Minister Anil నెక్స్ట్ టైమ్‌ సిటీలో గెలవడం కష్టమేనా.. అందుకే రూట్ మార్చేశారా.. మంత్రికి మరో మంత్రి చెక్.. ఏం జరుగుతుందో..!?

ABN , First Publish Date - 2021-08-12T19:03:59+05:30 IST

ధిక్కారానికి కేరాఫ్‌ అడ్రస్‌ ఆ ఇద్దరు నేతలు. బలంగా ఉన్న నాయకత్వాన్ని దెబ్బకొట్టేందుకు శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు వారిద్దరూ దోస్తులయ్యారు....

Minister Anil నెక్స్ట్ టైమ్‌ సిటీలో గెలవడం కష్టమేనా.. అందుకే రూట్ మార్చేశారా.. మంత్రికి మరో మంత్రి చెక్.. ఏం జరుగుతుందో..!?

ధిక్కారానికి  కేరాఫ్‌ అడ్రస్‌ ఆ ఇద్దరు నేతలు. బలంగా ఉన్న నాయకత్వాన్ని దెబ్బకొట్టేందుకు శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు వారిద్దరూ దోస్తులయ్యారు. మొత్తానికి ఇద్దరూ అనుకున్నది సాధించుకుని అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎప్పుడూ డైనమిక్స్‌గా ఉండే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే సత్యాన్ని కాలగమనంలో గ్రహించిన ఆ ఇద్దరు ఢీ అంటే ఢీ అనేలా కాలుదువ్వుకునే పరిస్థితి వస్తోంది. ఎంతలా అంటే ఒకరి ఇలాకాలో మరొకరు వేలుపెడుతుండటంతో విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ఇంతకీ ఆ ఇద్దరు మిత్రులు కాదు కాదు.. కాబోయే ప్రత్యర్థి వర్గాలు వేసుకుంటున్న ఎత్తుకు పై ఎత్తు రాజకీయాలు జిల్లాలో ఎటువంటి  మార్పులకు దారితీసే అవకాశముంది..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


మంత్రి- ఎమ్మెల్యే మధ్య మిత్రభేదం!

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రాణిస్తున్న మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలకు ఇద్దరు మిత్రులనే పేరుంది. వైసీపీ అధినేత జగన్‌కు దగ్గరి మనుషులుగా రెండు పర్యాయాలు గెలిచిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఎవరిదారిలో వారు ఉన్నట్లు గుసగుసలు గుప్పుమంటున్నాయి. రూరల్‌, సిటీ నియోజకవర్గాల్లో వైసీపీ పిల్లర్స్‌గా ఉన్న నెల్లూరు కుర్రాళ్లు ఢీ అంటే ఢీ అనేలా రాజకీయం మారిపోతుందట. ఇద్దరూ మాటాముచ్చట బంద్‌చేసి మధ్యవర్తులతో మాట్లాడుకునేలా పరిస్థితులు మారిపోయాయట.


సైలెంట్‌గా చెక్‌పెడుతున్న మంత్రి మేకపాటి!

జిల్లాలో మంత్రి అనిల్‌ వివాదాస్పద వ్యవహారశైలితో ఎమ్మెల్యేలు అందరూ ఆయనకు దూరమవుతున్నారనే టాక్‌ వస్తోంది. మంత్రి అనిల్‌ దూకుడు ప్రవర్తనకు పూర్తి డిఫరెంట్‌గా ఉండే మరోమంత్రి మేకపాటి గౌతంరెడ్డి సైలెంట్‌గా చక్రం తిప్పడం మొదలెట్టేశారు. ఎమ్మెల్యేలు కాకాణి, ప్రసన్న, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య అందరూ మేకపాటి లైన్‌లోకి వచ్చేశారు. అనిల్‌తో దోస్తీ చేసే ఒకే ఒక్క ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా మేకపాటికి జై కొట్టారు. దీంతో రూరల్‌ పరిధిలోని ఆటోనగర్‌లో మౌళిక సదుపాయాల కల్పన కోసం నిధులు మంజూరీ చేయడంలో మేకపాటి కీలకపాత్ర పోశించారు. ఈ కార్యక్రమంలో మేకపాటితో సన్నిహితంగా ఉన్నారు కోటంరెడ్డి. తప్పనిసరి పరిస్తితుల్లో హాజరైన మినిస్టర్‌ అనిల్‌కుమార్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డితో మాట్లాడకుండా ఏదో ఫోన్‌ చూసుకుంటూ కాలం గడిపారు.


సిటీలో గెలువడట.. అందుకే రూరల్‌పై కన్ను!

వీరిద్దరి మధ్య వస్తున్న పొరపొచ్చాలు చూస్తున్న వైసీపీ కార్యకర్తలు మరో బాంబు పేల్చుతున్నారు. సిటీలో కేవలం రెండువేల అత్తెసరు మెజార్టీతో గెలిచిన మంత్రి అనిల్‌ కుమార్ మరోసారి అక్కడ విజయం సాధించే అవకాశం లేదని అనుకుంటున్నారట. దీంతో  రూరల్‌లోని కోటంరెడ్డి కోటను ఆక్రమించుకోవాలనే పనిలో అనిల్‌ యాదవ్‌ ఉన్నారనే టాక్‌ వస్తోంది. అందుకే ముందుజాగ్రత్తగా సిటీ కాకుండా రూరల్‌లో వేలుపెడుతున్నారనే చర్చ అంతర్గతంగా సాగుతోంది.


