Abn logo
Oct 14 2021 @ 21:11PM

అదే ఇప్పుడు..ఎప్పుడూ ఏబీఎన్‌కు బలం!

ముక్కుసూటిగా ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురవుతాయో స్వయంగా చూసింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. పదేళ్ల ప్రయాణంలో అలాంటి ఎన్నో సవాళ్లను, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంది. అయినా.. తన నైజం మార్చుకోలేదు. వాస్తవాలను ప్రేక్షకుల కళ్లకు కట్టేలా ప్రసారాలు చేయడం ఆపలేదు. అదే ఇప్పుడు, ఎప్పుడూ ఏబీఎన్‌కు బలమవుతోంది. 


అధికారం మాటున సాగిన నీతిబాహ్య పర్వాలను ఎన్నింటినో తొలినుంచీ ప్రపంచానికి చూపించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ఇంకా చూపిస్తూనే ఉంది. ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయ నాయకుల అనైతిక చర్యలను ఆధారాలతో సహా పట్టి లాగి బాహాటం చేస్తోంది. ఈ పుష్కరకాలం పయనంలో ఎన్నో దమ్మున్న వార్తలను ప్రసారం చేసి దుమ్ము రేపింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ఎన్ని ఆటుపోట్లు, అవాంతరాలు ఎదురైనా వాస్తవాలను మాత్రమే ప్రసారం చేస్తున్నందున ధైర్యంగా ముందుకు సాగుతోంది. ఆ ఆనవాయితీని నిరంతరాయంగా కొనసాగిస్తోంది.


మొన్నటికి మొన్న విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన వైసీపీ సర్కారు బాగోతాన్ని మొదటగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి బట్టబయలు చేసింది. డాక్యుమెంట్లను కూడా బయటపెట్టి.. ఆధారాలతో సహా ప్రజల ముందుంచింది. విశాఖలోని మొత్తం 128 ఎకరాలున్న 13 ఆస్తులను ఎస్‌బీఐ క్యాప్‌ ట్రస్టీ కంపెనీకి తాకట్టు పెట్టింది. ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ 2వేల 9వందల 54 కోట్లుగా చెబతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌కు తొలుత ఈ ఆస్తులను బదలాయించి.. ఆ తర్వాత కార్పొరేషన్‌ తరపున తనఖా పెట్టేశారు. సెప్టెంబర్‌ 27వ తేదీన విజయవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈ తాకట్టు ప్రక్రియ జరిగింది. ఈ వ్యవహారాన్ని మొట్టమొదటగా బయటపెట్టింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. అంతేకాదు.. రెండోదశలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడలోని బరమ్‌పార్క్‌, నెల్లూరు, కర్నూలు, కడప, దిండిలో ఉన్న హరిత రిసార్ట్‌లు వంటి ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకునేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేసింది ఈ వ్యవహారాన్ని కూడా ఏబీఎన్‌ బట్టబయలు చేసింది.


రాజకీయ దురుద్దేశ్యంతో నిజాలు చూపిస్తుంటే భరించలేక నిర్భంధాలు విధిస్తే ప్రజల గొంతుకై నిలబడింది. ఇంకా నిలబడుతూనే ఉంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత.. ఎంఎస్‌వోల మాటున ప్రభుత్వం ఏబీఎన్‌పై నిర్బంధాన్ని విధించింది. స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఏబీఎన్‌ సహా కొన్ని ఛానెళ్లను ఉద్దేశించి వరంగల్‌లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా ప్రసంగించారు.


అయితే.. నిలువెల్లా సాహసాన్ని రంగరించుకున్న ఏబీఎన్‌ అదరలేదు.. బెదరలేదు... ధర్మం కోసం కోర్టుమెట్లెక్కింది. న్యాయబద్ధంగా పోరాడింది. చివరకు న్యాయస్థానంలో విజయం సాధించింది. ఏబీఎన్‌ ప్రసారాలను ప్రేక్షకుల దరికి చేర్చింది. ఆ సమయంలో ఏబీఎన్‌ ఛానెల్‌ ప్రసారాలకోసం తెలంగాణ వ్యాప్తంగా సాగిన ఆందోళనలు, నిరసనలు, ధర్నాల్లో ప్రజల భాగస్వామ్యం మరువ లేనిది. దమ్మున్న చానెల్‌ వైపు నిలబడ్డ ప్రేక్షకులు చివరకు విజయం సాధించారు.


ఆ తర్వాత కొంతకాలానికి ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రజల ఛానెల్‌ను వాళ్ల చెంతకు చేరకుండా మధ్యలోనే అడ్డుకట్ట వేసింది వైసీపీ సర్కారు. ఫలితంగా ప్రభుత్వాన్ని ఎదిరించలేని కొన్ని శక్తులు, వర్గాలు అప్రకటిత నిర్బంధం కొనసాగించాయి. దీనిపై రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాలు గొంతెత్తాయి. ఆందోళనలతో తమ నిరసనను తెలియజేశాయి. ఏబీఎన్‌ ప్రసారాలు పునరుద్ధరించాలంటూ కోస్తా, ఆంధ్రా, రాయలసీమ వీధులన్నీ మారుమోగిపోయాయి.


తమ మనసైన ఛానెల్‌ ఏబీఎన్‌ ప్రసారాలను ఇవ్వాల్సిందేనంటూ ప్రజలే స్వచ్చందంగా రోడ్డెక్కారు. ఏబీఎన్‌ ఛానెల్‌ రాని టీవీలు మాకొద్దంటూ కొందరైతే ఇళ్లల్లోంచి టీవీలు బయటకు తెచ్చి మరీ రోడ్డుమీద వేసి పగుల గొట్టారు


అదే సమయంలో మహిళలు, వృద్ధులు సైతం రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఏబీఎన్‌ ఛానెల్‌ ప్రసారాలు ఇవ్వకుంటే కేబుల్‌ టీవీ కనెక్షన్లు తొలగిస్తామని, డీటీహెచ్‌లు తెచ్చుకుంటామని.. అప్పుడు తమకు ఇష్టమైన ఛానెల్‌ను ఎలా అడ్డుకుంటారని ఎదురు ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాదు.. తాము అనుకున్నది చేశారు. ఫలితంగా ఏపీలో కేబుల్‌ టీవీ కనెక్షన్లు భారీగా తగ్గిపోయాయి. 


ఓవైపు.. నిరసనలు తెలుపుతూనే.. కేబుల్‌ కనెక్షన్‌లు తొలగించి, డీటీహెచ్‌లవైపు మొగ్గుచూపుతూనే.. మరోవైపు.. అడిగి, డిమాండ్‌ చేసి మరీ.. ఏబీఎన్‌ ఛానెల్‌ను తిరిగి కనెక్ట్‌ చేయించుకున్నారు. ఫలితంగా నిర్బంధం విధించిన కొద్ది గంటలు, కొన్ని రోజుల్లోనే ట్రాయ్‌కి వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన గురించి తాను చెప్పుకోవడం కాదు.. జనం చెప్పుకున్నప్పుడే ఆ గొప్పతనమేంటో బయటపడుతుందన్న నానుడి ఏబీఎన్‌ విషయంలో నిజమయ్యింది. జనమే గొంతెత్తారు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి కావాలని నిలదీశారు. తమ డిమాండ్‌ను న్యాయబద్ధంగా సాధించుకున్నారు. 


అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి పాలన చేతగాక ప్రసార మాధ్యమాలపై ప్రతాపం చూపించిందని విపక్షాలు గొంతెత్తి ప్రశ్నించాయి. ఇప్పటికీ ప్రశ్నిస్తున్నాయి. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి వంటి ఛానెళ్లు ప్రజలకు అవసరమని, వాస్తవ, నిర్భయ, నిర్భీతితో కూడిన వార్తలను ప్రసారం చేసే ఏబీఎన్‌తోనే నిజమైన సమాచార స్రవంతి ప్రజల దరికి చేరుతుందని అన్ని రాజకీయ పార్టీలు ముక్తంకంఠంతో వాదించాయి.  మీడియాను నిర్బంధిస్తున్నారంటే ప్రభుత్వం చేయకూడని తప్పులు చేస్తుందన్నదానికి సంకేతమని వివిధ పార్టీల ముఖ్యనేతలు వ్యాఖ్యానించడం ప్రభుత్వం వ్యవహారశైలికి అద్దంలా ప్రతిబింబిస్తున్నాయి. 


తెలంగాణలో ఏబీఎన్‌పట్ల నిరంకుశంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో పొరపాటును సరిదిద్దుకుంది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కారు కూడా వాస్తవాలకు నిలువుటద్దమైన ఏబీఎన్‌పై అప్రకటిత నిషేధం విధిస్తే.. ట్రాయ్‌ మొట్టికాయలు వేసింది. ప్రజల హక్కును కాలరాయొద్దని ఏపీ సర్కారుకు, సర్కారు ఆదేశాలను పాటిస్తున్న ఎంఎస్‌వోలకు చీవాట్లు పెట్టింది. మరోవైపు.. ప్రజలే ఉద్యమకారులై ట్రాయ్‌కు ఫిర్యాదుల పరంపర సాగించారు. దీంతో, అనివార్యమైన పరిస్థితుల్లో ఏపీ సర్కారు కూడా తోక ముడిచింది.


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

ఇవి కూడా చదవండిImage Caption