ఏది లీగల్‌.. ఎవరు లిటిగెంట్‌?

ABN , First Publish Date - 2020-08-30T05:55:30+05:30 IST

న్యాయవ్యవస్థను చంద్రబాబునాయుడు మేనేజ్‌ చేస్తున్నారన్నది జగన్‌ అండ్‌ కో ప్రధాన ఆరోపణ.

ఏది లీగల్‌.. ఎవరు లిటిగెంట్‌?

న్యాయవ్యవస్థను చంద్రబాబునాయుడు మేనేజ్‌ చేస్తున్నారన్నది జగన్‌ అండ్‌ కో ప్రధాన ఆరోపణ. హైకోర్టులో జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నందున ఇలాంటి ఆరోపణలను నిజమేనని ప్రజలు నమ్మే ప్రమాదం లేకపోలేదు. జగన్‌ అండ్‌ కో కోరుకుంటున్నది కూడా ఇదే! అందుకే హేతుబద్ధత లేకపోయినా ఇటువంటి ఆరోపణలను పదే పదే చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను నిజంగా మేనేజ్‌ చేయవచ్చా? మెరిట్‌తో సంబంధం లేకుండా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వగలవా? చరిత్ర చూస్తే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని అర్థమవుతుంది. కేసుల విచారణ సత్వరం జరగకుండా కిందిస్థాయిలో మేనేజ్‌ చేయడం గురించి విన్నాం, చూస్తున్నాం. కానీ, తీర్పుల విషయంలో అలా సాధ్యం కాదు. జగన్‌ తనపై నమోదైన అవినీతి కేసులలో సత్వర విచారణ జరగకుండా చట్టంలో ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకున్నట్టుగానే ఇతరులు కూడా చేసి ఉండవచ్చు. మెరిట్‌తో సంబంధం లేకుండా తీర్పులు వెలువడినా వాటిని సమీక్షించడానికి పై కోర్టులు ఉన్నాయని తెలుసుకోవాలి.


హైదరాబాద్‌ వంటి మహానగరంలోనే లేక్‌ వ్యూ వంటి అతిథిగృహం ఐదు ఎకరాలలో ఉండగా విశాఖలో 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించాలనుకోవడం ఏమిటి? హైదరాబాద్‌ సమీపంలో దాదాపు 20 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నెలకొల్పే పనులను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అభివృద్ధి అంటే అటువంటి ఆలోచనలు చేయాలి గానీ, ప్యాలెస్‌లను తలపించే ఇళ్లు నిర్మించుకోవడం, ఏకంగా 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించుకోవడం కాదు. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్‌ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది. ఇంతవరకు అటువంటి ఆలోచన ఒక్కటైనా చేశారా? నిజమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఎవరినో నిందించి ప్రయోజనం ఏమిటి?


పేదలకు ఇళ్ల స్థలాల కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడడానికి నిజంగా ప్రతిపక్షాలు కారణమా? అంటే కానే కాదు! ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే న్యాయస్థానాలలో ఆటంకాలు ఎదురవుతున్నాయని స్పష్టమవుతున్నది. ‌ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో జరిగిన అవినీతిని పక్కనపెడితే లబ్ధిదారులు తమకు లభించిన స్థలాలను అయిదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వాలని జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో ఉన్న అసైన్‌మెంట్‌ చట్టానికి విరుద్ధం. ఈ కారణంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు స్పష్టంచేసింది. అసైన్‌మెంట్‌ చట్టం పరిధిలో గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను డీకేటీ పట్టాల రూపంలో ఇచ్చేవి. ఈ విధానం గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు! ఇప్పుడు మాత్రం ఎందుకు వివాదం అయిందంటే, అమల్లో ఉన్న చట్టానికి విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం. ఈ వాస్తవాన్ని విస్మరించి ప్రతిపక్షాలను, న్యాయస్థానాలను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? 


