రికార్డులు తిరగరాసిన OHRK సీజన్‌-3.. YS Sharmila గెస్ట్‌గా కనిపించడమే పెద్ద ట్విస్ట్‌.. రాజకీయ రంగంలో సంచలనం

ABN , First Publish Date - 2021-10-15T19:15:06+05:30 IST

ఎలక్ట్రానిక్‌ మీడియాను కొత్త పుంతలు తొక్కించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. దమ్మున్న జర్నలిజానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. సరికొత్త ప్రయోగాలకు కేంద్రబిందువయ్యింది...

రికార్డులు తిరగరాసిన OHRK సీజన్‌-3.. YS Sharmila గెస్ట్‌గా కనిపించడమే పెద్ద ట్విస్ట్‌.. రాజకీయ రంగంలో సంచలనం

ఎలక్ట్రానిక్‌ మీడియాను కొత్త పుంతలు తొక్కించింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. దమ్మున్న జర్నలిజానికి కేరాఫ్‌ అడ్రస్‌ అయ్యింది. సరికొత్త ప్రయోగాలకు కేంద్రబిందువయ్యింది. సామాజిక బాధ్యతను తన లక్ష్యాల్లో ఒకటిగా చేర్చుకుంది. సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓ యజమానిగా కాకుండా.. తోటి జర్నలిస్టుగా ఏబీఎన్‌లో భాగస్వాములవుతుండటమే ఈ విజయాలకు ప్రధాన కారణమవుతోంది.


ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి అంటేనే వేమూరి రాధాకృష్ణ. ప్లానింగ్‌ నుంచి మొదలు కొని.. ప్రసార పర్వం పూర్తయ్యేదాకా ప్రతీ దశలోనూ ఆయన మార్క్‌ ఉంటుంది. పాత్రికేయ వృత్తిలో అన్ని కోణాలనూ స్పృశించి, ప్రతి అంశాన్నీ విశ్లేషించే సమర్థత కలిగిన నిఖార్సయిన జర్నలిస్టు ఆయన. అక్షర దోషాలు మొదలుకొని.. ఏ పొరపాటునైనా ఇట్టే గ్రహించగలిగే సునిశిత పరిశీలన రాధాకృష్ణకే సొంతం. స్వతహాగా జర్నలిస్టు అయిన ఆర్‌కే.. ఛానెల్‌ యజమానిగా కేవలం పర్యవేక్షణకే పరిమితం కాలేదు. వార్తల్లో, వార్తల ప్రసారాల్లో, చర్చా వేదికల్లో, తన మానసపుత్రిక అయిన ఇంటర్వ్యూల్లో భాగస్వాములవుతున్నారు. ఏబీఎన్‌ ప్రసారాల్లో మరింత జోష్‌ పెంచుతున్నారు. 


మీడియారంగంలో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా ఘోస్ట్‌ రైటర్లను నమ్ముకోని సవ్యసాచి ఆర్‌కే. తన మస్తిష్కంలో పుట్టిన ఆలోచనలతో, తనదైన సోర్స్‌తో సంపాదించే ఎక్స్‌క్లూజివ్‌ సమాచారంతో స్వయంగా వీకెండ్‌ కామెంట్‌ రాస్తున్న వన్‌ అండ్‌ ఓన్లీ మీడియా లెజెండ్‌ రాధాకృష్ణ. తన సంస్థలో పనిచేసే వాళ్లందరినీ పేరుపెట్టి పిలిచే నైజం రాధాకృష్ణకే సొంతం. ఎవరికి ఎంత సమర్థత ఉంది? ఎవరు ఎలా పనిచేయగలుగుతారు? ఎవరు ఎలా ఛానెల్‌ డ్రైవ్‌లను నిర్వహించగలుగుతారు? వంటివి స్వయంగా అంచనా వేయగల మేధావి రాధాకృష్ణ. ఇలా ఆయన స్వీయ పర్యవేక్షణే ఏబీఎన్‌కు శ్రీరామరక్షగా నిలుస్తోంది. ఏబీఎన్‌ను సమున్నత స్థానంలో నిల్చునేలా చేస్తోంది.


