YS Jagan కండీషన్ మాకు వర్తించదు.. మేం ఐదేళ్లూ మంత్రి పదవుల్లోనే.. ఇంత ధీమా ఎలా వచ్చింది..!?

ABN , First Publish Date - 2021-08-10T20:39:19+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పెట్టిన కండీషన్‌ తమకు వర్తించదని....

YS Jagan కండీషన్ మాకు వర్తించదు.. మేం ఐదేళ్లూ మంత్రి పదవుల్లోనే.. ఇంత ధీమా ఎలా వచ్చింది..!?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి పెట్టిన కండీషన్‌ తమకు వర్తించదని ఆ జిల్లా మంత్రులు సంతోషిస్తున్నారట. హైకమాండ్ చెప్పిన పనిని తూచా తప్పకుండా చేస్తున్నందున మినిస్టర్స్‌ పోస్టులు ఫైవ్‌ ఇయర్స్‌ గ్యారంటీ అనుకుంటున్నారట. సొంత జిల్లాలో కనుచూపు మేరలో కూడా మంత్రి పదవి ఆశించే స్థాయి ఎమ్మెల్యేలు కూడా లేరని ధీమాగా ఉన్నారట. ఇంతకీ ఏజిల్లా మంత్రులు తమ పదవులపై అంత నమ్మకంతో ఉన్నారు. వారిపై జగన్‌కు అంతనమ్మకముందా? లేదంటే జగన్‌పై వారికి నమ్మకముందా? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


మాకు రూల్స్ లేవ్.. పదవుల గ్యారంటీ!

విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణది ప్రత్యేకమైన స్టైల్‌. తాను ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే బొత్సకు మంత్రి పదవి గ్యారంటీ. నాడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనైనా, నేడు వైసీపీ సర్కార్‌లోనైనా సత్తిబాబు సత్తాఏందో అందరికీ తెలుసు అంటున్నారు ఆయన అనుచరులు. జగన్మోహన్‌రెడ్డి అధికారంలో రావడంతోనే మంత్రి పదవులు రెండున్నరేళ్లే అని అమాత్యులకు అప్పుడే చెప్పారు. అయితే అందులో కొందరికి వెసులుబాటు ఉంటుందని ఆ కొందరిలో విజయనగరం జిల్లా మంత్రులు బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి మినహాయింపు ఉంటుందని వారి అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మంత్రి పదవి ఆశించే వైసీపీ ఎమ్మెల్యేలను నిరాశతప్పదని చెబుతున్నారు.


మంత్రులు బొత్స, పుష్ప శ్రీవాణిలు హైకమాండ్ దగ్గర పరపతి కొనసాగిస్తుండంతో జిల్లాలో మంత్రి పదవి ఆశిస్తున్నవారి ఆశలు అడియాసలేనని అమాత్యుల అనుచరులు అంటున్నారు.


రాజన్నదొర, కోలగట్ల నుంచి పోటీ! 

బొత్స సత్యనారాయణకు, పుష్ప శ్రీవాణికి మంత్రి పదవుల పోటీ విషయంలో జిల్లా నుంచి సాలూరు శాసనసభ్యుడు రాజన్నదొర, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేర్లు వినిపిస్తుంటాయి. అయితే పుష్ప శ్రీవాణి పదవికి గట్టి పోటీ ఇస్తున్న సాలూరుకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు రాజన్నదొర  ముక్కుసూటితనం ఆయనకు మైనస్‌ అనే మాట జిల్లాలో వ్యక్తమవుతోంది.పార్టీ పట్ల అయినా.. ప్రతిపక్షం పట్ల అయినా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేతగా పేరున్న రాజన్నదొర నొటి చలువ కూడా తమ నేత పదవి పది కాలాల పాటు పదిలంగా ఉండేలా చేస్తుందని పుష్పశ్రీవాణి వర్గీయులు పదే పదే ఇక్కడ చెబుతుంటారు. మరోవైపు స్వపక్షం, విపక్షం కంటే ఎక్కువగా కుటుంబం నుంచే మామ శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు రూపంలో పుష్ప శ్రీవాణికి  అప్పుడప్పుడు సెగ తగులుతోంది. అయితే ఇది టీ కప్పులో తుఫాన్‌ అని ఆమె వర్గం అంటోంది.


పుష్ప శ్రీవాణికి ఢోకాలేదు!

ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సొంత నియోజకవర్గానికే పరిమితం అవుతారనే తీవ్ర విమర్శ ఉన్నప్పటికీ తనపని తాను చేసుకుపోతుండటంతో ఆమె పదవికి ఢోకా లేదని అనుచరులు అనుకుంటున్నారు. పరిపాలనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర ఇంతవరకు అస్సలు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రి పట్ల ప్రదర్శించే వినయ విధేయతలే తమ నేత పదవికి శ్రీరామ రక్ష అంటున్నారు. ఇటీవల అమరావతిలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో దిశ చట్టం రూపకల్పన మొదలు కొని దిశ యాప్ వరకు హోం మంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పరిశ్రమ కూడా చాలా వుందని ముఖ్యమంత్రి జగన్మోహణరెడ్డి బహిరంగ సమావేశంలో పొగడంతో తన పదవికి ఢోకా లేదన్నది వాస్తమని పుష్పశ్రీవాణి ధీమాను వ్యక్తం చేస్తున్నారట.! 


ఉత్తరాంధ్రపై విజయసాయి సీసీ కెమెరా కళ్లు!

వైసీపీలోని సీనియర్ల కదలికలపై పూర్తి స్థాయిలో సీసీ  కెమెరా వంటి కళ్లు పెట్టుకొని మరీ విశాఖలో విజయసాయిరెడ్డి మకాం వేశారు. దీంతో కెరటం వచ్చినప్పుడు తల వాల్చితే..! తరువాత తానే మొనగాడన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. క్లిష్ట సమస్య వచ్చినప్పుడు జిల్లాలోని పార్టీకి తానే పెద్ద దిక్కు అన్న మాటను బొత్స నిలబెట్టుకుంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. తన సామాజికవర్గం నుండి కూడా ఉత్తరాంధ్రాలో వీరాభిమానులు ఉండటం ఆయన పదవికి ఢోకా లేదనే వాదన వస్తోంది. ఎటు నుండి ఎటు చూసినా తమ నేత కుర్చీ కదిపే సాహసం పార్టీలో ఎవరూ చేయరని..! ఆ పరిస్థితిని తమ నేత బొత్స తెచ్చుకోరని అనుచరులు, అభిమానులు తెగేసి చెబుతున్నారు.


కోలగట్ల కూతురుకు పదవి.. మంత్రి పదవి లేనట్లే!

విజయనగరం నియోజకవర్గం నుండి మంత్రి పదవి ఆశించిన స్థానిక శాసనసభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామికి మాత్రం కనుచూపు మేరలో ఆ యోగం ఆవిరైనట్టేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆయనకు మంత్రి పదవికి బదులుగా  కుమార్తెకు కార్పొరేషన్ డిప్యూటీ ఛైర్మెన్ పదవిని పార్టీ అందించిందని నేతలు అంటుంటారు. కార్పొరేషన్ డివిజన్ అభ్యర్ధుల కేటాయింపు మొదలుకొని.. చైర్మెన్ పదవీ పంపకాలు వరకు కోలగట్ల కోటరీ కనుసన్నల్లోనే స్థానిక పెత్తనం అంతా కొనసాగుతూ వచ్చేలా పార్టీ అవకాశం కల్పించింది.





Updated Date - 2021-08-10T20:39:19+05:30 IST