జనసేన నేతలను భయపెడుతున్న ‘కాషాయ’ కండువా.. ఊహించని షాక్‌లు!?

ABN , First Publish Date - 2021-03-05T18:19:51+05:30 IST

జనసేన నేతలను కాషాయ కండువా భయపెడుతుందా?

జనసేన నేతలను భయపెడుతున్న ‘కాషాయ’ కండువా.. ఊహించని షాక్‌లు!?

జనసేన నేతలను కాషాయ కండువా భయపెడుతుందా? మున్సిపల్‌ ఎన్నికల్లో ఆ కండువా మెడలో వేసుకుని ప్రచారానికి వెళ్లేందుకు జంకుతున్నారా? సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి సత్తా చాటాలనుకుంటున్న జనసైనికులు.. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఉమ్మడిగా వెళ్లేందుకు హడలెత్తిపోతున్నారా? ఇంతకీ జనసేన అభ్యర్థులు బీజేపీకి దూరంగా ఎందుకుంటున్నారు? వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటి? అనేది ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఇన్‌సైడ్‌లో చూద్దాం.


ఊహించని షాక్‌లు.. 

పుర పోరుకు సన్నద్ధమవుతున్న బీజేపీ-జనసేన కూటమికి ఊహించని షాక్‌లు తగులుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఏపీ సమస్యలపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు..బీజేపీ నేతలకే కాకుండా జనసైనికులపై ఆ ప్రభావం పడుతుందట. దాంతో పవన్‌ పార్టీ నేతల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారిందట. మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తుందనే భయం కూడా పట్టుకుందనే చర్చ సాగుతోంది.


కొత్త సమస్య..!

అయితే కార్పొరేషన్‌ ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. రాజకీయాలకతీతంగా పార్టీ గుర్తుల్లేకుండా జరిగిన పంచాయతీ పోరులో..గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన మద్ధతుదారులు గ్రామస్థాయిలో పొత్తు కుదుర్చుకుని మరీ పోటీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కమలం పార్టీకి బలం లేకపోవడంతో జనసేన మద్దతుదారులు.. తెలుగుదేశం అభ్యర్థులతో సర్దుబాట్లు చేసుకున్నారు. కానీ పార్టీ గుర్తులపై జరిగే కార్పొరేషన్‌ ఎన్నికల్లో మాత్రం అది సాధ్యం కావడం లేదట. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే ఈ పోరులో ఇప్పుడు జనసేన అభ్యర్థులకు కొత్త సమస్య వచ్చిందట. సహజంగా పొత్తు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ, జనసేన కండువాలు మెడలో వేసుకుని ప్రచారం చేస్తారు.


కాషాయ కండువాతో ప్రచారానికి వెళ్తే..!

అయితే విజయవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో సీపీఐ, తెలుగుదేశం పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్నాయి. సీపీఐ అభ్యర్థులు తమ పార్టీ కండువాతో పాటు టీడీపీ కండువాను కూడా మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, బోండా ఉమామహేశ్వరరావు  సీపీఐ పోటీ చేసే వార్డుల్లో వారికి మద్ధతుగా ప్రచారం చేస్తున్నారు. కానీ జనసేన అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో కొత్త తలనొప్పి మొదలైందట. మెడలో జనసేన కండువాతో పాటు కాషాయ కండువా వేసుకుని ప్రచారానికి వెళ్తే.. బీజేపీ కండువా తీసేసి రావాలని ప్రజలు మొహం మీదే చెప్పేస్తున్నారట. రాజధాని అమరావతిపై ద్వంద్వ వైఖరి, ప్రత్యేక హోదాపై తేల్చకపోవడం..విశాఖ స్టీల్‌ కంపెనీని ప్రైవేటీకరణకు యత్నించడం వంటి అంశాలను గుర్తుచేస్తూ ఓటర్లు కడిగిపారేస్తున్నట్లు టాక్. మరీ ముఖ్యంగా విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాలతో పాటు గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితిని జనసేన అభ్యర్థులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. 


నొక్కి మరీ చెబుతున్నారట..

జనసేన అభ్యర్థులు తాము ఫేస్‌ చేస్తున్న సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు టాక్‌ వినిపిస్తోంది. తాము ప్రచారానికి వెళ్లేటప్పుడు బీజేపీ నేతలతో కలిసి వెళ్లడం లేదనీ.. మెడలో కాషాయ కండువాలు వేసుకోవడం లేదని వివరించారట. జనసేన అధినేత పవన్ పోరాటాన్ని తాము సమర్థిస్తామనీ, ప్రత్యేక హోదా కోసం ఆయన ఉద్యమించిన తీరు ఓటర్లు తమకు గుర్తుందన్నట్లు చెబుతున్నారు. అలాగే అమరావతి కోసం పవన్ కల్యాణ్‌ గట్టిగా ఉద్యమించాలని పలువురు ప్రజలు జనసేన అభ్యర్థులకు నొక్కి చెబుతున్నారట. అయితే పోరాడటం, ప్రశ్నించడంలో పవన్‌ తీరును కొనియాడుతూనే.. రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీ పట్టించుకోవడంలేదని వారు తూర్పారపడుతున్నారట.


ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో..!

చివరకు అమరావతిపై కూడా పార్టీ వేరు, కేంద్రం వేరు అని కమలనాథులు చెప్పడాన్ని విజయవాడలో కొందరు విమరిస్తున్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో స్థానికంగా ఉండే బీజేపీ నాయకులకు, కాషాయ కండువాలకు జనసేన నేతలు దూరం ఉంటూ..తమ పార్టీ కండువాలతో ప్రచారాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగాలేదని జనసేన అభ్యర్థులు బహిరంగంగానే చెబుతున్నారట. మున్ముందు ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Updated Date - 2021-03-05T18:19:51+05:30 IST