ఇక.. ఏబీఎన్‌ పేరు చెబితే మొదటగా గుర్తొచ్చేది ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమం. తెలుగు మీడియా రంగంలో ఇదో సంచలనం. తెలుగు టెలివిజన్‌ న్యూస్‌లో ఓ ట్రెండింగ్‌. ఇంతకు ముందెన్నడూ రాని, ఇక ముందెవరూ చేయలేని దమ్మున్న ఇంటర్వ్యూలకు కేరాఫ్‌ అడ్రస్‌. జర్నలిస్ట్‌ ఆర్కే ముందు హాట్‌సీట్‌లో కూర్చోవాలని ఎంతో మంది ప్రముఖులు, మరెంతో మంది ఉద్ధండులు తహతహలాడే అరుదైన కార్యక్రమం ఇది. అలాంటి ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే గురించి తెలియని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదనడంలో అతిశయోక్తి లేదు. అది ప్రసారమయ్యే సమయానికి ఆర్కే నిర్వహించే ఓపెన్‌ హార్ట్‌ కార్యక్రమం కోసం టీవీలను అతుక్కుపోయే వీరాభిమానులను సంపాదించుకుంది. ప్రముఖుల అంతరంగాన్ని, వాళ్ల మనసుల్లోని ఆలోచనలను వడపోత లేకుండా, సెన్సార్‌షిప్‌ లేకుండా ప్రసారం చేసిందీ కార్యక్రమం. ఓపెన్‌ హార్ట్‌లో అస్త్రాల్లా దూసుకెళ్లే ఆర్కే ప్రశ్నలకు ఎదురుగా ఎవరున్నా సరే.. సూటిగా సమాధానం రావాల్సిందే. అసలు విషయం బయటకు తెలియాల్సిందే.


ఓపెన్‌హార్ట్‌లో దమ్మున్న ప్రశ్నలడుగుతారు ఆర్కే. ప్రముఖుల మస్తిష్కాల్లో పొరలు కప్పుకున్న అరుదైన అనుభవాలను, వాళ్ల మనసు తెరల్లో దాగిన విలువైన అభిప్రాయాలను పట్టి లాగుతారు ఆర్కే. అప్పటిదాకా ఎవరికీ చెప్పని, ఎవరికీ తెలియని, ఎవరికీ చెప్పొద్దనుకున్న, బాహాటం చేయవద్దనుకున్న అంశాలెన్నింటినో ప్రముఖుల నోటినుంచి బాహాటం చేయగలుగుతారు. అందుకే ఓపెన్‌హార్క్‌ విత్‌ ఆర్కే కార్యక్రమం తెలుగు లోగిళ్లలో ప్రతి ఒక్కరి మనసునూ చేరుతోంది. ప్రతి టెలివిజన్‌ వీక్షకుడినీ కదిలిస్తోంది. తదుపరి ఎపిసోడ్‌లో కనిపించే ప్రముఖులెవరనే ఆసక్తిని రేకెత్తించడం నుంచి.. ఆ ప్రముఖుల ప్రోమో టీవీలో కనిపించగానే.. వాళ్లేం చెప్పబోతున్నారో అన్న ఉత్కంఠను కలిగించడం ఓపెన్‌ హార్ట్‌ విత్ ఆర్కే స్పెషల్‌. 


ఇదివరకు ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే రెండు సీజన్‌లు పూర్తిచేసుకుంది. ఇటీవలే సీజన్‌-3 మొదలయ్యింది. అయితే, సీజన్‌ - 3 ప్రారంభమే ఓ సంచలనం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చకు కేంద్రబిందువుగా మారింది. టెలివిజన్‌లో వీక్షకుల విషయంలోనే కాదు.. డిజిటల్‌ మీడియాలో భాగమైన యూట్యూబ్‌ వ్యూస్‌లోనూ కొత్త చరిత్రను తిరగరాసింది. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే సీజన్‌-3లో మొదటి ఎపిసోడ్‌కు వైఎస్‌ షర్మిల గెస్ట్‌గా కనిపించడమే పెద్ద ట్విస్ట్‌గా మారింది. తొలి గెస్ట్‌ ఎవరన్నది విశ్లేషకుల అంచనాలనే అందుకోలేకపోయింది. ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ రంగంలో సంచలనం రేకెత్తించింది. తొలుత.. ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కేలో ఏం మాట్లాడింది, ఏం చెప్పింది అనే దానికంటే.. అసలు షర్మిల ఈ కార్యక్రమంలో కనిపించి అందరికీ షాకిచ్చారు. 


మరోవైపు.. ఈ కార్యక్రమంలో షర్మిల కనిపించడమే ఒక ఎత్తయితే.. అరుదైన ప్రశ్నలు అడిగి.. విలువైన సమాధానాలు రాబట్టారు జర్నలిస్ట్‌ ఆర్కే.  ఇంతవరకూ ఏ పాత్రికేయుడు చేసిన ఇంటర్వ్యూకు అతి తక్కువ సమయంలో ఈ స్థాయిలో స్పందన లభించలేదు. ఆర్కే ఏం అడుగుతారు.. షర్మిల ఏం చెబుతారు అనే ఉత్కంఠతో లక్షల మంది లైవ్‌లో టీవీలకు, డెస్క్‌టాప్‌లకు, స్మార్ట్‌ఫోన్‌లకు అతుక్కుపోయి చూశారు. ఆ తర్వాత కూడా ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు. యూట్యూబ్‌ సెర్చ్‌లో ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే సీజన్‌ - 3 కోసం వెతుకుతూనే ఉన్నారు. ఫలితంగా ఈ ఎపిసోడ్‌ రికార్డులు తిరగ రాసింది. తెలుగు మీడియా, డిజిటల్‌ మీడియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది. 


