పిస్తా పాన్‌

ABN , First Publish Date - 2018-08-25T20:40:19+05:30 IST

పిస్తా- ఒక కప్పు, పాలపొడి - పావుకప్పు, మక్కపిండి - ఒక టీస్పూను, చక్కెర పొడి - ఒక టేబుల్‌స్పూను...

పిస్తా పాన్‌

కావలసినవి
 
పిస్తా- ఒక కప్పు, పాలపొడి - పావుకప్పు, మక్కపిండి - ఒక టీస్పూను, చక్కెర పొడి - ఒక టేబుల్‌స్పూను, ఎడిబుల్‌ గ్రీన్‌కలర్‌ - ఐదు చుక్కలు, చిక్కటిపాలు - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - పావు టీస్పూను. ఫిల్లింగ్‌కు: పిస్తాపప్పు, బాదంపప్పు, వాల్‌నట్స్‌ - ఒక్కొక్కటీ రెండు టేబుల్‌స్పూన్లు చొప్పున (చిన్నముక్కలుగా చేయాలి), కెవ్రా ఎసెన్స్‌ - ఐదు చుక్కలు, యాలకులపొడి - పావు టీస్పూను, కుంకుమపువ్వు - చిటికెడు.
 
తయారీవిధానం
 
చిన్న పాన్‌ తీసుకుని అందులో పిస్తా (పెంకుతోసహా) వేసి సన్నని మంటపై వేగించాలి. ఇలా చేయడం వల్ల పిస్తాపప్పు మాడదు. పప్పు సరిగ్గా వేగుతుంది. చల్లారిన పిస్తా పప్పును మిక్సీలో వేసి మెత్తటి పొడిలా చేయాలి. పలుకులు లేకుండా జల్లించాలి.
ఇందులో చక్కెర పొడి, పాలపొడి, యాలకుపొడి, మక్కపిండి వేసి బాగా కలపాలి. దీనికి ఎడిబుల్‌ గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ను కూడా జోడించాలి. దాంతోపాటు ఒక టేబుల్‌స్పూను చిక్కటిపాలను కూడా అందులో వేసి చేత్తో కలపాలి. ఇది పిండిలా తయారవుతుంది. దాంట్లో మరో టేబుల్‌స్పూను చిక్కటి పాలను కలిపి పిండిముద్దలా చేయాలి. డ్రైఫ్రూట్స్‌ను సన్నగా ముక్కలుగా చేసి రెడీ పెట్టుకోవాలి. చిన్న పాన్‌ తీసుకుని అందులో వెన్న లేదా నెయ్యి ఒక టీస్పూను వేసి సన్నని మంటపై వేడిచేయాలి. ఒకటిన్నర టేబుల్‌స్పూను చిక్కటిపాలు అందులో పోసి బాగా కలపాలి. రెడీగా పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌ ముక్కలు, యాలకులపొడి, కేవ్రా ఎసెన్స్‌ కూడా అందులో వేసి ఒక నిమిషం పాటు కలిపి స్టవ్‌ నుంచి దించాలి. తర్వాత ప్లాస్టిక్‌ పేపరు మధ్యలో పిండి ముద్ద పెట్టి చిన్న పరిమాణం ఉండేలా పిండిని ఒత్తాలి. దాన్ని పన్నెండు చతురస్రాకారం ముక్కల్లా కోయాలి. ఒక్కొక్కముక్కను సెంటర్‌ పాయింట్‌కు తెచ్చి అన్నివైపులను ఒక చోటకు చేర్చాలి. అంటే కిళ్లీ కట్టినట్టు దాన్ని ప్రెస్‌ చేసి కోన్‌ ఆకారం చేయాలి. మీరు ఎన్ని పిస్తా పాన్‌లు చేస్తారో అందుకు తగ్గట్టుగా ఫిల్లింగ్‌ను విభజించుకోవాలి. ఆ మిశ్రమాన్ని చెంచా సహాయంతో బర్ఫీకోన్లలో నింపి దానిపై సిల్వర్‌ ఫాయిల్‌, పిస్తా పప్పులు వేసి గార్నిష్‌ చేస్తే పిస్తా పాన్‌ మిఠాయి రెడీ.

Updated Date - 2018-08-25T20:40:19+05:30 IST