చింతకాయ చేపల పులుసు

ABN , First Publish Date - 2018-01-27T23:34:26+05:30 IST

చేపలు - అరకిలో (మకెరల్‌. ఒక టేబుల్‌స్పూను కారం, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఒక గంట నానబెట్టాలి...

చింతకాయ చేపల పులుసు

కావలసినవి
 
చేపలు - అరకిలో (మకెరల్‌. ఒక టేబుల్‌స్పూను కారం, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఒక గంట నానబెట్టాలి), పచ్చి చింతకాయలు(పెద్దవి) - పది (కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తర్వాత వాటి మీదున్న పొట్టు తీసి, గుజ్జు పిండి రసం తీయాలి. అందులో చిటికెడు ఉప్పు, కారం, ధనియాలపొడి వేయాలి. ఉల్లిగడ్డలు- రెండు (సన్నగా తరిగి), పచ్చిమిర్చి- ఆరు (నిలువుగా కోసి), ఆవాలు - అర టీస్పూను, జీలకర్ర- ఒక టీస్పూను, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు (కచ్చాపచ్చాగా చేసి), మెంతులు- పావు టీస్పూను, ఎండు మిర్చి- రెండు, కరివేపాకులు - కొన్ని, పసుపు-చిటికెడు, కారం- ఒక టీస్పూను, ధనియాలపొడి-రెండు టీస్పూన్లు, ఉప్పు-సరిపడా, నూనె-మూడు టీస్పూన్లు.
 
డ్రై పౌడర్‌కి: ధనియాలు- ఒక టీస్పూను, మెంతులు- అర టీస్పూను. నూనె లేకుండా వీటిని వేగించి చల్లారాక మెత్తటి పొడిలా గ్రైండ్‌ చేయాలి.
పేస్టుకు: పచ్చిమిర్చి- ఒకటి, ఆవాలు- అర టీస్పూను. ఈ రెండింటినీ కలిపి మెత్తటి పేస్టు చేయాలి.
 
తయారీవిధానం
లోతైన పాన్‌లో టీస్పూను నూనె వేసి చేపలను మూడు నిమిషాలు వేగించాలి.
వెడల్పాటి పాన్‌లో కొంచెం నూనె వేసి ఆవాలు వేసి, అవి చిటపటమంటున్నప్పుడు జీలకర్ర, మెంతులు, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి అర నిమిషం వేగించాలి. ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయముక్కలు బంగారురంగులోకి వచ్చే వరకు వేగించాలి. అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కాసేపు వేగించాలి. తరువాత చేపలు వేసి కలిపి మూడు నిమిషాలు ఉడికించాలి. తర్వాత చింతకాయ రసం, కొన్ని నీళ్లు పోసి గ్రేవీ వచ్చేవరకూ పులుసును ఉడికించాలి. ఇందులో ఆవాలు, పచ్చిమిర్చి పేస్టు, ధనియాలు, మెంతుల పొడి కలిపి కాసేపు ఉడికించాలి. కొత్తిమీర చల్లి.. వేడి అన్నం లేదా రాగి సంకటితో తింటే యమ్మీగా ఉంటుంది.

Updated Date - 2018-01-27T23:34:26+05:30 IST