CM KCR కీలక నిర్ణయం.. త్వరలో కేబినెట్ విస్తరణ.. ఆ సీనియర్‌కు మంత్రి పదవి.. మరో ముఖ్యనేతకు డిప్యూటీ సీఎం..!?

ABN , First Publish Date - 2021-08-28T19:17:21+05:30 IST

మారిన పరిణామాల నేపథ్యంలో ఇపుడు అధికార పార్టీలోని...

CM KCR కీలక నిర్ణయం.. త్వరలో కేబినెట్ విస్తరణ.. ఆ సీనియర్‌కు మంత్రి పదవి.. మరో ముఖ్యనేతకు డిప్యూటీ సీఎం..!?

  • దళితబంధు చుట్టూ తెలంగాణ రాజకీయాలు
  • దళిత సామాజిక వర్గ నేతలకు మంత్రి పదవులు?
  • దళిత నేతలకు పదవులు, ప్రమోషన్లు?
  • దళిత సామాజిక వర్గం నేతల ఆశలు ఫలిస్తాయా?
  • పదవులపై ఆశలు పెంచుకున్న నేతలెవరు?

తెలంగాణలో పార్టీలన్నీ ప్రస్తుతం దళిత జపమే చేస్తున్నాయి. దళిత బంధు చుట్టే రాజకీయం నడుస్తోంది. ఉన్నట్టుండి టీఆర్ఎస్‌లో దళిత నేతలకు విపరీతంగా ప్రాధాన్యత పెరిగింది. మారిన పరిణామాల నేపథ్యంలో ఇపుడు అధికార పార్టీలోని ఆ సామాజిక వర్గం నేతల్లో పదవులు,  ప్రమోషన్ల పై ఆశలు పెరుగుతున్నాయట. ఇంతకీ ఆశలు పెంచుకున్న ఆ నేతలెవరు? టిఆర్ఎస్ లో జరుగుతోన్న చర్చేమిటీ..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


దళితబంధు చుట్టూ తెలంగాణ రాజకీయాలు..

రాష్ట్రంలో గత కొంత కాలంగా రాజకీయాలన్నీ దళితబంధు చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పథకం పైనే మాటల తూటలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పొలిటికల్ మైలేజ్ కోసం ఇతర పార్టీలు సైతం దళిత బంధు జపమే చేస్తున్నాయి. దళిత బంధు పథకాన్ని ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్.. విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు చెక్ పెట్టేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఎక్కడా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా దళిత బంధు పథకంతో పాటు.. తమ పార్టీలోని దళిత నేతలకు ప్రాధాన్యత కూడా పెంచుతున్నారు. పదవులతో పాటు ప్రమోషన్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.


దళిత సామాజిక వర్గ నేతలకు మంత్రి పదవులు?

దళిత బంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ మొదలు పెట్టిన డే వన్ నుంచే దళిత సామాజిక వర్గ నేతలకు మంత్రి పదవులు కూడా  వరించే ఛాన్స్ ఉందన్న చర్చ టిఆర్ఎస్ లో స్టార్ట్ అయింది. దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంబించినా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. పార్టీలోని దళిత నేతలకు పదవులు, ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా దళిత బంధును ప్రజల్లోకి ఈజీగా తీసుకెళ్లవచ్చని భావిస్తున్నారు.


దళిత సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి పోటీ..

సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి చర్చంతా దాని చుట్టే జరుగుతోంది. దళిత సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి రాష్ట్రంలోని ఇతర పార్టీలు సైతం పోటీ పడుతున్నాయి. కేసీఆర్ విస్మరించిన హామీలను ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలు జనాల్లోకి వెళ్తున్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ అధినేత తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా.. దళిత సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు మరింత ప్రాధాన్యం పెంచారు. పదవులు ఇస్తూ ఆ వర్గం నేతలను ప్రోత్సహిస్తు న్నారు. కొందరి నేతలకు ఇప్పటికే ప్రమోషన్లు ఇవ్వగా.. మరికొంత మంది నేతలకు పదవులు కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. రసమయి బాలకిషన్‌ను మరోసారి సాంస్కృతిక సారధి చైర్మన్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్‌ను కూడా భర్తీ చేశారు.


వీరిలో ఎవరికి దక్కుతుందో..!?

మొదటి నుంచి పార్టీలో ఉన్నవారే కాకుండా  ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కూడా క్యాబినెట్ లో చోటుకోసం ఆశలు పెంచుకుంటున్నారు. టీడీపీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కాంగ్రెస్ నుంచి వచ్చిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అవకాశం కోసం చూస్తున్నారు. ఇక కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల్లో బాల్క సుమన్, గువ్వల బాలరాజు, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, గ్యాదరి కిషోర్, అబ్రహం, మోతుకు ఆనంద్, క్రాంతి కిరణ్, సాయన్న, మాణిక్ రావు, దుర్గం చిన్నయ్య లాంటి నేతలంతా ఎప్పుడు ప్రక్షాళన జరిగినా అవకాశం దక్కించుకోవాలనే ఆశతో ఉన్నట్లు తెలుస్తుంది. మనకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు ఇటీవలే క్యాబినెట్ హోదా ఇస్తూ నామినేట్ పదవి కూడా కట్టబెట్టడంతో మిగిలిన నేతల్లో ఆశలు పెరిగాయి.


ఇప్పటికే కొప్పుల.. త్వరలో ఒకరిద్దరికి మంత్రివర్గంలో ఛాన్స్?

మంత్రివర్గంలో సైతం దళిత నేతల సంఖ్య పెరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే కేబినెట్ లో కొప్పుల ఈశ్వర్ ఉండగా త్వరలో ఒకరిద్దరికి  అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరోసారి దళితుడిని డిప్యూటీ సీఎం చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. దీంతో టీఆర్ఎస్‌లోని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, మాజీలలో ఆశలు పెరుగుతున్నాయి. బాస్ దృష్టిలో పడేందుకు నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.


కడియం శ్రీహరికి మంత్రి పదవి?

దళిత ఎమ్మెల్యేలు అందరూ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంటి వాళ్ళు కూడా మరో అవకాశం కోసం చూస్తున్నారు. వరంగల్ పర్యటనలో కేసీఆర్ ఆయనకు ప్రాధాన్యం ఇచ్చినప్పటి నుంచి.. కడియంకు ఎమ్మెల్సీ రెన్యువల్‌తో పాటు మంత్రి పదవి కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరి దళిత సామాజిక వర్గం  నేతల ఆశలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.



Updated Date - 2021-08-28T19:17:21+05:30 IST