చంద్రబాబు ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించి వివిధ నిర్మాణాల కోసం పది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ‘‘అమరావతి మాకు వద్దు, విశాఖకు పోతాం’’ అంటే హైకోర్టులో కేసులు దాఖలు కాకుండా ఎందుకుంటాయి? అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, చేసిన ఖర్చుకు బాధ్యత తీసుకోకుండా ‘‘మాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. వెళ్లిపోతాం’’ అంటే కుదురుతుందా? అలా అయితే న్యాయస్థానాలు ఎందుకు? రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారా అమరావతిలో ఏర్పాటైన హైకోర్టును.. అధికారం ఉంది కదా అని కర్నూలుకు తరలించే విధంగా చట్టం చేస్తే చెల్లుబాటు అవుతుందా? న్యాయపరమైన, విధానపరమైన, నైతికపరమైన వివాదాలు ఎన్నో ఇమిడి ఉన్న అభివృద్ధి వికేంద్రీకరణ చట్టానికి వెంటనే ఆమోద ముద్ర వేయడానికి హైకోర్టు ఏమీ గవర్నర్‌ కార్యాలయం కాదు.


‘‘ప్రజలకు మంచి చేద్దామనుకుంటుంటే లిటిగేషన్లతో న్యాయస్థానాలకు వెళుతూ అడ్డుకుంటున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేద్దామంటే సైంధవ పాత్ర పోషిస్తున్నారు’’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిందిస్తోంది. ఇటు హైకోర్టులోనూ అటు సుప్రీంకోర్టులోనూ వరుసగా ఎదురుదెబ్బలు తగలడంతో అధికార వైసీపీ ఈ కొత్త పల్లవి అందుకుంది. ‘‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే అడ్డుపడుతున్నవారిని కమ్యూనిస్టులు కూడా నిలదీయకపోవడం ఏమిటి?’’ అని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశం, లక్ష్యం ఎంత గొప్పవైనా దాన్ని చేరుకోవడానికి ఎంచుకొనే మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉండాలని ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అవార్డు పొందిన దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ సూత్రాన్ని విస్మరించి తలబిరుసుతనం, అహం ప్రదర్శించడం వల్లనే న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోపం ఎక్కడుందో గుర్తించకుండా తాము అనుకున్నది జరగడం లేదని ఆక్రోశం వెళ్లగక్కడం వల్ల ప్రయోజనం ఉండదని గ్రహించకపోగా, ప్రతిపక్షాలను నిందించే ఎత్తుగడకు తెర లేపారు. ప్రభుత్వం చేసే పనులలో లోపాలను ఎత్తిచూపినప్పుడు ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని అధికారంలో ఉన్నవారు విమర్శించడం కొత్తేమీ కాదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రభుత్వ పోకడలు వింత రీతిలో ఉంటున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల విషయమే తీసుకుందాం. ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడడానికి నిజంగా ప్రతిపక్షాలు కారణమా? అంటే కానే కాదు! ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లనే న్యాయస్థానాలలో ఆటంకాలు ఎదురవుతున్నాయని స్పష్టమవుతున్నది. ఇళ్ల స్థలాల కోసం భూసేకరణలో జరిగిన అవినీతిని పక్కనపెడితే లబ్ధిదారులు తమకు లభించిన స్థలాలను అయిదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వాలని జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లో ఉన్న అసైన్‌మెంట్‌ చట్టానికి విరుద్ధం. ఈ కారణంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. కన్వేయన్స్‌ డీడ్‌లు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వాలు తమకు కేటాయించే ఇళ్ల స్థలాలను అమాయకంగా అమ్ముకుని మళ్లీ ఇళ్లు లేని పేదలుగా మిగలకూడదన్న ఉద్దేశంతో వాటిని అమ్ముకోవడాన్ని నిషేధిస్తూ 1977లో ఉమ్మడి రాష్ట్రంలోనే అసైన్‌మెంట్‌ చట్టం తెచ్చారు. ఈ చట్టం పరిధిలో గత ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలను డీకేటీ పట్టాల రూపంలో ఇచ్చేవి. ఈ విధానం గతంలో ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు! ఇప్పుడు మాత్రం ఎందుకు వివాదం అయిందంటే, అమల్లో ఉన్న చట్టానికి విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కారణం. ఈ వాస్తవాన్ని విస్మరించి ప్రతిపక్షాలను, న్యాయస్థానాలను తప్పుబట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడానికి వీలుగా డీడ్స్‌ ఇవ్వడాన్ని చట్టం అనుమతించదని అధికారులు చెప్పినా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వినిపించుకోలేదు. లబ్ధిదారుల నుంచి పది రూపాయల ఫీజు తీసుకొని కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ చేయడానికి వీలుగా 44వ నంబర్‌ జీవో జారీ చేశారు. ఈ జీవోకు చట్టబద్ధత లేదని హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో ఉంది. 


