Dharmana Prasad : పెద్దాయన రిటైర్మెంట్ పక్కానా.. ఆయన టార్గెట్ ఏంటి.. యువనేతకు ఛాన్స్ వస్తుందా..!?

ABN , First Publish Date - 2021-08-11T20:02:13+05:30 IST

. కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన ధర్మాన ప్రసాధరావు ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు కృష్ణదాసు డిప్యూటీ సీఎమ్‌గా జగన్ ప్రభుత్వంలో వెలిగిపోతున్నారు....

Dharmana Prasad : పెద్దాయన రిటైర్మెంట్ పక్కానా.. ఆయన టార్గెట్ ఏంటి.. యువనేతకు ఛాన్స్ వస్తుందా..!?

ఆ నియోజకవర్గంలో ఇపుడు ఏ కార్యక్రమం జరగాలన్నా చినబాబు ఉండాల్సిందేనట. యువరాజు పట్టాభిషేకం కోసం ఆ సీనియర్ నేత ఇప్పటి నుంచే లైన్ క్లియర్ చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ యువనేత గురి ఏ పదవిపై ఉంది? తన తండ్రి ఇమేజ్‌తో రాజకీయ అరంగేట్రం చేసిన సదరు నాయకుడి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? అనే విషయాలు తెలియాంటే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్ సైడ్ స్టోరీ చూడాల్సిందే..


అంతరంగం తెలుసుకోవడం బహుకష్టం.. ఖరారైనట్లేనా!?

బయటికి ప్రశాతంగా చిరునవ్వుతో కనిపించే ధర్మాన ప్రసాధరావు అంతరంగం తెలుసుకోవటం ఆయనకు సన్నిహితులకు కూడా సాధ్యం కాదనే పేరుంది. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇపుడు యువరాజు కీలకంగా మారటంతో ప్రసాధరావు రిటైర్మెంట్ దాదాపు ఖాయమయ్యిందనే చర్చ కూడా జరుగుతోందట. ఇంతకీ తండ్రికి తగ్గ రాజకీయ వారసుడిగా రాంమనోహర్ నాయుడికి అవకాశాలు వస్తాయా? లేక ఆ యువనాయకుడిపై ధర్మాన పెట్టుకున్న ఆశలు నీరుగారిపోతాయా?తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.


ధర్మాన తనయుడికే ఛాన్స్‌ వస్తుందా? 

శ్రీకాకుళం కార్పొరేషన్ అయిన తర్వాత మొదటి సారి ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి నేపధ్యంలో మొదటి మేయర్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అందులోనూ మొదటి మేయర్ పదవి కోసం పార్టీలో ఆశావాహుల సంఖ్యా అధికంగానే ఉంది. అయితే ఇలాంటి పరిస్ధతుల్లో కొత్త వార్త అధికార పార్టీ ఆశావాహులను షాక్‌కు గురి చేస్తోందట.  ధర్మాన తనయుడు రామ్ మనోహర్ నాయుడుకు మొదటి మేయర్ పీఠం రిజర్వ్ చేసేసారన్న చర్చ మొదలయింది. దీనిలో భాగంగానే యువరాజు పట్టాభిషేకానికి సీనియర్ నేత ధర్మాన ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


ఒక్క మాటలో చెప్పాలంటే..!

రామ్ మనోహర్ నాయుడు ఎక్కువగా శ్రీకాకుళం పట్టణంపైనే దృష్టి పెట్టారు.. తండ్రి వయసు రీత్యా అన్నీ తానై రాజకీయాలను నిర్వహిస్తున్నారు. త్వరలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రామ్ మనోహర్ నాయుడు కార్పోరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలోనూ వైధ్య శిబిరాలు ఏర్పాటు చేసారు. ప్రతి డివిజన్ లోనూ తానే స్వయంగా పర్యటిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కొడుకు అందివచ్చిన తర్వాత పెద్దాయన అసలు పెద్దగా పట్టించుకోవటం లేదన్న టాక్ నడుస్తోంది. 


పెద్దాయన మనసులో ఏముందో..!?

ధర్మాన ప్రసాధరావు తనయుడు రామ్‌  మనోహర్ నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. శుభకార్యాలు, పరామర్శలు, పార్టీ కార్యక్రమాలు ఇలా ఏదైనా అన్నీ రామ్ మనోహర్ నాయుడే చూసుకుంటున్నారు. ధర్మాన వారసుడు రాం మనోహర్ నాయుడి స్పీడుని గమనిస్తున్న సొంత పార్టీ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. యువనేత ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం ఇక దాదాపు ఖరారు అయినట్టే అని చెవులు కొరుక్కుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో తండ్రి పోటీ నుంచి తప్పుకుని తనయుడిని బరిలోకి దింపుతారా.. లేక ఇంకేదైనా కీలక పీఠం కోసం ధర్మాన తన వారసున్ని ఫీల్డ్‌లో దింపారా..? అనేది మాత్రం అంతుపట్టడం లేదట.


వైఎస్సార్‌కు ప్రసాదరావు, జగన్‌కు కృష్ణదాసు..

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంభానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన ధర్మాన ప్రసాధరావు ప్రస్తుతం వైసీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సోదరుడు కృష్ణదాసు డిప్యూటీ సీఎమ్‌గా జగన్ ప్రభుత్వంలో వెలిగిపోతున్నారు. దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ప్రసాదరావు, ప్రస్తుత సీఎమ్‌ జగన్‌కు అత్యంత ఆప్తుడిగా కృష్ణదాసులకు గుర్తింపు ఉంది. అయితే ఇపుడు ఈ ఇరువురు నేతలూ కొత్త పంథాను ఎంచుకున్నారట. తమ వారసుల రాజకీయ భవిష్యత్‌కు మార్గం సుగమం చేసుకుంటున్నారట. ముఖ్యంగా ధర్మాన ప్రసాధరావు తన రాజకీయ వారసుడు రామ్‌ మనోహర్ నాయుడికి పూర్తి స్ధాయి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించేసారట..





Updated Date - 2021-08-11T20:02:13+05:30 IST