మరోవైపు.. నిరంతర సమాచార స్రవంతిని నిక్కచ్చిగా ప్రసారం చేస్తూనే.. వారానికోసారి వీకెండ్‌ కామెంట్‌లో రాజకీయ, సామాజిక లోగుట్టును ఆవిష్కరిస్తారు ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ. బయటకు రాని ఎన్నో విషయాలను, ఎన్నెన్నో సంభాషణలను ముక్కుసూటిగా తన కలంతో జాలువారుస్తారు. వర్తమాన రాజకీయ పరిణామాలను సునిశితంగా విశ్లేషిస్తారు. ఎవరి బండారం ఏంటో కుండబద్దలు కొడతారు. ఏబీఎన్‌లో వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్కేగా ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్‌ మరుసటిరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆర్కే కొత్తపలుకుగా పాఠకులను చేరుతుంది.


ఏ పరిణామం ఎదురైనా, ఏ సంఘటన జరిగినా ప్రజల పక్షానే నిలబడి పోరాడుతోంది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. ప్రజలకు ఆపద ఎదురవుతోందని తెలిసినా, ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు.. జనానికి ఇబ్బందులు కలిగిస్తాయని తెలిసినా, నష్టదాయకంగా పరిణమించినా చూస్తూ ఊరుకోవడంలేదు ఏబీఎన్‌. బిగ్‌డిబేట్‌లు నిర్వహిస్తూ వస్తోంది. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా బిగ్‌డిబేట్‌లు నిర్వహిస్తున్నారు. అవసరమైనప్పుడల్లా తన ఆలోచనకు పదును పెడుతున్నారు. నిపుణులను, ప్రముఖులను ముఖాముఖి కూర్చోబెట్టి అసలు విషయమేంటో బట్టబయలు చేయిస్తున్నారు. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనకరంగా పరిణమించిన ఆర్థిక పరిస్థితుల మీద ఇటీవల రాధాకృష్ణ బిగ్‌ డిబేట్‌ నిర్వహించారు. రాజకీయ, ఆర్థిక, న్యాయ నిపుణుల ఒపీనియన్‌ను ప్రజల చెంతకు చేర్చారు.


కేవలం ప్రముఖులు, నిపుణులతో చర్చించే బిగ్‌ డిబేట్‌లకే పరిమితం కావడం లేదు ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ. అవసరమనుకున్న సందర్భంలో ఓపెన్‌ డిబేట్‌ చేపడుతున్నారు. ఇన్‌హౌస్‌లో జరిగే బిగ్‌డిబేట్‌లకు భిన్నంగా.. అందరినీ భాగస్వామ్యం చేసేలా ఓపెన్‌ డిబేట్‌లు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలను, అధికారులను, విశ్లేషకులను, అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఓపెన్‌ డిబేట్‌ ద్వారా చర్చలు నిర్వహిస్తారు. ప్రభావితమయ్యేవాళ్లను, పరిష్కారాలు చూపించే నిర్ణేతలను ముఖాముఖిగా కూర్చోబెట్టి సమస్యలను, నిర్ణయాలను విశ్లేషిస్తారు. 


'నేటి యువతే రేపటి దేశ భవిత' అన్న వాస్తవాన్ని చదువుకునే రోజుల నుంచే విద్యార్థులకు గుర్తు చేసింది ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి. యంగిస్థాన్‌ అంటూ యంగ్‌ పీపుల్‌ ఆశలు, ఆశయాలకు పదును పెట్టింది. ఏబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా కాలేజీలు, యూనివర్సిటీలకు వెళ్లి.. యువత కర్తవ్యాన్ని గుర్తు చేశారు. వాళ్ల మనసుల్లో ఉన్నతమైన ఆలోచనలు నాటారు. 


ఏబీఎన్‌ వార్తా స్రవంతిని ప్రజల ముందుకు తేవడమే కాదు.. సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తోంది. వార్తా కథనాలే కాకుండా, ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు రూపొందించి ప్రజలను కూడా భాగస్వాములను చేస్తోంది. అందులో భాగంగానే ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ ఆలోచనలకు ప్రతిరూపంగా 'నీ బడి పిలుస్తోంది' అంటూ.. ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈతరం పెద్దలకు చిన్ననాటి జ్ఞాపకాలను స్మరించుకునేలా చేయడమే కాదు.. ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్న వాళ్లకు.. ఆ చిన్ననాటి పాఠశాల పరిస్థితిని చూపించి అండగా నిలవాలన్న ఆకాంక్షను రేకెత్తించింది. వాళ్ల బాధ్యతను గుర్తు చేసింది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో పూర్వ విద్యార్థుల అండదండలతో పదుల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. ఈ తరం విద్యార్థులకు ఆధునిక వసతులు, సదుపాయాల మధ్య విద్యాబోధన చేసేందుకు 'నీ బడి పిలుస్తోంది' కార్యక్రమం ఎంతగానో దోహదపడింది. 


- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2021-10-15T19:15:06+05:30 IST