Sep 13 2015 @ 10:48AM

సంగీత దర్శకుడి శ్రీ జయంతి

ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టినా... తనదైన శైలిలో బాణీలు సమకూర్చారు శ్రీ . చిన్నవయసులోనే తనువు చాలించిన శ్రీ... పది కాలాలపాటు నిలచి ఉండే పాటలకు బాణీలు కట్టారు... రేపు ఆయన జయంతి సందర్భంగా ఓసారి ఆ పాటల పందిరిలోకి అడుగుపెడదాం.
సినీ సంగీత ప్రపంచంలో చక్రవర్తి కొన్ని దశాబ్దాలపాటు స్వర చక్రవర్తిగానే రాణించారు. అయితే... ఆయన చిన్న కొడుకు శ్రీనివాస చక్రవర్తి మాత్రం తండ్రి కి భిన్నంగా కెరీర్ సాగించారు. 'బాబాయ్ అబ్బాయ్' చిత్రంలో వెండితెరపై ఇలా తళుక్కున మెరిసి అలామాయమైన శ్రీ... ఆ తర్వాత ఓ ప్రముఖ ఛానెల్ లో మ్యూజిక్ బేస్డ్ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 'పోలీస్ బ్రదర్స్'తో సంగీత దర్శకుడిగా పరిచయం అయిన శ్రీ... ఆ తర్వాత కూడా ఆచితూచి సినిమాలు చేశారు. 'మనీ, మనీ మనీ, లిటిల్ సోల్జర్స్, సిందూరం' తో పాటు నాగార్జున నటించిన 'ఆవిడా మా ఆవిడే' చిత్రానికీ స్వర రచన చేశారు.
శ్రీ చక్కని సంగీత దర్శకుడే కాదు... మంచి గాయకుడు కూడా. ప్రభాస్ నటించిన 'చక్రం' చిత్రం కోసం చక్రి స్వరపరిచిన 'జగమంత కుటుంబం నాది' పాటను గానం చేసింది శ్రీ నే. అవకాశాలు కోసం అర్రులు చాచకుండా... తనను కోరిన వచ్చిన దర్శక నిర్మాతలకే శ్రీ స్వరాలు అందించారు. అందువల్ల శ్రీ పని చేసిన చిత్రాలు సంఖ్యాపరంగా తక్కువే అయినా... వాటికి జీవితకాలం ఎక్కువ. శారీరకమైన అనారోగ్యానికి గురైన తర్వాత కూడా 'సాహసం', 'ఆడు మగాడ్రా బుజ్జి' చిత్రాలకు శ్రీ మ్యూజిక్ అందించారు. 'అమృతం.. చందమామలో' శ్రీ సంగీతం అందించిన చివరి సినిమా. ఈ యేడాది ఏప్రిల్ 18న శ్రీ తరలిరాని లోకాలకు వెళ్ళిపోయారు. సంగీత పరంగా తండ్రి చక్రవర్తి నీడ తనపై పడకుండా జాగ్రత్త పడిన శ్రీ ది తెలుగు సినీ సంగీత చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం!