Phone ఎత్తడానికి జంకుతున్న మల్లారెడ్డి.. ఆయన Minister పదవిపై కన్నేసిన ఎమ్మెల్యే.. ఎప్పుడేం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-09-12T21:21:45+05:30 IST

మంత్రి మల్లారెడ్డి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలంటే ఎందుకు జంకుతున్నారు?..

Phone ఎత్తడానికి జంకుతున్న మల్లారెడ్డి.. ఆయన Minister పదవిపై కన్నేసిన ఎమ్మెల్యే.. ఎప్పుడేం జరుగుతుందో..!?

మంత్రి మల్లారెడ్డి ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలంటే ఎందుకు జంకుతున్నారు? తనతో మాట్లాడాలనుకునే వారికి ఆ మంత్రి ఇస్తున్న సలహా ఏంటి? రేవంత్‌రెడ్డితో సవాల్ ఎపిసోడ్ తర్వాత తన మినిస్ట్రీ మీద మంత్రి ఏం చర్చ చేస్తున్నారు? ఆయన మంత్రి పదవి మీద కన్నేసిన ఎమ్మెల్యే ఎవరు? దీనిపై మల్లారెడ్డి ఏం చెబుతున్నారు? ఈ ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలేంటో.. అనేది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఫోన్ మోగితే జంకుతున్నారట..

తెలంగాణ మంత్రి మల్లారెడ్డిది విభిన్నమైన శైలి. ప్రెస్‌మీట్‌ అయినా, కాలేజ్ ఫంక్షన్ అయినా, అసెంబ్లీలో ప్రసంగం చేసినా నవ్వులు పూయాల్సిందే. పార్టీ అధినేతను పొగిడినా, విపక్షాలకు సవాల్ విసిరినా, రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు గుప్పించినా ఆయన స్టయిలే వేరు. ఏ సబ్జెక్టు మీద మాట్లాడినా ఫోకస్‌ను తన మీదకు తిప్పుకునే స్పెషాలిటీ ఆయనది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే తత్వం... చిన్నా, పెద్దా అందరినీ కలుపుకుపోయే స్వభావం ఆయనలో స్వతహాగా కనిపిస్తాయని అంటుంటారు. అలాగే మంత్రి మల్లారెడ్డికి ఎవ్వరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడతారనే పేరుంది. కానీ ఇప్పుడు ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారట. తనకు ఎవరు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయడం లేదట. మొబైల్‌ ఫోన్‌ మోగితే చాలు జంకుతున్నారని తెలుస్తోంది.


అసలు కథ ఇదీ..

ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేశారు. కేసీఆర్ దత్తత గ్రామానికి ఏమీ చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఇక మూడుచింతలపల్లిలో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనుల పేరుతో కాంగ్రెస్‌కు పోటీగా దీక్షకు వెళ్లే దారి పొడవునా మంత్రి పేరుతో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి.. మంత్రి మల్లారెడ్డి మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కౌంటర్‌గా మల్లారెడ్డి సైతం రెచ్చిపోయారు. రేవంత్‌రెడ్డికి తొడ కొట్టి సవాల్ చేశారు. అసభ్య పదజాలంతో అంతెత్తున లేచారు. దీంతో ఒక్కసారిగా చర్చ మొత్తం మల్లారెడ్డి భాష మీదకు మళ్లింది. ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా అదే రేంజ్‌లో మంత్రి మీద మాటల దాడి చేశారు. నేతల తిట్ల పురాణంతో పొలిటికల్ వెదర్ హీటెక్కింది.


మెసేజ్ మీ..

రేవంత్‌రెడ్డితో సవాళ్లు, తిట్ల ఎపిసోడ్ తర్వాత నుంచి మంత్రి మల్లారెడ్డి తన మొబైల్ మోగితే కలవరపడుతున్నారట. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయాలంటేనే జంకుతున్నారట. మాట్లాడటానికి బదులు.. 'మెసేజ్ మీ' అని మెసేజ్‌ రూపంలోనే చెబుతున్నారట. ఎవరు ఫోన్ చేసినా మాట్లాడే నేత ఎందుకలా అని అర్థంకాక కొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది.


ఫోన్ ఎత్తితే చాలు..

రేవంత్‌రెడ్డిని తిట్టిన తర్వాత మంత్రికి కంటిన్యూస్‌గా ఫోన్ కాల్స్ వచ్చాయట. ఫోన్ ఎత్తితే చాలు అవతల నుంచి రేవంత్‌రెడ్డి అభిమానుల పేరుతో తిట్ల దండకం మొదలు అవుతుందట. తమ నేతనే తిడతావా అంటూ బూతులతో విరుచుకుపడుతున్నారట. ఆ తిట్లు భరించలేకనే మల్లారెడ్డి.. తన ఫోన్‌కు అన్‌నోన్‌ నెంబర్ నుంచి కాల్‌ వస్తే లిఫ్ట్‌ చేయడం మానేశారట. కాల్ కట్ చేసి మెసేజ్ చేయండి అంటూ రిప్లయ్‌ ఇస్తున్నారట. పోలీస్ కేసులు పెడితే రేవంత్‌రెడ్డి ఎక్కడ రెచ్చిపోతారోనని ఫోన్ల తాకిడిని సహనంతో భరిస్తున్నారట.


మల్లారెడ్డికో న్యాయం.. ఈటలకో న్యాయమా..!

ఇదిలావుంటే, మల్లారెడ్డి భూముల చిట్టాను రేవంత్‌రెడ్డి విప్పిన తర్వాత.. మంత్రిలో కొంత ఆందోళన మొదలైందని టాక్ నడుస్తోంది. ఇటీవల భూ వివాదాలను కారణంగా చూపి ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్‌. మరి మల్లారెడ్డికో న్యాయం, ఈటలకు మరో న్యాయమా అంటూ రేవంత్‌రెడ్డి వాయిస్ రైజ్ చేశారు. దీంతో తన మంత్రి పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనన్న భయం వెంటాడుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


మంత్రి పదవిపై కన్నేసిన ఎమ్మెల్యే ఈయనే..!

నిజానికి మల్లారెడ్డి క్యాబినెట్‌ నుంచి తొలగిస్తారన్న ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. ఈ క్రమంలో తలెత్తిన మల్లారెడ్డి కాలేజ్ భూముల వ్యవహారం తన పదవికి గండంగా మారుతుందేమోనన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోందట. ఈ క్రమంలోనే తన మంత్రి పదవిపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కన్నేశారని స్వయంగా సదరు మంత్రే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నట్లు సమాచారం. తన కొడుకులాంటి వాడు వివేక్‌కి మంత్రి పదవి ఇచ్చినా సంతోషమేనని ఆయన అనడం కొసమెరుపు!



Updated Date - 2021-09-12T21:21:45+05:30 IST