మంత్రి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నో.. దగ్గరికి తీస్తున్న అనిల్!

పరిస్థితి ఎంతలా దిగజారిందంటే మంత్రి అనిల్‌ పాల్గొంటున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెళ్లడం లేదు. కోటంరెడ్డి ఆఫీసుకు మంత్రి అనుచరులు వెళ్లడం లేదు. కొన్ని కార్యక్రమాలకు కోటంరెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి కూడా వెళ్లడం లేదు. కోటంరెడ్డి తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని కొందరిని తరిమేసి తాళం పెడితే వారు అనిల్‌ వెంట తిరగడం అగ్నికి ఆజ్యం పోసినట్లైందట. తప్పనిసరి పరిస్థితుల్లో హాజరుకావాల్సిన కార్యక్రమాల్లో ఇద్దరూ వస్తున్నా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా గడపాల్సివస్తోంది.


ఈ ఒక్క పనితో ఇద్దరి మధ్యా గ్యాప్..!

ఇద్దరూ రెండుసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా రాజకీయ సమీకరణాల్లో భాగంగా అనిల్‌కుమార్‌ యాదవ్‌కు మంత్రి పదవి దక్కింది. తొలి నుంచే ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. సిటీలో సగభాగం, రూరల్‌లో సగభాగం ఉండే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనుల్లో కమిషన్‌ గొడవలే ఇద్దరు మిత్రుల గొడవకు పునాదిరాళ్లుగా నిలిచాయని అంటుంటారు అక్కడి లోకల్‌ లీడర్లు. సర్వేపల్లి కాలువ పనుల్లో కూడా భారీగా అక్రమాలు, అమ్యామ్యాలు జరిగాయని.. అమాత్యులు అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తన అనుచరులతో పనిచేయిస్తున్నారని లోకల్‌ టాక్‌. లోలోపల జరుగుతున్న గొడవలు చిలికిచిలికి గాలివానలా మారాయని ఇన్నర్‌ టాక్‌.


ఏకైక ఎమ్మెల్యే కూడా దూరం.. ఎందుకిలా..!?

దూకుడుగా ఉండే మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే ఏకాకిగా మారినట్లు వైసీసీ రాజకీయాలు గమనిస్తున్నవారు చెప్పే మాట. అనిల్‌తో మాట్లాడే వన్‌ అండ్‌ ఓన్లీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి  కూడా మెల్లగా మంత్రి  మేకపాటి గౌతంరెడ్డి లైన్లోకి వచ్చారట. అనిల్‌ కుమార్‌ ఒంటెత్తుపోకడలు, దురుసుప్రవర్తనతో జిల్లా పార్టీకి నష్టం తప్పదని గ్రహించిన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి గత సంవత్సరం నుంచే సైడ్‌ చేస్తూ వస్తున్నారట. ఆ పరిణామ క్రమాలకు తోడు పక్కనే ఉన్న కోటంరెడ్డి నియోజకవర్గం వ్యవహారాల్లో మంత్రి జోక్యంతో ఇద్దరి మిత్రుల మధ్య అగాథం పెంచిదట. 


ఒకప్పుడు అలా.. ఇప్పుడు గిట్టనివారుగా.. ఏం జరుగుతుందో..!?

మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇద్దరూ శాసనసభ్యులు కాకముందు కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అనం ఫ్యామిలీ అనుచరులు. కార్పొరేటర్‌గా అనిల్‌కుమార్‌కు టికెట్‌ ఇప్పించింది ఆనం బ్రదర్సే. అలాంటిది ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వచ్చిన ఇగో ఫీలింగ్‌ అనిల్‌కు, ఆనం ఫ్యామిలీకి గ్యాప్‌ పెంచింది. కార్పొరేషన్‌లో నిలబెట్టిన మనుషులే అనిల్‌ను ఓడించారనే టాక్‌ ఉంది.  ప్రత్యర్థులుగా మార్చేలా పరిస్థితులు తయారయ్యాయి. జగన్‌ ఓదార్పు యాత్రకు వచ్చిన సమయంలో అనిల్‌ ఆయనతో కలిసి అడుగులు వేశారు.ఇటు కోటంరెడ్డి కూడా ఆనం ఫ్యామిలీదూరంగా మెదలడం మొదలెట్టేశారు. ఇలా ఇద్దరూ ఆనం బాధితులుగా మారడంతో శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లు ఇద్దరూ కలిసిపోయారు. జగన్‌ నీడన చేరి లీడర్లుగా ఎదిగారు. ఇప్పడు జగన్‌ పార్టీలోనే ఒకరంటే ఒకరు గిట్టనివారుగా తయారయ్యేలా పరిస్థితులు కల్పించుకుంటున్నారనే వార్తలొస్తున్నాయి.



Updated Date - 2021-08-12T19:03:59+05:30 IST