ప్రభుత్వాల్లో చర్చలు, రాజకీయ రచ్చలను ఏ మొహమాటం లేకుండా కడిగి పారేస్తోంది ది డిబేట్‌. ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ వెంకట కృష్ణ సాగించే ది దిబేట్‌ ప్రేక్షకుల్లో ఆలోచన రేకెత్తించేలా సాగుతోంది. పొలిటికల్‌ అప్‌డేట్స్‌పై ఎవరి ఒపీనియన్‌ ఏంటన్నది ఏబీఎన్‌ వేదికగా ది డిబేట్‌ చూపిస్తోంది.


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఇప్పుడు 11వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 12వ యేట అడుగుపెడుతోంది. ప్రేక్షకులకు వార్తలు, వార్తా విశ్లేషణలు ఎంతగా అవసరమో, కాస్తంత ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా అంతే అవసరం. గతంలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసింది. ఇప్పుడు 11వ పుట్టినరోజు కానుకగా.. కిర్రాక్‌ న్యూస్‌తో ప్రజల రోజువారీ దినచర్యను కాస్త కూల్‌గా ముగించేలా ప్లాన్‌ చేసింది.

ఇవేకాదు.. ఇంకా ఎన్నో, ఎన్నెన్నో ప్రత్యేక కార్యక్రమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాహసోపేతమైన రిపోర్టింగ్‌ ఏబీఎన్ సొంతం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బాధితుల చెంతకు చేరి వార్తా కథనాలను, వాళ్ల కష్టాలను తెరపై చూపిస్తోంది. తెలంగాణలో నిషేధం అమలైనా అదరక, బెదరక తనదైన ఒరవడిని సాగించింది. మీడియా స్వేచ్ఛపై జరిగిన దాడిని న్యాయస్థానమే గుర్తించి, నిలదీసి పాలక పక్షంపై కన్నెర్ర జేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లోనూ అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రేక్షకులే ఏబీఎన్‌ కోసం గర్జించారు, నినదించారు.. తమ దమ్మున్న, దుమ్మురేపే, మనసున్న ఛానెల్‌ను సాధించుకున్నారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతి గుమ్మంలో అడుగుపెట్టే విధంగా ప్రేక్షకులే సైనికులుగా పోరాడారు. ఇక, ప్రస్తుతం కొనసాగుతున్న అమరావతి ఉద్యమంలోనూ ప్రజల ఆకాంక్షను బలంగా ఎత్తిచూపుతోంది ఏబీఎన్‌. 


సాహసమే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిని నడిపిస్తోంది. ఫలితంగా మనసున్న చానెల్‌గా బాధితుల పక్షాన నిలుస్తోంది. ఉరిమే ఉత్సాహాలకు, వెల్లివిరిసే సంతోషాలకు వేదికగా ఉంటోంది. వియ్‌ రిపోర్ట్‌.. యూ డిసైడ్‌ అంటూ ప్రేక్షకులే స్వచ్ఛందంగా తమ ఛాయిస్‌ ఏంటో నిర్ణయించుకునే, తమకు ఏది కావాలో అది ఎంచుకునే అవకాశం కల్పించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.

జనం గుండె గొంతుకగా నిలుస్తోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. తొలినుంచీ జనాభిప్రాయానికి మారుపేరుగా కొనసాగుతూ ఉంది. ఇకపై కూడా అలాగే ఉంటుందని హామీ ఇస్తోంది. ఎప్పటికీ జనం మనోగతాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటుందని భరోసా ఇస్తోంది. ఏ జెండాతో ఏబీఎన్‌కు పనిలేదు. ఎందుకంటే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిది ప్రజల ఎజెండా. అందుకే ప్రజలే ఏబీఎన్‌కు సర్వదా అండ.


- సప్తగిరి గోపగాని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి.

ప్రత్యేకంమరిన్ని...