‘అగ్రిటెక్‌’ కోర్సులు.. ఎంపీసీతో అవకాశాలు అపారం..

ABN , First Publish Date - 2021-09-13T17:54:55+05:30 IST

మన దేశంలో ఇప్పటికీ మెజారిటీ ప్రజల జీవనాధారం వ్యవసాయం. తమ రెక్కల కష్టాన్నే రైతులు నమ్ముకుంటారు. అయితే, వారికి మరింత ఊతం అందించే క్రమంలో ఆధునిక పరికరాలు, శాస్త్ర సాంకేతికత జోడింపు జరుగుతూనే ఉంది. అలా రూపుదిద్దుకున్న కోర్సులే అగ్రికల్చరల్‌ ఇంజనీరిం

‘అగ్రిటెక్‌’ కోర్సులు.. ఎంపీసీతో అవకాశాలు అపారం..

మన దేశంలో ఇప్పటికీ మెజారిటీ ప్రజల జీవనాధారం వ్యవసాయం. తమ రెక్కల కష్టాన్నే రైతులు నమ్ముకుంటారు. అయితే, వారికి మరింత ఊతం అందించే క్రమంలో ఆధునిక పరికరాలు, శాస్త్ర సాంకేతికత జోడింపు  జరుగుతూనే ఉంది. అలా రూపుదిద్దుకున్న కోర్సులే అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఆ కోర్సుల వివరాలు సంక్షిప్తంగా....


ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ 

ఆహారోత్పత్తులను నిల్వ చేసి అన్ని కాలాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ప్రాసెసింగ్‌ చేసే సాంకేతికతను అందించేందుకు ఉద్దేశించిన కోర్సు బీటెక్‌ ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. ఉదాహరణకు పెద్ద మొత్తంలో లభ్యమయ్యే పాలను అదే రోజు ఉపయోగించలేం. అదనపు ఉత్పత్తులు అంటే పాలపొడి, స్వీట్స్‌ రూపంలోకి మార్చి మరింత సమర్థంగా వినియోగించుకోవాలి. అలా చేసినప్పుడే అదనంగా ఉన్న పాలు దుర్వినియోగం కావు. అదే సమయంలో వాటి ఉత్పత్తిదారులకూ అదనపు ఆదాయం లభిస్తుంది. అయితే అలా జరగాలంటే సాంకేతిక నైపుణ్యం జతకావాలి. అలాంటివే ఈకోర్సులో కీలకంగా ఉంటాయి. ఈ కోర్సు చేసిన వారికి  ఆహార సంబంధ పరిశ్రమల్లో మంచి అవకాశాలు ఉంటాయని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.    


ఈ కోర్సులో ముఖ్యంగా ఫుడ్‌ టెక్నాలజీ, ఫుడ్‌ప్రాసెసింగ్‌ ఇంజనీరింగ్‌, ఫుడ్‌సేఫ్టి అండ్‌ క్వాలిటి అస్యూరెన్స్‌, ఫుడ్‌ ఇండస్ర్టీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ బోధిస్తారు. బేసిక్స్‌గా ఫుడ్‌ కెమిస్ర్టీ, బేసిక్‌ ఇంజనీరింగ్‌, బేసిక్‌ సైన్సెస్‌, ఫుడ్‌ప్లాంట్‌ ఆపరేషన్స్‌ తదితర సబ్జెక్ట్‌లు ఉంటాయి. పండించిన ప్రతి పంటను నిల్వ చేయాలి. పండ్లు, కూరగాయలతోపాటు ఇతర ఆహారోత్పత్తులను అవసరమైనప్పుడు వాడుకునే విధంగా నిల్వ చేయటాన్ని ప్రధానంగా బోధిస్తారు. సీజనల్‌ఫ్రూట్స్‌ - అన్ని కాలాల్లో అందుబాటులోకి వచ్చేవిధంగా నిల్వ చేయడంతోపాటు ఆహారోత్పత్తులను తయారు చేయటంపై బోధన, పరిశోధన ద్వారా శిక్షణ ఇస్తారు. చదువుతోపాటు ఇతర రాష్ర్టాలోని ఆహార పరిశ్రమలను సందర్శించి అనుభవం సంపాదించటం, ఈఎల్‌పి ప్రోగ్రామ్‌ ద్వారా గ్రామాలకు వెళ్ళి ఆహార విలువలను తెలియజేయటం వంటి అనుభవ అభ్యాసన కూడా ఉంటుంది. ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రతి సబ్జెక్ట్‌కు ప్రాక్టికల్స్‌ కూడా ఉంటాయి. నాలుగు సంవత్సరాల ఈ కోర్సులో మూడు సంవత్సరాలు బోధన, పరిశోధన ఉంటుంది. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ఇందులో ప్రధానంగా దక్షిణాది రాష్ర్టాలకు ఇండస్ట్రియల్‌ టూర్‌ ఉంటుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో బాపట్లలోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాలతోపాటు పులివెందులలో మరొకటి ఉంది. బాపట్లలో 60 సీట్లు, పులివెందులలో 50 సీట్లు ఉన్నాయి. ఇవికాక అదనంగా ఐసిఏఆర్‌ ద్వారా 15 శాతం సీట్లు  కేటాయిస్తారు. ఈబ్ల్యూసీ అభ్యర్థులకు మరో 10 శాతం సీట్లు ఉంటాయి. వీటిని ఎంసెట్‌ ఆధారంగా కేటాయిస్తారు. ఇందులో 60శాతం సీట్లు కన్వీనర్‌ కోటా, 40శాతం సీట్లు రైతుకోటాలో భర్తీ చేస్తారు. 


