Advertisement
Advertisement
Abn logo
Advertisement

Etela విజయంతో ఈ నియోజకవర్గం షేక్‌.. ఆ ఎమ్మెల్యే రాజీనామాపై గోల.. సవాల్ స్వీకరించి ఉంటే సీన్ ఎలాగుండేదో..!?

అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నారు వెనకటికి పెద్దలు.. కానీ ఇప్పటి రాజకీయ నాయకులు ప్రతినిత్యం ఇలాంటి పనులే చేస్తూ హైలెట్‌ అవుతున్నారు. ప్రత్యర్థులు గెలిస్తే తల కోసుకుంటానని మెడకోసుకుంటానని తన పదవికి రాజీనామా చేస్తానంటూ ఎవేవో అతివిశ్వాస శపథాలకు పాల్పడుతారు. చివరికి ప్రత్యర్థి గెలిస్తే అబ్బే నేనన్నది తప్పుగా అర్థం చేసుకున్నారని తన సవాల్‌కు ఎదుటిపక్షం జవాబివ్వకపోవడంతో అక్కడితోనే కథ ముగిసిందని ముక్తాయింపు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి మ్యాటర్‌ హీట్‌ పెంచుతుండటంతో పాలమూరు జిల్లాలోని ఓ ప్రజా ప్రతినిది ఇరకాటంలో పడ్డారు. ఎవరా నేత..? ఏంటా శపథం..? అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.

ఈటల విజయంతో అచ్చంపేట షేక్‌!

హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలుపొందినప్పటి నుంచి సోషల్‌ మీడియా పూర్తిగా పాలమూరులోని అచ్చంపేటపై దృష్టి సారించింది..ఇక తదుపరి ఉప ఎన్నిక అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గానికేనంటూ తెగ ప్రచారం సాగింది..హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన గువ్వల.. ఈటల గెలిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛానెల్స్ ముందు ప్రకటించారు. బీజేపీకి తెలంగాణలో డిపాజిట్ కూడా రాదని, ఒకవేళ కాంగ్రెస్‌తో కలిస్తే.. డిపాజిట్ రావొచ్చని జోస్యం చెప్పారు.

ఈటలకు రౌండ్‌రౌండ్‌కు ఆధిక్యం

ఈటెల రాజేందర్‌ గెలుపొందటంతో గువ్వల బాలరాజు కంగుతినకతప్పలేదు. రాజేందర్‌కు ప్రతి రౌండ్‌లోనూ మెజారిటీ పెరుగుతూనే ఉండటంతో నెటిజన్లు తమ సటైర్లకు పనిచెప్పారు. గువ్వల బాలరాజు తానిచ్చిన రాజీనామా మాట మీద నిలబడుతారని.. అచ్చంపేటకు ఉపఎన్నికల వస్తుందని ఎమ్మెల్యే మాటల క్లిప్పింగ్స్‌పై  సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.

గువ్వల రాజీనామా చేస్తే..!

డీసీసీ అధ్యక్షులు వంశీకృష్ణ మరో అడుగు ముందుకువేసి ఒకవేళ గువ్వల రాజీనామా చేస్తే..తాను పోటీకూడా చేయనని.. అచ్చంపేట అభివృద్ది కోసం తాను ఎన్నికలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు. హుజూరాబాద్‌ గెలుపుతో ఆకాశపుటంచున విహరిస్తున్న భారతీయ జనతాపార్టీ నాయకులు అచ్చంపేట.. కొల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు..తాను ప్రకటించిన విధంగా గువ్వల బాలరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..ఇలా సోషల్‌ మీడియాలో గువ్వల ఎపిసోడ్‌ను నెటిజన్లు, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు రసవత్తరంగా నడిపించారు.

రాజీనామా కోసం గువ్వలకు ఫోన్లమీద ఫోన్లు..! 

ఇక చాలామంది యువకులు.. నేరుగా గువ్వలకు ఫోన్‌చేసి అన్నా.. ఎపుడు రాజీనామా చేస్తున్నావంటూ అడగడం.. గువ్వల విసుక్కోవడం అవి సోషల్ మీడియాలో వైరల్‌ అవడం, ట్రోల్స్‌ చేయడం చకచకా జరిగిపోతున్నాయి. ఇక లాభం లేదనుకుని బయటకువచ్చిన గువ్వల బాలరాజు రాజీనామాపై తూచ్‌ మన్నాడు.. తాను మొదలు చెప్పిన మాటలకు.. శపథాలకు ఎలాంటి పొంతన లేకుండా ప్లేట్‌ ఫిరాయించాడు.. తాను చేసిన సవాల్‌ను ఎవ్వరూ స్వీకరించలేదని.. అలాంటపుడు తానెలా రాజీనామా చేస్తానంటూ ప్రకటించి అసలు సిసలు పొలిటీషియన్‌ అనిపించుకున్నారు. ఈటల నిజాయతీగా గెలిస్తే తాను రాజీనామా చేసేవాడినని, దౌర్జన్యంతో ఆయన గెలిస్తే తానెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు.

రాజీనామా చేసేవరకు విడిచిపెట్టమంటున్న బీజేపీ..

బీజేపీ నేతలు ఎంత ఒత్తిడి తెచ్చినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ప్రస్తకే లేదని బాలరాజు స్పష్టం చేశారు. అయితే బీజేపీ కార్యక్తరలు మాత్రం ఆయన రాజీనామా చేసేవరకు వదిలిపెట్టేది లేదని దశలవారీగా ఆందోళనలకు సిద్దపడుతున్నారు..అచ్చంపేటలో చాలా బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా గువ్వలను నిలదీసేందుకు రెడీ అవుతున్నారు. మరి అచ్చంపేటలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో..ఎలాంటి ఘర్షణలకు వేదికగా మారుతుందో చూడాలి.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement