TDP ఎమ్మెల్యే గోరంట్ల సంచలన ఆరోపణలపై YSRCP యంగ్ ఎంపీ మౌనమెందుకు.. పసలేదని సొంతపార్టీలో గుసగుసలు.. కోట్ల కథేంటో..!?

ABN , First Publish Date - 2021-11-06T20:04:01+05:30 IST

కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎగతాళి చేయడం అందరికీ తెలిసిన పాత సామెత...

TDP ఎమ్మెల్యే గోరంట్ల సంచలన ఆరోపణలపై YSRCP యంగ్ ఎంపీ మౌనమెందుకు.. పసలేదని సొంతపార్టీలో గుసగుసలు.. కోట్ల కథేంటో..!?

కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎగతాళి చేయడం అందరికీ తెలిసిన పాత సామెత. అయితే కొండను తవ్వి వైసీపీ నేతలు కోట్లు ఎలా సంపాదించారో రుజువుచేసే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్ష టీడీపీ. కొండ నుంచి కోట్లు దండుకుని చెరువు చేయడమే కాకుండా పేదవారి గుండెచెరువయ్యేలా అక్కడే ఇళ్ల స్థలాలు కేటాయిస్తామనడం ఏంటనే రాజకీయం రాజుకుంటోంది. సమాధానం చెప్పడం చేతకాక కేసులు పెట్టడం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకీ  కొండ చెరువుగా మారిన ఆ ఊరేది..? చెరువులో ఇళ్లు కడుతామంటున్న ఆ పంచాయితీ ఏంటో.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


వైసీపీ కౌంటర్ ఇదీ..!

టీడీపీ హయాంలోనే గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిగాయని, నీరుచెట్టు పధకం పేరుతో గోరంట్ల నాయకత్వంలో టీడీపీ నేతలు గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైసీపీ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్‌తో పాటు స్థానిక నేతలు ఆరోపించారు. టీడీపీ హయాంలో జరిగిన సారా వ్యాపారం, వైసీపీ పాలనలో జరుగుతున్న సారా వ్యాపారంపై వాస్తవాలు గోరంట్ల తెలుసుకొని మాట్లాడాలని, ఎంపీపై అసత్య ఆరోపణలు చేయటం మంచిపద్దతి కాదంటూ సూచించారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్‌ నేరుగా స్పందించకపోవడంతో  ఏదో తేడాకొడుతుందనే టాక్‌ వైసీపీలో వస్తోంది.


మార్గాని మౌనమెందుకు..?

గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేస్తున్న  ఆరోపణలపై ఎంపీ మార్గాని భరత్ నేరుగా ఎందుకు స్పందించటం లేదన్న అనుమానం వైసీపీలోని ఆయన ప్రత్యర్థుల్లో కలుగుతోంది. అనుచరులతో గోరంట్లపై కౌంటర్‌ ఇప్పిస్తున్న ఎంపీ తీరుతో వైసీపీకి చెడ్డపేరు వస్తుందని భరత్‌ వ్యతిరేకవర్గం ప్రచారం చేస్తోంది. గురుశిష్యుల బంధం పేరుతో ఎంపీ భరత్‌ ఎమ్మెల్యే గోరంట్లపై నేరుగా మాట్లాడటం లేదా అనే ఆరోపణలు వైసీపీలోనే వినిపిస్తున్నాయి. మరోవైపు సొంతపార్టీలోని విమర్శలు, పెదవి విరుపులు ఎలా ఉన్నా తన అనుచరవర్గంతో ఎంపీ భరత్‌ ఎమ్మెల్యే గోరంట్లపై విమర్శలు చేయించడమే కాదు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారని నియోజకవర్గంలో మాటలు వినిపిస్తున్నాయి. దళితులతో కలిసి గోరంట్లపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించడంపైనా రాజకీయం రగులుతోంది.


అధికారపార్టీలో షేక్‌.. సారా బిజినెస్ సంగతేంటో..!