తెలంగాణలో సీట్లు

తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్‌ జిల్లా రుద్రూరులో కాలేజీ ఆఫ్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఉంది. ఈ కాలేజీలో 45 సీట్లు ఉన్నాయి. వీటిలో 60 శాతం సీట్లను టీఎస్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. మిగిలిన 40 శాతం సీట్లను ఫార్మర్స్‌ కోటా కింద టీఎస్‌ ఎంసెట్‌ ర్యాంక్‌ ఆధారంగానే ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ నింపుతుంది. 


ఉన్నతచదువులు

ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (బీటెక్‌) పూర్తి చేసిన విద్యార్థులు ఎంటెక్‌ చేయవచ్చు. అదేవిధంగా ఎంబిఎ(ఫుడ్‌ ఇండస్ర్టీ మేనేజ్‌మెంట్‌) కోర్సును కూడా చేయవచ్చు  అయితే ఈ కోర్సు ప్రైవేటు కాలేజీలకు తోడు జెఎన్‌టియు కాకినాడ కళాశాలలో ఉన్నాయి. ఎంటెక్‌ తరవాత పీహెచ్‌డీ చేసుకోవచ్చు. 


ఉద్యోగ అవకాశాలు

ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజి విద్యనభ్యసించిన వారు ఎక్కువగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పొందుతారు. ఆహార పరిశ్రమలు - డెయిరీలు, చాక్లెట్‌ కంపెనీలు, బిస్కట్‌ కంపెనీలు, క్రూల్‌డ్రింక్స్‌ ఇండస్ర్టీలతోపాటు ఎంపెడా, ఎపెడాలలో కూడా ఉద్యోగవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫ్రొఫెసర్లు, ఫుడ్‌టెక్నికల్‌ ఆడిటర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌లు, ఫుడ్‌క్వాలిటి ల్యాబ్‌లలో  కూడా అవకాశాలు ఉంటాయి.



అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ 

వ్యవసాయాన్ని ఆధునీకరించే చర్యల్లో భాగంగా సాంకేతిక సహకారం అందించేందుకు, ప్రధానంగా అందుకు అవసరమైన శిక్షణ పొందిన మానవ వనరుల కోసం 1983లో అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ కోర్సును అందుబాటులోకి తెచ్చారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా బాపట్లలో డాక్టర్‌ ఎన్టీఆర్‌ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాలను స్థాపించారు. తదుపరి మడకసిరలో కూడా కళాశాల ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కందిలోనూ వ్యవసాయ ఇంజనీరింగ్‌ కళాశాల ఉంది. 


