YS Jagan Cabinet : తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే.. Assembly Speaker సీటులో కూర్చునేది ఈ కీలక నేతేనా.. ఆయన ఒప్పుకుంటారా..!?

ABN , First Publish Date - 2021-08-30T18:16:03+05:30 IST

త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ నాయకుడికి పదవి ఖాయమంటే.. కాదు తమ నాయకుడికే మంత్రి...

YS Jagan Cabinet : తమ్మినేనికి మంత్రి పదవి ఇస్తే.. Assembly Speaker సీటులో కూర్చునేది ఈ కీలక నేతేనా.. ఆయన ఒప్పుకుంటారా..!?

ఆ జిల్లా వైసీపీలో ఇప్పుడు పదవులపై జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో తమ నాయకుడికి పదవి ఖాయమంటే.. కాదు తమ నాయకుడికే మంత్రి గిరి దక్కుతుందని అధికార పార్టీ నాయకులు వాదించుకుంటున్నారు. ఇంతకీ ఆ నాయకులు ఎవరు? వారికి ఈసారి జగన్‌ క్యాబినెట్‌లో చోటు దక్కుతుందన్న ఆ జిల్లా వైసీపీ నేతలు ఆశలు పెట్టుకోవడానికి అసలు కారణాలేంటి..? అసలు ఇది ఏ జిల్లాలో రాజకీయం..? అనేది ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


పలు సందర్భాల్లో ఆవేదన!

రాష్ట్ర వ్యాప్తంగా అధికార వైసీపీలో ఇప్పుడు పదవుల సందడి కనిపిస్తుండగా.. శ్రీకాకుళం జిల్లా అధికార పార్టీ నేతల్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లాకు చెందిన సీనియర్లను కాదని.. జగన్ తన మొదటి క్యాబినెట్‌లో విశ్వసనీయతకు బెర్తులు ఇచ్చారు. దీంతో సీనియర్ నేతల్లో ఇంత కాలం కొంత అసహనం కనిపించింది. జూనియర్‌ల ముందు తమను తక్కువ చేసినట్లు అయిందనే ఆవేదనను పలు సందర్భాల్లో వారు వ్యక్తం చేశారు. అయితే, రెండేళ్ల తర్వాత సిక్కోలు వైసీపీ సీనియర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఖాయమనే ప్రచారం జరుగుతుండటంతో.. ఈసారి 2024 ఎన్నికల టీమ్‌ను జగన్ సెలెక్ట్ చేస్తారనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది.


పెద్దాయన ఒప్పుకుంటారా..!?

ధర్మాన ప్రసాదరావు గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో జిల్లాలో ఆ పార్టీని బలోపేతం చేసిన చరిత్ర ఆయనకు ఉంది. అలాంటి నాయకుడికి మంత్రి పదవి ఇస్తే, 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు దోహద పడుతుందని కొంతమంది నేతలు వాదనలు వినిపిస్తున్నారు. మరోవైపు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అధికార పార్టీ జెంఢా ఎగరాలంటే ధర్మాన ప్రసాదరావు మంత్రి కావడం అనివార్యం అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ స్పీకర్ పదవి ప్రసాదరావుకు ఇస్తే... అందుకు ఆయన అంగీకరిస్తారా? లేదా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా ఉందని సిక్కోలు వైసీపీ నాయకులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎవరికి ఏ పదవి దక్కుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు చూడాల్సిందే.


తమ్మినేనికి ఖాయమైనట్లే.. స్పీకర్ సీటులో ఈయనే!

జిల్లాకు చెందిన తమ్మినేని సీతారాం ప్రస్తుతం శాసన సభాపతిగా ఉన్నారు. అయితే ఆయన మొదటి నుంచి స్పీకర్ పదవిని అయిష్టంగానే నిర్వహిస్తున్నారట. సీతారాం మంత్రి పదవి కోసం మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు టీడీపీ పార్టీని, చంద్రబాబును తన వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శించడంలో సీతారాం ముందంజలో ఉన్నారు. దీంతో తమ్మినేనికి స్పీకర్‌ పదవి కంటే మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. వీటిని జగన్‌ పరిగణనలోకి తీసుకుంటే.. తమ్మినేనికి మంత్రి పదవి ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే.. సీనియర్‌ నేత అయిన ప్రసాదరావుకు స్పీకర్‌ పదవి వస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


ఈసారైనా మంత్రి పదవి దక్కేనా..!

ఇక జగన్ క్యాబినెట్‌లో బెర్త్ దక్కకపోవడంతో కొంతకాలం పాటు ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలతో తనకు సంబంధం లేదన్నట్టే వ్యవహరించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జోరుగా సాగుతోంది. దీంతో ఈసారైనా ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి ఇస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈసారి తమ నేతకు జగన్‌ ప్రాధాన్యత ఇవ్వడం ఖాయమని ధర్మాన ప్రసాదరావు వర్గం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఒకవేళ అదే జరిగితే తమ నేతకు మంత్రి పదవి ఇస్తారా..? లేక మరో కీలక పదవి వస్తుందా..? అని కూడా చర్చించుకుంటున్నారు. ధర్మాన ప్రసాద్‌కు మంత్రి పదవి ఇస్తే.. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాసు లేదా అప్పలరాజుల్లో ఒకరికి హూస్టింగ్ తప్పదు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్ధితి జిల్లాలో కనిపించడం లేదు. దీంతో ధర్మానకు మంత్రి పదవికి బదులు కీలక బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది.


అన్నను కాదని తమ్ముడికి పదవి!

శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ పొలిటీషియన్. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్‌లలో కీలక శాఖలు నిర్వర్తించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావుకి సముచిత స్థానం దక్కటం లేదన్న అసంతృప్తి ఆయన అనుచరుల్లో మొదటి నుంచి ఉంది. అయితే తన సోదరుడు కృష్ణదాసుకి జగన్ మొదటి క్యాబినెట్‌లో బెర్తు లభించడంతో పాటు ప్రమోషన్‌గా డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టారు. దీనికి తోడు జిల్లాలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీదిరి అప్పలరాజుకు సైతం మంత్రి పదవి లభించింది. దీంతో ధర్మాన ప్రసాదరావు సీనియర్ లీడర్ అయినప్పటికీ.. ఆయనకు తగిన గౌరవం లభించడం లేదన్న రుసరుసలు అప్పట్లో బాగానే వినిపించాయి.



Updated Date - 2021-08-30T18:16:03+05:30 IST