YS Jagan Cabinet : ఆ ఇద్దరిలో ఒకరికి Minister పదవీ గండం.. Tammineni కి చిగురిస్తున్న ఆశలు.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-08-29T19:04:12+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో అతికొద్ది మంది సీనియర్ పొలిటీషియన్లలో ఆయన కూడా ఒకరు. ..

YS Jagan Cabinet : ఆ ఇద్దరిలో ఒకరికి Minister పదవీ గండం.. Tammineni కి చిగురిస్తున్న ఆశలు.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి.. ఏం జరుగుతుందో..!?

  • తమ్మినేనికి కేబినెట్ బెర్త్ దక్కేనా?
  • స్పీకర్ బాధ్యతలు చేపట్టిన పలువురు నేతలు రాజకీయాలకు ఎందుకు దూరమయ్యారు?
  • సెంటిమెంట్ రిపీట్ అవుతుందనే ఆందోళనలో తమ్మినేని అనుచరులు?
  • ఇప్పటికే అధిష్టానానికి మనసులో మాట చెప్పిన తమ్మినేని?
  • తమ్మినేని ఆశలు ఈ సారైనా నెరవేరుతాయా?

ఆంధ్రప్రదేశ్‌లో అతికొద్ది మంది సీనియర్ పొలిటీషియన్లలో ఆయన కూడా ఒకరు. ఇప్పటి వరకూ ఆ పెద్దాయన చేపట్టని పదవులూ లేవు. కానీ ప్రస్తుత కేబినెట్ లో మంత్రి పదవి కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారట. ప్రస్తుతం కీలక పదవిలో ఉన్నప్పటికీ.. ఆ కుర్చీలో అయిష్టంగానే కూర్చుంటున్నారట. ఆ సీనియర్ నేత మంత్రి పదవి కోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు..? ఇంతకీ ఎవరా నాయకుడు..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


ఆశలు నెరవేరుతాయా.. ఈ పదవిలోనే కొనసాగుతారా?

రాజకీయాల్లో ఉన్నత పదవులు ఆశించటం సర్వసాధారణం. కానీ అదృష్టం, అవకాశం కలిసివస్తేనే నాయకులకు ఆ పదవులు దక్కుతాయి. మూడు, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రిపదవులు దక్కని నేతలు తెలుగు రాష్ట్రాల్లో చాలా మందే ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ఇలాంటి నేతలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కానీ కొందరు నేతలు మాత్రం అన్ని పదవులూ అనుభవించినా.. ఇంకా పదవుల కోసం తాపత్రయ పడుతూనే ఉంటారు. తాను ఎంతగానో ఆశపెట్టుకున్న, ఆశించిన పదవి దక్కకపోతే.. వారిలో నిరాశ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.


జగన్ మంత్రివర్గంలో బెర్త్ ఆశించిన సీతారాం..

స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఏపీలో పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు. తమ్మినేని నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాలు చేస్తున్నారు. మొదట టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన సీతారాం.. ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు అసెంబ్లీ స్పీకర్ పదవి దక్కింది. తమ్మినేనికి స్పీకర్ పదవిపై మొదటి నుంచీ అంతగా ఆశక్తి లేదు. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అధికార పార్టీ నేతల్లో ఆయన సీనియర్ కూడా కావడంతో మంత్రి వర్గంలో ఆయనకు బెర్త్ ఖాయమని అందరూ అనుకున్నారు. చివరి నిమిషంలో ఊహించని విధంగా తమ్మినేనిని స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టారు.


ఆ ఇద్దరిలో ఒకరికి పదవీ గండం తప్పదా?