వ్యవసాయ రంగంలో ఉపయోగించే అన్నిరకాల యంత్ర పరికరాలు, నీటి యాజమాన్యానికి సంబంధించిన సబ్జెక్టులను వ్యవసాయ ఇంజనీరింగ్‌లో బోధిస్తారు. ముఖ్యంగా ఫామ్‌ మిషనరీ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజి, వాల్యూ ఎడిషన్‌, సాయిల్‌ అండ్‌ వాటర్‌ ఇంజనీరింగ్‌కు సంబంధించిన సకల అంశాలు ఉంటాయి. దుక్కి దున్నడం అంటే పొలాన్ని విత్తనాలు వేసేందుకు అనువుగా మార్చడంతో మొదలుపెట్టి పండిన పంటను నిల్వ చేసే వరకు అన్నిరకాల యంత్రపరికరాల వినియోగంపై ప్రయోగాత్మక బోధన ఉంటుంది. అగ్రికల్చరల్‌ స్ట్రక్చర్‌, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజి ఇంజనీరింగ్‌ సబ్జెక్టులపై కూడా బోధన ఉంటుంది. ఇందులో ఏడు సెమిస్టర్లు బోధన, ఒక సెమిస్టర్‌ మొత్తం ఇంటర్న్‌షిప్‌ ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో సీట్లు

వ్యవసాయ ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్ల, మడకసిరలో కళాశాలలు ఉన్నాయి. ఈరెండు కళాశాలల్లో 120 సీట్లు ఉన్నాయి. వాటిలో బాపట్ల కళాశాలలో 70 సీట్లు, మడకసిర కళాశాలలో 50 సీట్లు ఉన్నాయి. ఇందులో ఫార్మర్స్‌ కోట 40 శాతం సీట్లు, కన్వీనర్‌ కోటలో 60 శాతం సీట్లు కేటాయిస్తారు. ఐసిఏఆర్‌ ద్వారా 15 శాతం సీట్లు కేటాయిస్తారు. పాలిటెక్నిక్‌ అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ చదివిన వారికి 15 శాతం సీట్లు అదనంగా ఉంటాయి. వీరు అగ్రిసెట్‌ ఎగ్జామ్‌ రాసి నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశిస్తారు. 


తెలంగాణలో సీట్లు

సంగారెడ్డి జిల్లా కందిలో అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ఉంది. 58(కెసాసిటీ 59) సీట్లను నింపుతారు. అయితే ఇందులో 45 సీట్లలో 60 శాతం తెలంగాణ ఎంసెట్‌లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన 40 శాతాన్ని ఫార్మర్స్‌ కోటా కింద ప్రత్యేకించారు. 15 శాతం ఐసీఏఆర్‌ కోటా ఉంది. ఎంసెట్‌ కన్వీనర్‌ కోటా కింద వెళ్ళే సీట్లను మినహాయిస్తే మిగిలిన సీట్లు అంటే  ఫార్మర్స్‌ కోటా కింద 16, ఎన్‌ఆర్‌ఐ - నాన్‌ ఫార్మర్స్‌కోటా కింద 10 సీట్లను అలాగే  డిప్లొమా కోటా కింద 7 సీట్లను  ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ భర్తీ చేస్తుంది. తెలంగాణలో కౌన్సెలింగ్‌ ఆరంభమైంది.


ఉన్నత విద్యావకాశాలు 

వ్యవసాయ ఇంజనీరింగ్‌ నాలుగు సంవత్సరాల బీటెక్‌ కోర్సు పూర్తి చేసినవారు ఎంటెక్‌ (అగ్రికల్చర్‌), ఎంసిఎ, ఎంబిఎ, ఇండస్ట్రియల్‌ ఇంజనీరింగ్‌, ఇండస్ట్రియల్‌ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మాస్టర్‌ ఆఫ్‌ రీజనల్‌ ప్లానింగ్‌, అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజి కోర్సులతోపాటు ఇతర దేశాలలో ఎమ్మెస్‌ చేయవచ్చు. దేశంలోని ఐఐటి ఖరగ్‌పూర్‌, అలహాబాద్‌ అగ్రికల్చర్‌ ఇన్‌స్టిట్యూట్‌తోపాటు 25 విశ్వవిద్యాలయాలు పీజీ కోర్సులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. తదుపరి పీహెచ్‌డీ కూడా చేయవచ్చు.  ఎంటెక్‌ బాపట్ల కళాశాలలో మాత్రమే ఉంది. అందులో ఫామ్‌మిషన్‌ అండ్‌ పవర్‌ ఇంజనీరింగ్‌, ప్రాసెస్‌ అండ్‌ ఫుడ్‌ ఇంజనీరింగ్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. పీహెచ్‌డీలో కూడా అవే కోర్సులు ఉన్నాయి. ఇన్‌సర్వీ్‌సలో ఉన్నవారికి పీహెచ్‌డీలో అదనంగా మూడుసీట్లు ఉన్నాయి. 


