Feb 24 2018 @ 01:49AM

నేటి సినిమాలో శృంగారం తక్కువ.. అంగారం ఎక్కువ

  •  హింస, అశ్లీలత, బూతు...ఇదేనా భావితరాలకు అందించేది?
  •  ‘బి.నాగిరెడ్డి’ స్మారక తపాలాబిళ్ల ఆవిష్కరణలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
చెన్నై, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): హింస, అశ్లీలత, బూతును విడిచిపెట్టి భారతీయతను, మన సంప్రదాయాలను భావితరాలకు అందించేలా మంచి సందేశాత్మక సినిమాలు తీయాలని సినీ దర్శక, నిర్మాతలకు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. దివంగత తెలుగు సినీ దిగ్గజం, విజయా వాహినీ స్టూడియోస్‌ అధినేత, విజయ హెల్త్‌ సెంటర్‌ స్థాపకులు బొమ్మిరెడ్డి నాగిరెడ్డి సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తపాలా బిళ్లను ఆయన గురువారం చెన్నైలో ఆవిష్కరించారు. నాగిరెడ్డి వర్ధంతి (ఫిబ్రవరి 25) పురస్కరించుకుని విజయా హెల్త్‌ సెంటర్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ, నాగిరెడ్డి తనయుడు బి.వెంకట్రామరెడ్డి, సీఈఓ భారతిరెడ్డిల నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌, తమిళనాడు ఉన్నతవిద్యాశాఖ మంత్రి కేపీ అన్బళగన్‌ గౌరవ అతిథులుగా, సీనియర్‌ తమిళ నిర్మాత ఏవీఎం శరవణన్‌, తపాలాశాఖ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.సంపత్‌ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా ‘నాగిరెడ్డి - ద లెజండ్‌’ అనే పుస్తకాన్ని గవర్నర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ‘‘నాగిరెడ్డి సినీ నిర్మాత, విజన్‌ ఉన్న వ్యక్తి మాత్రమే కాదు ఆయన గొప్ప మానవతావాది. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నాగిరెడ్డి దిగ్గజ స్థాయికి ఎదిగారు. ఆ రోజుల్లోనే పేదలకు సేవ చేయాలని ఆసుపత్రి ప్రారంభించడం చాలా గొప్ప విషయం. ఆయన సినిమాల్లో గొప్ప సందేశం ఉంటుంది. ఆమోదయోగ్యమైన సన్నివేశాలతో శృంగారాన్ని ప్రేక్షకుల మనసులో కల్పించేవారు. కానీ, ఇప్పుడు సినిమాల్లో శృంగారం తక్కువ, అంగారం ఎక్కువ. ఇది దురదృష్టకరం. హింస, అశ్లీలం, బూతు.. ఇదేనా భావితరాలకు మనం అందించేది’’ అని ప్రశ్నించారు. అలాగే దేశంలో ఏ ప్రాంతంలో నివసించినా ప్రజలు తమ మాతృభాషలో చదువుకునేందుకు ఆయా రాష్ట్రాలు వీలు కల్పించాలని, అప్పుడే జాతిసామరస్యం వెల్లివిరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ‘మహానటి’ సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, సీనియర్‌ నటుడు, రచయిత రావికొండలరావు, విజయా ఆసుపత్రి పూర్వ జనరల్‌ మేనేజర్‌ రాంబాబు, సీనియర్‌ తమిళ సినీ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్‌, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.