చట్టం అలా.. వీళ్లిలా..!

1977నాటి అసైన్‌మెంట్‌ చట్టం అమల్లో ఉండగా సుప్రీంకోర్టు మాత్రం 44వ నంబర్‌ జీవోను ఎలా సమర్థిస్తుంది? చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది జనవరిలో అసైన్‌మెంట్‌ చట్టానికి సవరణ చేసింది. దీని ప్రకారం 20 ఏళ్ల తర్వాత మాత్రమే అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. సవరించిన చట్టానికి అనుగుణంగా 17 నెలల తర్వాత అధికారులు రూల్స్‌ జారీ చేశారు. జగన్‌ ప్రభుత్వంలో జారీ అయిన ఈ రూల్స్‌ ప్రకారం చూసినా ఐదేళ్ల తర్వాత అమ్ముకోవడం చట్ట విరుద్ధం అవుతుంది. జగన్‌ కోరుకుంటున్నట్టు కన్వేయన్స్‌ డీడ్‌లు జారీ చేయాలంటే అసైన్‌మెంట్‌ చట్టాన్ని మళ్లీ సవరించాలి. అయితే సదరు సవరణలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. కేంద్ర అసైన్‌మెంట్‌ చట్టానికి విరుద్ధంగా ఉండే సవరణలను కేంద్ర ప్రభుత్వం సహజంగానే తిరస్కరిస్తుంది. నిజానికి పేదలు కూడా ఐదేళ్ల తర్వాత తమకు కేటాయించిన స్థలాలను అమ్ముకోవడానికి వీలుగా పట్టాలు ఇవ్వాలని కోరడం లేదు. దీన్నిబట్టి తప్పెవరిది? ప్రతిపక్షాలదా? ప్రభుత్వానిదా? అసైన్డ్‌ భూములను కొనుక్కోవడం కూడా చట్ట విరుద్ధమే. పులివెందుల సమీపంలో తమ కుటుంబం చట్టం తెలియని కారణంగా అసైన్డ్‌ భూములు కొనుగోలు చేసిందని ఒకప్పుడు దివంగత రాజశేఖర్‌ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విచారం వ్యక్తంచేశారు. రాజధాని అమరావతి కోసం చంద్రబాబు ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అసైన్డ్‌ భూములు సేకరించిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌ అండ్‌ కో విమర్శించింది. గృహ నిర్మాణ సంఘాలకు ప్రభుత్వం కేటాయించే స్థలాలను కూడా నిర్దిష్టకాల పరిమితి లోపు విక్రయించకూడదన్న నిబంధన పెడతారు. అలా అనుమతిస్తే ఇళ్ల స్థలాల కేటాయింపు లక్ష్యం నెరవేరదన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు ఇటువంటి నిబంధనల్ని విధిస్తాయి. శాసనసభ్యులు, ఎంపీలకు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన ఇళ్ల స్థలాలకు కూడా ఇటువంటి నిబంధన పెట్టారు. ఈ వాస్తవాలను విస్మరించి 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే అడ్డుకుంటున్నారు అని జగన్‌ అండ్‌ కో విమర్శించడం ఎంతవరకు సమంజసం! ‘చాదస్తపు మొగుడు చెబితే వినడు.. గిల్లితే ఏడుస్తాడు’ అన్నట్టుగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వ్యవహారం ఉంది. చట్టాన్ని సవరించకుండా, అమల్లో ఉన్న చట్టానికి విరుద్ధంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకుంటే కుదురుతుందా? ప్రజలు అధికారం ఇచ్చారు కనుక తాను అన్నిటికీ అతీతం అనుకుంటే పరిణామాలు ఇలాగే ఉంటాయి. ప్రజలు అమాయకులు, తాము ఏమి చెప్పినా నమ్ముతారు అని జగన్‌ అండ్‌ కో భావిస్తున్నట్టుగా ఉంది. ఇళ్లస్థలాల కేటాయింపు విషయంలో ఇష్టం వచ్చినట్టు చేద్దామనుకుంటే, ఆ కార్యక్రమం వాయిదా పడుతూనే ఉంటుంది. ప్రతిపక్షాలనూ, న్యాయస్థానాలనూ ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి జగన్‌ అండ్‌ కోతో పాటు నీలి బ్యాచ్‌ చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి. గతంలో ఎన్నడూ వివాదాస్పదం కాని ఇళ్లస్థలాల కార్యక్రమం ఇప్పుడే ఎందుకు వివాదం అవుతోందో ఆత్మపరిశీలన చేసుకోకుండా ఎవరినో నిందించి పబ్బం గడుపుకోవాలనుకుంటే ఇలాగే ఎదురుదెబ్బలు తగులుతాయి.


‘మేనేజ్‌’ ప్రచారం వెనుక..!

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు లిటిగేషన్లు లేవనెత్తుతూ, రాష్ట్రంలో సైంధవ రాజకీయం చేస్తున్నారని, ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి మోకాలడ్డుతున్నారని కూడా వైసీపీ నాయకులతో పాటు నీలి మీడియా సరికొత్త పల్లవి అందుకుంది. లిటిగేషన్లతో పాటు వ్యవస్థలనూ మేనేజ్‌ చేస్తున్నారనే ప్రచారానికీ శ్రీకారం చుట్టారు. న్యాయవ్యవస్థను చంద్రబాబునాయుడు మేనేజ్‌ చేస్తున్నారన్నది జగన్‌ అండ్‌ కో ప్రధాన ఆరోపణ. హైకోర్టులో జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నందున ఇలాంటి ఆరోపణలను నిజమేనని ప్రజలు నమ్మే ప్రమాదం లేకపోలేదు. జగన్‌ అండ్‌ కో కోరుకుంటున్నది కూడా ఇదే! అందుకే హేతుబద్ధత లేకపోయినా ఇటువంటి ఆరోపణలను పదే పదే చేస్తున్నారు. న్యాయ వ్యవస్థను నిజంగా మేనేజ్‌ చేయవచ్చా? మెరిట్‌తో సంబంధం లేకుండా న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వగలవా? చరిత్ర చూస్తే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని అర్థమవుతుంది. కేసుల విచారణ సత్వరం జరగకుండా కిందిస్థాయిలో మేనేజ్‌ చేయడం గురించి విన్నాం, చూస్తున్నాం. కానీ, తీర్పుల విషయంలో అలా సాధ్యం కాదు. జగన్‌ తనపై నమోదైన అవినీతి కేసులలో సత్వర విచారణ జరగకుండా చట్టంలో ఉన్న వెసులుబాట్లను ఉపయోగించుకున్నట్టుగానే ఇతరులు కూడా చేసి ఉండవచ్చు. మెరిట్‌తో సంబంధం లేకుండా తీర్పులు వెలువడినా వాటిని సమీక్షించడానికి పై కోర్టులు ఉన్నాయని తెలుసుకోవాలి. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట జగన్‌ ప్రభుత్వం ప్రారంభించిన మూడు ముక్కలాటకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకుంది. ఈ అప్పీల్‌ విచారణకు వచ్చినప్పుడు రెండు బెంచ్‌లు విచారణ నుంచి తప్పుకొన్నాయి. దీంతో చంద్రబాబు అండ్‌ కో ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అనే ట్రిక్‌ ప్రయోగించారని ప్రచారం చేశారు. ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అన్న ట్రిక్కు వల్ల తీర్పులను తారుమారు చేయవచ్చా? అంటే అసాధ్యమనే చెప్పవచ్చు! జగన్‌ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ తొలుత సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే ముందు విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వ అప్పీలును కొట్టివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. ఆ దశలో ఒక న్యాయవాది కల్పించుకొని ఈ కేసులో రైతుల తరఫున ప్రధాన న్యాయమూర్తి కుమార్తె హైకోర్టులో వాదించిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో సంప్రదాయాలను అనుసరించి కేసు విచారణ నుంచి ప్రధాన న్యాయమూర్తి తప్పుకొన్నారు. ఒకవేళ ఆయనే విచారించినా ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టేసి ఉండేవారు. జస్టిస్‌ నారిమన్‌ నేతృత్వంలోని మరో బెంచ్‌ ముందుకు ఈ అప్పీల్‌ విచారణకు వచ్చినప్పుడు ఇలాంటి సాంకేతిక ఇబ్బంది ఎదురైంది. రైతుల తరఫున సీనియర్‌ నారిమన్‌ వాదిస్తున్నందున ఆయన కుమారుడైన న్యాయమూర్తి జస్టిస్‌ నారిమన్‌ తప్పుకొన్నారు. రాజధాని విషయంలో సీనియర్‌ నారిమన్‌ రెండు నెలల క్రితమే అధికారికంగా తన అభిప్రాయాన్ని రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. దీన్నిబట్టి న్యాయమూర్తి జస్టిస్‌ నారిమన్‌ బెంచ్‌ ముందు విచారణకు రాకుండా అప్పటికప్పుడు చేసిన ఏర్పాటు కాదని స్పష్టమవుతోంది కదా! చివరికి మూడో బెంచ్‌ ముందుకు రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ విచారణకు రావడం, దాన్ని కొట్టివేయడం చూశాం.


ఎంత పెద్దవారలైతేనేమి..?

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. జగన్‌ రెడ్డి సర్కారు అహంకారపూరిత వైఖరి వల్ల అందుబాటులో ఉన్న అవకాశాలను కూడా కాలదన్నుకుంటోంది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ బెంచ్‌ ఈ అప్పీలును విచా రించిన మరుసటిరోజే హైకోర్టులో కేసు విచారణకు వస్తుంది. అటువంటప్పుడు, హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని చెప్పి ఉం డొచ్చు. కానీ అలా చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టులో ఇప్పుడు తలుపులు మూసుకుపోయాయి. పిటిషన్‌ను ఉపసంహరించుకొని ఉంటే తర్వాత పరిస్థితిని బట్టి అప్పీలు చేసుకొనే వెసులుబాటు ఉండేది. అయినా కేసులో పస లేనప్పుడు ఏ బెంచ్‌ అయినా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటుంది. ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసిన బెంచ్‌లో తెలుగువాడైన జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి ఉన్నారు. అయినా తీర్పులో మార్పు రాలేదు కదా! దీన్నిబట్టి కేసులో బలం లేనప్పుడు ఏ ట్రిక్కు కూడా పనిచేయదు. బలం ఉన్నప్పుడు ఎన్ని ట్రిక్కులు ప్రయోగించినా తీర్పులు ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. అయినా ఏదో కుట్ర జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పలు అప్పీళ్లను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఒక్క కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వెలువడలేదంటే ప్రభుత్వ చర్యలు, నిర్ణయాల్లోనే లోపం ఉందని స్పష్టం కావడం లేదా? ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. కోట్లాది రూపాయలను ఫీజుల కింద చెల్లించి మోతుబరి న్యాయవాదులను నియమించుకున్నంత మాత్రాన తీర్పులు తారుమారు అవుతాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎన్నికల్లో డబ్బులు పంచి ప్రజా తీర్పును మార్చుకోవచ్చునని భావించడం ఎంత అవివేకమో ఇది కూడా అంతే! ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడి ఓటర్లకు డబ్బులు పంచుతాయి. అయినా, అన్ని పార్టీల నుంచి డబ్బు తీసుకునే ఓటర్లు ఎవరికి పట్టం కట్టాలని అనుకుంటారో వారికే పట్టం కడతారు. న్యాయస్థానాల్లో కూడా పేరొందిన న్యాయవాదులను నియమించుకున్నంత మాత్రాన తీర్పులు మారిపోవు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వేను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియమించుకుంది. అయినా రాజధానుల వ్యవహారంలో హైకోర్టు విధించిన స్టేటస్‌ కో నుంచి ఉపశమనం లభించలేదు. ఈ కేసులోనే కాదు, మిగతా కేసులలో కూడా ముకుల్‌ రోహత్గి వంటి ఎంతో మంది పేరొందిన న్యాయవాదులను కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి జగన్‌ ప్రభుత్వం నియమించుకుంది. అయినా ఒక్కటంటే ఒక్క కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాలేదు. అంతెందుకు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్‌ ఇప్పించడానికి ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా కింది కోర్టులో సైతం వాదించారు. అయినా బెయిల్‌ లభించలేదు. చివరకు 70 రోజుల తర్వాత హైకోర్టులో శుక్రవారం బెయిల్‌ లభించింది. దీన్నిబట్టి అర్థం చేసుకోవలసింది ఒక్కటే! ఎంత పేరొందిన న్యాయవాది అయినా ప్రతివాదుల వాదనలోని లోపాలను ఎత్తిచూపడానికి మాత్రమే ఉపయోగపడతారు తప్ప న్యాయస్థానాల తీర్పులను తారుమారు చేయడానికి కాదు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తనపై ఉన్న అవినీతి కేసులలో వాదించడానికి ఎంతో మంది బడా న్యాయవాదులను నియమించుకున్నారు. అయినా ఒక్క కేసులో కూడా ఆయనకు విముక్తి లభించలేదు. కాకపోతే, చట్టంలోని లోపాలను, వెసులుబాట్లను ఉపయోగించి విచారణను జాప్యం చేయగలిగారు.


కపట విన్యాసాలు!

ఈ వాస్తవాలన్నింటినీ విస్మరించి ప్రతిపక్షాలను, న్యాయస్థానాలనూ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నాలను జగన్‌ సర్కార్‌ ముమ్మరం చేసింది. సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 26 వరకు ఉంది. ఇందులో దాదాపు పది మంది న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను వివిధ సందర్భాలలో విచారించారు. అయినా అన్ని కేసులలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బలే తగిలాయి. దీన్నిబట్టే తప్పు అంతా జగన్‌ ప్రభుత్వంలోనే ఉందని అర్థం కావడం లేదా? తెలంగాణలో పాతబడిన సచివాలయాన్ని కూల్చివేసి, అక్కడే కొత్త భవనం కట్టాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అయినా ఇందుకు హైకోర్టులో క్లియరెన్స్‌ లభించడానికి దాదాపు ఏడాది పట్టింది. అలాంటిది గత ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించి వివిధ నిర్మాణాల కోసం పది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసిన తర్వాత ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం ‘‘అమరావతి మాకు వద్దు, విశాఖకు పోతాం’’ అంటే హైకోర్టులో కేసులు దాఖలు కాకుండా ఎందుకుంటాయి? అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, చేసిన ఖర్చుకు బాధ్యత తీసుకోకుండా ‘‘మాకు ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. వెళ్లిపోతాం’’ అంటే కుదురుతుందా? అలా అయితే న్యాయస్థానాలు ఎందుకు? రాష్ట్రపతి నోటిఫికేషన్‌ ద్వారా అమరావతిలో ఏర్పాటైన హైకోర్టును.. అధికారం ఉంది కదా అని కర్నూలుకు తరలించే విధంగా చట్టం చేస్తే చెల్లుబాటు అవుతుందా? న్యాయపరమైన, విధానపరమైన, నైతికపరమైన వివాదాలు ఎన్నో ఇమిడి ఉన్న అభివృద్ధి వికేంద్రీకరణ చట్టానికి వెంటనే ఆమోద ముద్ర వేయడానికి హైకోర్టు ఏమీ గవర్నర్‌ కార్యాలయం కాదు. ప్రజలు అమాయకులు, ఏమి చెప్పినా నమ్ముతారు అన్న భావనతో అన్ని ప్రాంతాల అభివృద్ధి అన్న నినాదం ఎత్తుకున్న జగన్‌ సర్కార్‌ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒకప్పుడు ఇదే జగన్‌ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదన్న ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా స్వాగతిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరంగా విశాఖపట్టణం అభివృద్ధి చెందింది. ఎవరి ప్రమేయం లేకుండానే అభివృద్ధి చెందే వనరులు, అవకాశాలు ఉన్న విశాఖకు ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం చేసే అభివృద్ధి ఏమిటో వారే చెప్పాలి! వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామంటూనే అభివృద్ధి చెందిన విశాఖలో కార్యనిర్వాహక రాజధాని పెట్టాలని అనుకోవడంలో కపటత్వం కనిపించడం లేదా? నిజంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకుంటే ప్రకాశం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలు లేవా? రాయలసీమ ఏమి పాపం చేసింది? రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతిని ఎందుకు వద్దనుకుంటున్నారో సరైన కారణం చెప్పకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి అంటూ ప్రజలను వంచించే ప్రయత్నం చేయడం పాలకులకు తగదు. నాలుగు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే అభివృద్ధి జరుగుతుందా? హైదరాబాద్‌ వంటి మహా నగరంలోనే లేక్‌ వ్యూ వంటి అతిథిగృహం ఐదు ఎకరాలలో ఉండగా విశాఖలో 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించాలనుకోవడం ఏమిటి? హైదరాబాద్‌ సమీపంలో దాదాపు 20 వేల ఎకరాల్లో ఫార్మా సిటీ నెలకొల్పే పనులను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అభివృద్ధి అంటే అటువంటి ఆలోచనలు చేయాలి గానీ, ప్యాలెస్‌లను తలపించే ఇళ్లు నిర్మించుకోవడం, ఏకంగా 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించుకోవడం కాదు. హైదరాబాద్‌లో ప్రైవేట్‌ పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్‌ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. జగన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటింది. ఇంతవరకు అటువంటి ఆలోచన ఒక్కటైనా చేశారా? నిజమైన అభివృద్ధి కోసం ప్రణాళికలు రచించకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఎవరినో నిందించి ప్రయోజనం ఏమిటి? జగన్‌ సర్కార్‌ తీరు సొంత మీడియా, తోడుగా నీలి బ్యాచ్‌ ఉందన్న ధీమాతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నాలు చేయవచ్చు గానీ ప్రజలు నిలకడ మీద అయినా నిజాలు తెలుసుకుంటారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందకపోవడానికి ఎవరో కారణం కాదు, జగన్‌ రెడ్డి మాత్రమే కారకుడు. మూడు రాజధానులనే మూడు ముక్కలాట కూడా అదే తీరు. జగన్‌ పుణ్యమా అని విశాఖలో కూడా అభివృద్ధి కుంటుపడింది. రాజధాని వస్తుందా? రాదా? అన్న ఆశ నిరాశల మధ్య అక్కడి ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. న్యాయపరమైన వివాదాలన్నీ పరిష్కారమై రాజధాని ఏది? ఎక్కడ? అనేది తేలడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు. అంతవరకు ‘ఆత్మస్తుతి పరనింద’ విన్యాసం కొనసాగుతుందని భావించవచ్చు. అందుకే జైపాల్‌ రెడ్డి అన్నట్టు ఉద్దేశాలూ, లక్ష్యాలూ కాదు, వాటిని చేరుకోవడానికి ఎంచుకొనే మార్గం కూడా ముఖ్యం. కపట విన్యాసాలకు ఎపుడో ఒకప్పుడు కాలం చెల్లుతుంది!



యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-08-30T05:55:30+05:30 IST