ఇలాంటి పరిస్ధితుల్లో వచ్చే కేబినెట్ విస్తరణలోనైనా మంత్రి పదవి దక్కించుకోవాలని తమ్మినేని ప్రయత్నిస్తున్నారట. దీనికోసం ఇప్పటికే సీఎం జగన్ తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలు చూస్తున్న విజయసాయి రెడ్డితో తన మనసులో మాట చెప్పేశారట. చూద్దాం.. చేద్దాం.. అన్న హామీ తప్పా, అధిష్టానం నుంచి తమ్మినేనికి ఆశించిన స్థాయిలో భరోసా దక్కలేదని జిల్లాలో టాక్. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాసు, సీదిరి అప్పలరాజులు మంత్రులుగా కొనసాగుతున్నారు. జిల్లాలో మార్పు చేయాలనుకుంటే ఈ ఇద్దరిలో ఒకరికి పదవీ గండం తప్పదు. కానీ ప్రస్తుతం ఆ పరిస్ధితులు కనిపించటం లేదు. సీనియర్ నేత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా మంత్రి పదవి కోసం ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది. దీంతో తమ్మినేని తన ప్రయత్నాలను గట్టిగానే చేస్తున్నట్టు సమాచారం.


అనుచరులను గత చరిత్ర వెంటాడుతోందా..?

కీలక పదవుల్లో ఒకటైన సభాపతి స్ధానాన్ని తమ్మినేని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు అనే సందేహాలు జిల్లా వాసుల్లో కలుగుతున్నాయట. మరోవైపు, గత చరిత్ర ఇపుడు సీతారాం వర్గాయులను కలవర పెడుతోందట. గతంలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన పలువురు నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్లుగా పని చేసిన కావలి ప్రతిభాభారతి, కిరణ్ కుమార్ రెడ్డి, నాదెండ్ల మనోహర్ పాలికిట్స్ దూరమయ్యారు. రాష్ట్రవిభజన తర్వాత తెలంగాణలో మొదటి స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన మధుసూధనాచారి, ఏపీలో కోడెల శివప్రసాధ్ లాంటివారు ఆ తర్వాత క్రీయాశీల రాజకీయాల్లో కనిపించలేదు. దీంతో తమ నాయకుడికి అలాంటి పరిస్ధితి వస్తుందేమో అన్న టెన్షన్ లో ఉన్నారట ఆముదాలవలస అధికార పార్టీ నేతలు.


మళ్లీ మంత్రి పదవిపై ఆశలు చిగురిస్తున్నాయా?

వాస్తవానికి తమ్మినేని శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ లీడర్. అముదాలవలస నుంచి దశాబ్ధ కాలం విరామం తర్వాత, ఎమ్మెల్యేగా గెలుపొందారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ఆయన అనుచరులు అప్పట్లో తమ నాయకుడికి మంత్రిపదవి ఖామమని బావించారు. కానీ చివరి నిమిషంలో స్పీకర్ పదవి దక్కింది. అయిష్టంగానే స్పీకర్ పదవిని నెట్టుకొస్తున్న తమ్మినేనికి మళ్లీ కేబినెట్ ఆశలు చిగురిస్తున్నాయట. త్వరలో మత్రివర్గ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతుండటంతో సీతారాం ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలు ప్రారంభించేశారట.


మంత్రి పదవిపై సీతారాంకు ఎందుకింత ఆసక్తి..!

టీడీపీలో ఉన్నప్పడు ఎన్టీఆర్, చంద్రబాబుల హాయంలో సీతారాం మంత్రిగా పని చేశారు. అనంతర రాజకీయ పరిణామాల్లో తమ్మినేని పార్టీలు మారుతూ వచ్చారు. ఎన్నో కీలక పదవులు అనుభవించిన సీతారాం.. మళ్లీ మంత్రి పదవిపై ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారో ఆయన సన్నిహితులకు సైతం అర్ధం కావటం లేదట. ఇంతకీ తమ్మినేని ఆశలు ఈ సారైనా నెరవేరుతాయా? లేక అయిష్టంగానే స్పీకర్ కుర్చీలో కొనసాగాల్సి వస్తుందో మంత్రివర్గ విస్తరణతో తేలిపోనుంది.



Updated Date - 2021-08-29T19:04:12+05:30 IST