ABN Effect: సోషల్ మీడియా ట్రోలర్స్‌పై పోలీసుల ఉక్కుపాదం

ABN , First Publish Date - 2022-01-07T21:12:26+05:30 IST

సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ట్రోలింగ్‌కు పాల్పడేవారు, అసభ్యకర కామెంట్లు పెట్టే వారిపై...

ABN Effect: సోషల్ మీడియా ట్రోలర్స్‌పై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్: సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో ట్రోలింగ్‌కు పాల్పడేవారు, అసభ్యకర కామెంట్లు పెట్టే వారిపై నగరంలోని ట్రై కమిషనరేట్ల సీపీలు దృష్టి సారించారు. ఒకవైపు ట్రోలర్స్ బాధితులు పెరగడం, మరోవైపు ఫిర్యాదులు కూడా వెల్లువెత్తడంతో ట్రోలింగ్ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇదే ట్రోలర్స్ ఆగడాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేయడంతో పోలీసులు స్పందించారు. ట్రోలింగ్, బాడీ షేమింగ్‌లతో విరుచుకుపడుతున్న ట్రోలర్స్‌పై బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


ట్రోలింగ్ మాఫియా దెబ్బకు యూట్యూబర్స్‌తోపాటు పబ్లిక్ విలవిల్లాడుతున్నారు. సోషల్ మీడియాతో వ్యక్తిగత దూషణలకు పాల్పడడంతోపాటు ఫోటో మార్ఫింగ్‌లతో విరుచుకుపడుతున్నారు. అదేంటని ప్రశ్నిస్తే ట్రోలింగ్ తీవ్రత పెంచి యూట్యూబర్లను మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. వినడానికి, పలకడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే మాటలతో హింసిస్తున్నారు. పోలీసులు ఏమీ చేయలేరన్న దీమాతో బ్లాక్ మెయిలింగ్‌కు సయితం పాల్పడుతున్నారు. ఈ ట్రోలర్స్ ఆగడాలను తట్టుకోలేని కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.


కొందరు బాధితులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించారు. వారిచ్చిన సమాచారం మేరకు ట్రోలర్స్‌పై ఏబీఎన్ వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో స్పందించిన పోలీసులు ట్రోలింగ్, బాడీ షేమింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యూ ట్యూబర్స్‌పై ఐటీ యాక్టులోని పలు సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసినప్పటికీ ట్రోలర్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. మరింత పదును పెంచి ట్రోలింగ్‌ను ఉధృతం చేస్తున్నారు. పోలీసులు, న్యాయస్థానాలపై కూడా సెటైర్లు వేస్తున్నారు. ఈ ట్రోలింగ్ బూతంపై ట్రై కమిషన్లు సీరియస్‌గా దృష్టి సారించారు. ట్రోలర్స్ బారిన పడినవారు పోలీసులను ఆశ్రయిస్తే సత్వరమే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అంతే త్వరగా నిందితులకు శిక్షలు పడే చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో ఉంటూ ట్రోలింగ్ చేస్తున్నవారి పాస్ పోస్టు రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

Updated Date - 2022-01-07T21:12:26+05:30 IST