Abn logo
Sep 30 2021 @ 15:12PM

YSRCP MLA Roja సొంత నియోజకవర్గంలో ఎందుకింత రచ్చ.. రచ్చ చేశారు.. ఇలా జరిగితే సరే లేకుంటే పరిస్థితేంటో..!?

వైసీపీ ఎమ్మెల్యే రోజా సొంత నియోజకవర్గం నగరిలోని నిండ్ర మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలో రచ్చ ఎందుకు జరుగుతోంది? అక్కడ చోటుచేసుకున్న వివాదం.. వైసీపీకి గానీ, రోజాకు గానీ మేలు చేస్తుందా? లేదా కీడు చేస్తుందా? స్వపక్షంలోని ఏ ఇద్దరు ముఖ్య నాయకులపై రోజా రగిలిపోతున్నారు? దాని పర్యవసానం ఎలా ఉండనుంది? అనే విషయాలు ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


అసలేం జరిగింది..!?

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే నిండ్ర ఎంపీపీ ఎన్నికలో తలెత్తిన రగడ మాత్రం కొనసాగుతోంది. తొలుత ఈనెల 24న కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు. మళ్లీ మరుసటి రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి ఎనిమిది మంది ఎంపీటీసీలు హాజరయ్యారు. శ్రీశైలం ఆలయ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ చక్రపాణిరెడ్డి సోదరుడు, వైసీపీ నేత భాస్కర్‌రెడ్డి వర్గీయులైన ఐదుగురు ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా... నగరి ఎమ్మెల్యే రోజా, ఆమె వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు అడ్డుకున్నారు.

వాగ్వాదాలు, నినాదాలతో దద్దరిల్లింది..! 

ఎన్నికల అధికారి విధులకు ఆటంకం కలిగిస్తూ.. పోడియం వద్ద నినాదాలు చేస్తూ.. రెడ్డివారి భాస్కర్‌రెడ్డి వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. విప్‌ జారీ చేసి, వాటిలో సంతకం పెట్టి ఇచ్చేవరకు ప్రమాణ స్వీకారానికి అనుమతించబోమని భీష్మించుకున్నారు. విప్‌కు, ప్రమాణ స్వీకారానికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నికల అధికారులు ఎంత చెప్పినా.. ఎమ్మెల్యే రోజా, ఆమె వర్గీయులు అంగీకరించలేదు. పరస్పరం వాగ్వాదాలు, నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. చివరకు రిటర్నింగ్‌ అధికారి భాస్కరయ్య ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

రచ్చ.. రచ్చే..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా, ఆమె వర్గీయులు రచ్చరచ్చ చేయడంతో రిటర్నింగ్‌ అధికారి భాస్కరయ్య ఒత్తిడికి లోనయ్యారు. ఒక దశలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వైద్యాధికారులు ప్రథమ చికిత్స చేసి ఆయన్ను ఇంటికి పంపారు. ఎన్నిక వాయిదా వేసిన తర్వాతే ఎమ్మెల్యే రోజా, తన వర్గంవారితో కలిసి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లారు. అయితే బయట కూడా ఇరువర్గాల వారు నినాదాలకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఇరువర్గాల వారిని వారించారు. చక్రపాణిరెడ్డి, తన వర్గంతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.

నేను ఓడిపోతే...! 

‘న్యాయం జరిగే వరకూ మేము సమావేశ మందిరం వదిలి వెళ్లే ప్రసక్తే లేదు’ అంటూ భాస్కర్‌రెడ్డి వర్గీయులైన ఎంపీటీసీలు సైతం భీష్మించుకున్నారు. ఈ సందర్భంగా చక్రపాణిరెడ్డి.. ఎమ్మెల్యే రోజాకు సవాల్‌ విసిరారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని రోజాకు ఛాలెంజ్‌ విసిరారు. "నేను ఇండిపెండెంటెంట్‌గా పోటీకి దిగుతా... ఒకవేళ నేను ఓడిపోతే నీకు సేవకుడిగా పని చేస్తా... నీవు ఓడిపోతే ఏమి చేస్తావో నువ్వే చెప్పు"అని చక్రపాణి రెడ్డి అన్నారు. అయితే అక్కడేమీ మాట్లాడని రోజా.. మరుసటి రోజున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. చక్రపాణిరెడ్డి వర్గంపై ఫిర్యాదు చేసి.. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరినట్లు సమాచారం.

రోజా ఇంత రచ్చ ఎందుకు చేశారో..!

నగరి నియోజకవర్గంలో ఓ మారుమూల ఉన్న నిండ్ర మండల పరిషత్‌ అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యే రోజా స్వయంగా రంగంలోకి దిగి.. అక్కడే గంటలు గంటలు ఉండి, ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు? అనేది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. దీని విషయంగా ఆరా తీస్తే.. నగరికి తాను మాత్రమే రాణిగా ఉండాలని ఎమ్మెల్యే రోజా కోరుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. నిజానికి నగరిలో రెడ్డివారి చక్రపాణిరెడ్డి కుటుంబం రాజకీయంగా బలమైంది. 1978 నుంచి నగరిలో కీలకంగా వ్యవహరిస్తోంది ఆ కుటుంబం. అలాంటి రాజకీయ బలం కలిగిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆయన సోదరుడు భాస్కర్‌రెడ్డి ఏ మాత్రం ఎదిగినా.. తనకు ఇబ్బంది అన్న ఆలోచనతోనే రోజా వారిని తొక్కేయాలని చూస్తున్నారట. రెడ్డివారి చక్రపాణి రెడ్డి 2014 నుంచి నగరి ఎమ్మెల్యే టిక్కెట్టును అడుగుతున్నారు. హామీ ఇచ్చినా నెరవేర్చలేని పరిస్థితిలోనే ఈసారి ఆయనకు రాష్ట్రస్థాయి శ్రీశైలం ఛైర్మన్ పోస్టు ఇచ్చారు. దీంతో ఆయన మరింత జనాదరణ పొందుతున్నారు. ఇది ఓర్వలేకనే ఎమ్మెల్యే రోజా రచ్చ చేస్తున్నారని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇలా జరిగితేనే రోజాకు ఊరట..!

నిండ్ర ఎంపీపీ ఎన్నికల్లో రోజాకు ఎలాగూ అవమానం తప్పేట్టు లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే- నిండ్రలో ఎటూ చక్రపాణి రెడ్డి వర్గమే ఎంపీపీ అవుతుందన్న వాదనలు బలంగా ఉన్నాయి. చక్రపాణిరెడ్డి వర్గీయులు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఎంపీపీ ఎన్నికలో ఆ వర్గం గెలిస్తే.. ఇంతలా రచ్చరచ్చ చేస్తున్న రోజాకు ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుందని అంటున్నారు. ఇక చక్రపాణిరెడ్డిని, ఆయన వర్గాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పెద్దిరెడ్డిని రోజా కోరారు. ఒకవేళ చక్రపాణిరెడ్డి వర్గాన్ని సస్పెండ్ చేయకపోతే రోజా పంతం నెగ్గదు. చక్రపాణిరెడ్డిని సస్పెండ్ చేస్తే రోజాకు కొంత ఊరట లభించవచ్చు. మొత్తంపై హుందాగా ఉండాల్సిన అంశంలో ఇలా రోడ్డున పడిన రోజా తీరు చర్చనీయాంశం అవుతోంది.


ఇవి కూడా చదవండిImage Caption