Abn logo
Apr 8 2020 @ 04:37AM

ఇసుక పందేరం!

లాక్‌డౌన్‌లో అధికార పార్టీ నేతల అనధికారిక తవ్వకాలు

30 టన్నుల ఇసుక లారీ రూ.40వేలు

జిల్లావ్యాప్తంగా రోజుకు 500 లారీలు తరలింపు

ప్రభుత్వ ఖజానాకు కోట్లలో సున్నం

రొయ్యూరు రీచ్‌లో ఎమ్మెల్యే కనుసన్నల్లో దందా

నిమ్మకు నీరెత్తినట్లు ఏపీఎండీసీ అధికారులు


(విజయవాడ, ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా భవన నిర్మాణ పనులను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పనులు జరగనప్పుడు ఇసుకతో అవసరం ఏముంటుంది? కానీ జిల్లాలోని ఇసుక రీచ్‌ల నుంచి మాత్రం యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. ఇలా రోజుకు సుమారు 500 లారీల్లో ఇసుక తరలిపోతోంది. 30 టన్నుల ఇసుక బ్లాక్‌మార్కెట్‌లో అక్షరాలా రూ.40వేలు పలుకుతోంది. అంటే ప్రభుత్వ ఖజానాకు రోజుకి సుమారు రూ.2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఈ దందా మొత్తం అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నడుస్తుండటం గమనార్హం. 


కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ ప్రకటించారు. నలుగురైదుగురు ఒకచోట గుమికూడ వద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగా భవన నిర్మాణ పనులనూ నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికశాతం భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. నిర్మాణ కార్మికులు పనుల్లేక అల్లాడుతున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు లాక్‌డౌన్‌ సమయంలోనూ కాసుల దందాకు తెరదీశారు. ఇసుక రీచ్‌లను తమకు ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. రీచ్‌ల నుంచి ఎడాపెడా ఇసుక తవ్వేస్తూ అనధికారికంగా తరలించేస్తున్నారు. భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న యజమానులు ఎలాగోలా పనులు ముగించేందుకు ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. దీంతో బ్లాక్‌ మార్కెట్‌లో 30 టన్నుల ఇసుక లారీ రూ.40వేలు పలుకుతోంది. మరోవైపు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అధికార పార్టీ నేతలకు సంబంధించిన స్థలాల్లో భారీగా నిల్వ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అధికారికంగా ఇసుక బుకింగ్‌లను నిలిపివేశారు. కానీ అనధికారికంగా అధికార పార్టీ నేతలు మాత్రం అడ్డుఅదుపు లేకుండా ఇసుకను దోచేస్తున్నారు. తమ కళ్లెదుటే అక్రమంగా ఇసుక తరలిపోతున్నా ఏపీఎండీసీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. 


ఇలా దోచేస్తున్నారు.. 

తోట్లవల్లూరు మండలం రొయ్యూరు రీచ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక లారీలను అడ్డుకుని ప్రశ్నిస్తే అధికారికంగానే ఇసుకను తరలిస్తున్నామని ఎమ్మెల్యే అనుచరులు బుకాయిస్తున్నారు. వారికి ఏపీఎండీసీ అధికారులు వంత పాడుతున్నారు.

 

లంకపల్లి రీచ్‌లోనూ అనధికారికంగా తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి తరలించే ఇసుకను నందిగామ, జగ్గయ్యపేట సమీపంలో భారీగా నిల్వ చేస్తున్నట్లు సమాచారం. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలించి సొమ్ము చేసుకునేందుకు పక్కా ప్లాన్‌ సిద్ధం చేశారు. 


శనగపాడు, గని ఆత్కూరు, కన్నెవీడు రీచ్‌ల్లోనూ అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా తరలుతున్న ఇసుక విషయంలో స్థానికులు లారీల డ్రైవర్లను అడ్డుకుంటుండటంతో పలు చోట్ల ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దొనబండ, గని ఆత్కూరు తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.   


Advertisement
Advertisement
Advertisement