Abn logo
Sep 13 2021 @ 12:49PM

YSRCP కి తలనొప్పిగా మారిన మహిళా కమిషనర్.. బెడిసి కొట్టిన ప్లాన్.. నేతల్లో టెన్షన్.. టెన్షన్.. విజయసాయి చెబితేనే వింటా..!

విశాఖలో అధికార వైసీపీకి ఆ అధికారి తలనొప్పిగా మారారా? విశాఖలో ఆ అధికారి ఉంటే.. పార్టీకి చెడ్డ పేరు రావడం ఖాయమని ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్‌ఛార్జ్‌ విజయసాయిరెడ్డికి నేతలు మొర పెట్టుకున్నారా? మంత్రినైన తాను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆ అమాత్యుడు వాపోయారా? ఏదైనా విజయసాయిరెడ్డి చెబితేనే తాను చేస్తానని ఆ అధికారి చెబుతున్నారా? ఇంతకీ విశాఖలో అధికార పార్టీని నేతలను అంతలా టెన్షన్‌ పెడుతున్న ఆ అధికారి ఎవరు? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

ఆమెను వెంటనే తొలగించండి..!

విశాఖ రుషికొండలోని ఏ1 కన్వెక్షన్ హోలులో వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డి పార్టీ నేతలతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు, మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. విజయసాయిరెడ్డికి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజనపై ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకుని ఆయన ముందు గగ్గోలు పెట్టారు. జీవీఎంసీ కమిషనర్ సృజనపై అధికార పార్టీ కార్పొరేటర్లతో పాటు, ఓడిన కార్పొరేటర్లు సైతం ఫిర్యాదుల వర్షం కురిపించారు. "ఆమెను జీవీఎంసీ కమిషనర్ పదవి నుంచి వెంటనే తొలగించండి.. లేదంటే పార్టీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది" అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెతో తాము వేగలేకపోతున్నామనీ, కనీసం విలువ కూడా ఇవ్వడం లేదనీ, మర్యాద లేకుండా వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు.

ఫిర్యాదులు, అభ్యంతరాలు.. ఆక్షేపణలు

సుమారు 4 గంటలపాటు జరిగిన సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సృజనపై ఫిర్యాదులు, అభ్యంతరాలు, ఆక్షేపణలు చేయడానికే పార్టీ నేతలంతా ఎక్కువ సమయాన్ని వెచ్చించారట. పలువురు కార్పొరేటర్లు.. జీవీఎంసీ అధికారుల నుంచి కమిషనర్ వరకు ఎవరూ తమ మాట వినడం లేదనీ, కమిషనర్ అయితే.... కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదనీ ఆవేదన వ్యక్తం చేశారు. విపక్ష పార్టీకి చెందిన విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు ఇచ్చిన విలువలో సగం కూడా తమకు ఇవ్వడం లేదని మొర పెట్టుకున్నారు. వార్డులో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళుతుంటే ఒక్క పని కూడా కావడం లేదని ఆరోపించారు.

అసలు కథ ఇదీ..

ఇక పార్టీకే చెందిన వ్యక్తులు చిన్న చిన్న తేడాలతో నిర్మించుకున్న ఇళ్లను కూడా నిర్దాక్షిణ్యంగా కూలగొడుతున్నారన్నారు. చిన్నపాటి పొరపాటేనని, సరిచేస్తామని చెప్పినా... అధికారుల నుంచి కమిషనర్ వరకు ఎవరూ మాట వినడం లేదన్నారు. చివరకు సచివాలయ సిబ్బంది కూడా తమను లెక్క చేయడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన పనులు చేయలేనప్పుడు.. ఇక తాము కార్పొరేటర్లుగా గెలిచి ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. నగరంలో పార్టీకి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు.

జోక్యం చేసుకోండి..!

ఈ దశలో టీడీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ ఒకరు సమావేశంలో మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు టీడీపీకి పరిస్థితి అంతా బాగుందని అనుకున్నారనీ, చివరకు జీవీఎంసీ ఎన్నికలు వచ్చేసరికి సైకిల్‌ గుర్తుకి ప్రజలు ఓట్లు వేయలేదనీ అన్నారు. ప్రస్తుతం నగరంలో అదే పరిస్థితి నెలకొందనీ, ఇప్పటికైనా జోక్యం చేసుకుని కార్పొరేటర్లకు విలువ ఇవ్వడంతో పాటు ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించేలా దృష్టి సారించాలన్నారు.

విజయసాయి చెబితేనే..!

సమావేశానికి హాజరైన మంత్రి సైతం తన ఆవేదనను విజయసాయిరెడ్డి ముందు వెల్లడించారు. నగరంలో అధికారులు ఎవరూ తన మాట వినడం లేదనీ, చెప్పిన పనులు చేయడం లేదనీ ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి చెబితేనే చేస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. దీనిపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ... కమిషనర్, అధికారులతో పాటు మమేకమై పనులు చేయాలని సమాధానమిచ్చారు. ప్రస్తుత కమిషనర్‌ను మార్చిన తర్వాత అలాంటి కమిషనరే మరలా వస్తే ఏం చేస్తారని పార్టీ నేతలకు విజయసాయిరెడ్డి సర్దిచెప్పారట. దీంతో మంత్రి నుంచి వైసీపీ నేతలంతా సైలెంట్‌ అయిపోయారట. మొత్తంమీద తమకు తలనొప్పిగా మారిన జీవీఎంసీ కమిషన్‌ సృజనను పంపించేందుకు వైసీపీ నేతలు వేసిన ప్లాన్‌ బెడిసి కొట్టడంతో వారంతా అవాక్కయ్యారని సమాచారం. ఎంతైనా విజయసాయిరెడ్డి చెబితేనే చేస్తానన్న జీవీఎంసీ కమిషనర్‌కు ఆయన మద్దతుగా నిలిచారన్న గుసగుసలు వినిపించడం కొసమెరుపు.