60 కోట్ల రూపాయల వరకు జరిగిన అవినీతిలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌పై రాజమండ్రి రూరల్‌ టీడీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అధికార పార్టీని షేక్‌ చేస్తున్నాయి. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా ప్రెస్‌మీట్లు పెడుతున్న ఎంపీ అనుచరులు ఎమ్మెల్యేపై ఎదురుదాడికి దిగుతున్నారు. దళితులతో ఎమ్మెల్యేపై కేసులు బనాయించాలనే రాజకీయం మరింత హీట్‌ పుట్టిస్తోంది. వేమగిరిలోని కొండలే కాదు ఆవ భూముల్లోనూ అధికారపార్టీ పార్లమెంట్‌ సభ్యుడు మార్గాని భరత్‌  ఇళ్ల స్థలాల పేరుతో ఏకంగా వందకోట్లు దోచుకున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పట్టినపట్టు విడవకుండా ప్రత్యర్థిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. సారా వ్యాపారంలోనూ ఎంపీ వాటా ఎంతో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.


ఎంపీ వాటా ఎంత..!

కొండను తవ్వేశారు. మొరం అమ్ముకుని కోట్లు సొమ్ము చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాతాళానికి అడ్రస్‌ అన్నట్లు ఆ ప్రాంతాన్ని చెరువును చేశారు. 850 మంది పేదలకు ఇక్కడే ఇళ్ల స్థలాలు కట్టిస్తామని చెప్పడం ఇప్పుడు మరింత గందరగోళరాజకీయాలకు వేదికవుతోంది. కడియం మండలం వేమగిరిలో 20 ఎకరాల్లో ఉన్న కొండను చెరువులుగా తవ్వేసి ఎంపీ అనుచరులు 60 కోట్ల విలువైన గ్రావెల్‌ను అమ్ముకున్నారంటూ గోరంట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చెరువుగా మారిన కొండ స్థలంలో  గోరంట్ల పడవపై ప్రయాణించి నిరసన తెలిపారు. చెరువుల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఏలా కేటాయిస్తారని గోరంట్ల నిలదీశారు. వైసీపీ నేతల గ్రావెల్ అక్రమాలను కళ్ళకు అద్దినట్టు గోరంట్ల ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను కుండబద్దలు కొట్టారు.


కొండను తవ్వి కోట్లు కొల్లగొట్టేశారు!

మట్టిలో మణులు, మాణిక్యాలు సంపాదించడం ఎలాగో వైసీపీ నేతలను చూసి నేర్చుకోవాలనే మాటలు వినిపిస్తున్నాయి రాజమహేంద్రవరంలో. కొండను తవ్వి కోట్లు కొల్లగొట్లిన వైసీపీ నేతలు చేపల చెరువులను తలపించే చోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తారా అనే విమర్శలు వస్తున్నాయి. తన నియోజకవర్గం రాజమండ్రి రూరల్‌లో  వైసీపీ నేతల అక్రమ మొరం దందా ఏపీకంతటికి తెలిసేలా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన పడవ ప్రయాణం అధికారపార్టీలో గాలిదుమారం రేపుతోంది.


గోరంట్ల పడవ ప్రయాణంతో అధికారుల గుండెల్లో రైళ్లు..!

వేమగిరి కొండను వైసీపీ నేతలు తవ్వడం, పడవలో టీడీపీ ఎమ్మెల్యే ప్రయాణించడంతో  మొదలైన రాజకీయ రగడతో అధికారులగుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.  సీబీఐ విచారణకు ఆదేశించాలని గోరంట్ల డిమాండ్‌ చేయడంతో అధికారులు టెన్షన్‌ పడుతున్నారు. వైసీపీ నేతలతో చేతులు కలిపి కోట్లాది రూపాయలు దోచుకుంటున్న అధికారులు భాగోతం బయటపడుతుందన్న భావన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.


లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు! 

రాజమండ్రి ఎంపీ భరత్‌పై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తూ గ్రావెల్‌ దందా, సారా వ్యాపారం, ఆవ భూముల్లో అమ్యామ్యాలపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేవనెత్తిన విషయాలు నియోజకవర్గంలో చర్చకు తెరలేపాయి. కొండ కరిగి చెరువవడం కళ్లారా చూస్తున్న రాజమండ్రి వాసులు వైసీపీ నేతలు మట్టిలో మణలు, మాణిక్యాలు సంపాదిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.



Updated Date - 2021-11-06T20:04:01+05:30 IST