Abn logo
Oct 21 2021 @ 14:44PM

కొత్త మంత్రుల ఎంపిక కోసం YS Jagan సరికొత్త ఫార్ములా.. ఈ జూనియర్లకు బంపరాఫర్.. ఆ సీనియర్ల పరిస్థితేంటో..!?

కొత్త మంత్రుల ఎంపికపై కసరత్తు జరుగుతుందని వస్తున్న ఫీలర్లు...మినిస్టర్‌ రేసులో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టెన్షన్‌ పుట్టిస్తున్నాయి. రెండేళ్ల తర్వాత రీషఫుల్‌ ఉంటుందని చెప్పిన సీఎం జగన్‌ మాటలు నమ్మిన సీనియర్లు..ఇప్పుడు వినిపిస్తున్న వార్తలతో గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లవుతుందని అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. చావు కబురు చల్లగా చెప్పిన సామెత మాదిరిగా సీనియర్లకు పార్టీ పదవులు, జూనియర్లకు మంత్రి పదవులు అనే వార్తలు కొందరికి మోదం కలిగిస్తుంటే..  మరికొందరికి ఖేదం కలిగిస్తున్నట్లు సమాచారం.. అసలు ఆ విషయాలేంటో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

కొత్త మంత్రుల ఎంపిక కోసం సరికొత్త ఫార్ములా?

రెండేళ్ల గ్యారంటీ కండిషన్‌తో మంత్రి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పునర్‌వ్యవస్థీకరణలో ఏ ప్రాతిపదికన తన మంత్రివర్గ సహచరులను ఎంపిక చేసుకుంటారోననే చర్చ మళ్లీ మొదలైంది. రెండేళ్ల సమయం మించిపోవడంతో సీనియర్లు కొత్తగా మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పుడున్న మంత్రుల్లో దాదాపు 90 శాతం మందిని తప్పించడం గ్యారంటీ అనే ఫార్ములాతో ఇన్నాళ్లూ మార్పుకూర్పులపై లెక్కలు నడిచాయి. ఈ కండీషన్‌ సంగతేమోకాని కొత్తగా తీసుకునేవారికోసం కూడా కొంగొత్త ఫార్ములా రెడీ చేసుకుంటున్నట్లు వస్తున్న లీకులు సీనియర్లను కలవరపరుస్తున్నాయట.

సీనియర్లు సేవకు, జూనియర్లు పాలనలోకి..!

పాలనానుభవం, ప్రజాప్రతినిధిగా సీనియారిటీ వంటి అనుభవాలను పరిగణలోకి తీసుకుంటారని నమ్మకంతో ఉన్న వైసీపీ సీనియర్లు..జగన్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.అయితే క్యాబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణలో సీనియర్లను కాదని జూనియర్లను మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ఫీలర్లు పెద్దలకు నిద్రలేకుండా చేస్తున్నాయట. వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవాలంటే సీనియర్లు ప్రభుత్వంలో కాకుండా పార్టీకి సేవలు అందిస్తేనే ఫలితం ఉంటుందని రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని హైకమాండ్ భావిస్తున్నట్లు టాక్‌ వస్తోంది.

కృష్ణదాసుకు డిప్యూటీ సీఎంగా అవకాశం!

శ్రీకాకుళం జిల్లాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది మంది వైకాపా ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వీరిలో సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావును కాదని ఆయన సోదరుడు కృష్ణదాసుకు మంత్రి పదవి ఇచ్చారు. పైగా డిప్యూటీ  సీఎంగా  బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లటంతో అదే సామాజిక వర్గానికి చెందిన పలాస ఎమ్మెల్యే అప్పలరాజును మంత్రి పదవి వరించింది. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ సీదిరి అప్పలరాజుకు సామాజిక సమీకరణలు కలిసి రావటంతో మంత్రివర్గంలో చోటుదక్కింది.

స్పీకర్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా..? 

సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావుకు జగన్‌ తొలి క్యాబినెట్‌ కూర్పులో మంత్రి పదవి దక్కలేదు. రెండున్నరేళ్ల తర్వాతైనా ప్రసాదరావుకు మంత్రి పదవి వస్తుందా రాదా అన్న క్లారిటీ అధిష్టానం నుంచి రావటం లేదట. ఇక స్పీకర్‌గా ఉన్న తమ్మినేని సీతారాం మొదటి నుంచీ అయిష్టంగానే ఆ పదవిని నిర్వర్తిస్తున్నారనే టాక్ ఉంది. మంత్రి పదవి కోసం తమ్మినేని మొదటి నుంచీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఆశలు ఫలించటం లేదట. ఇలాంటి పరిస్ధితుల్లో వైకాపా అధిష్టానం తీసుకోబోతున్న కొత్త నిర్ణయం పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలను కలవరపెడుతోందట. సీనియర్లకు పార్టీ పదవులు కట్టబెట్టి... జూనియర్లకు మంత్రి పదవులు..ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే పదవులపై ఆశలు పెట్టుకున్న ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం ఆశలు ఆవిరైనట్లేనని వైసీపీ వ్యవహారాలు గమనిస్తున్న విశ్లేషకులు  అంటున్నారు.

మంత్రి పదవి నుంచి తప్పిస్తే పార్టీలో కీలక పదవి..? 

డిప్యూటీ సీఎం కృష్ణదాసు ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఆయన్ను మంత్రి పదవి నుంచి తప్పిస్తే పార్టీలో కీలక పదవి కట్టబెడతారనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇక మిగతా వారి విషయానికి వస్తే మొదటి నుంచీ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎస్టీ సామాజికవర్గానికి చెందిన పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిలు మొదటి నుంచీ మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నట్లు అనుచరులు చెప్పేమాట. మొదటి క్యాబెనెట్‌లోనే ఈ ఇరువురిలో ఒకరికి ఖచ్చితంగా పదవి వస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ మొండిచెయ్యి తప్పలేదు. చివరి రెండేళ్లయినా మంత్రి పదవి దక్కుతుందేమోఅన్న ఆశల్లో ఈ ఇరువురు నేతలూ ఊగిసలాడుతున్నారట.

మంత్రిగిరికోసం వీరంతా ప్రయత్నాలు!

ఇదిలా ఉంటే కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెడతారన్న వార్తల నేపధ్యంలో జిల్లాకు చెందిన అనేక మంది నేతలు ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బీసీ మహిళ కోటాలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి వంటి నేతలు ఇప్పటికే పైరవీ మొదలుపెట్టినట్టు సమాచారం. అధిష్టానం నుంచి స్పష్టమైన నిర్ణయం రాకముందే అధికార పార్టీ నేతలు పదవుల వేటలో పడటం సిక్కోలు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. 


ఇవి కూడా చదవండిImage Caption