ఉపాధి అవకాశాలు

అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో ప్రస్తుతం ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నది. అయితే వీరిలో ఎక్కువమంది ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాలు పొందుతున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్‌ ఇండస్ర్టీ, ఐఎ్‌ఫఎస్‌, బ్యాంకింగ్‌ రంగాల్లో చేరుతున్నారు.కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ, సాంప్రదాయేతర ఇంధనవనరుల అభివృద్ధిశాఖ, జాతీయ జలవనరులశాఖ, ఐసిఏఆర్‌, సిఎ్‌సఐఆర్‌, మైక్రో ఇరిగేషన్‌ కంపెనీలు, వాటర్‌ సెక్టార్‌లో కన్సల్టెంట్‌ కంపెనీలు ఉద్యోగవకాశాలు కల్పిస్తున్నాయి. 


కూలీల కొరతకు విరుగుడు

వ్యవసాయ ఇంజనీరింగ్‌ విద్యభ్యసించిన విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు ఇండస్ర్టీలలో రాణిస్తున్నారు. ట్రాక్టర్‌, ఇతర వ్యవసాయ యంత్రపరికరాల తయారీ కంపెనీలలో ఉద్యోగాలు పొందుతున్నారు. దీనికితోడు ఇండియన్‌ ఫారె్‌స్ట సర్వీ్‌సలో కూడా రాణిస్తున్నారు. పెరుగుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు వ్యవసాయ యంత్ర పరికరాల అవసరం నానాటికి పెరుగుతోంది. కొందరు విద్యార్థులు నూతన యంత్రపరికరాలను రూపొందించి కొన్ని కంపెనీలతో ఒప్పందం కూడా కుదర్చుకుంటున్నారు. 



డెయిరీ టెక్నాలజీ

వ్యవసాయ అనుబంధ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉంది. వాటిలో డెయిరీ టెక్నాలజీ ఒకటి. ఈ కోర్సులో చేరిన వారు మూడు సంవత్సరాల పాటు డెయిరీ కెమిస్ట్రీ,  డెయిరీ మైక్రో బయాలజీ, డెయిరీ ఇంజనీరింగ్‌,  డెయిరీ బిజినెస్‌ మేనెజ్‌మెంట్‌ తదితర కోర్సులను చదవాల్సి ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సంరక్షించుకోవడం, సంబంధిత బిజినెస్‌ వంటి విషయాలను నేర్చుకుంటారు. నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌లో 105 రోజులు ఇన్‌ప్లాంట్‌ ట్రైనింగ్‌ పేరుతో హెరిటేజ్‌, దొడ్ల, విజయ డెయిరీ లాంటి కంపెనీలలో ప్రాక్టికల్‌ శిక్షణ ఇప్పిస్తారు. సెకండ్‌ సెమిస్టర్‌లో హ్యాండ్స్‌ ఆన్‌ ట్రైనింగ్‌ అండ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ లెర్నింగ్‌ (హెచ్‌టీఈఎల్‌) కోర్సు ఉంటుంది. అంటే పాల ద్వారా తయారు చేసే ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి శిక్షణ విద్యార్థులకు ఉంటుంది. పాల ఉత్పత్తులను తయారు చేయడం, వాటికి మార్కెటింగ్‌, పాల నుంచి స్వీట్స్‌, లస్సీ తదితర విషయాలను నేర్చుకుంటారు. అంతేకాకుండా వారు తయారు చేసిన పాల ఉత్పత్తులను వారే విక్రయిస్తారు. బీటెక్‌  డెయిరీ టెక్నాలజీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంటెక్‌  డెయిరీ టెక్నాలజీ లేదా పుడ్‌ టెక్నాలజీ కోర్సులను చేయవచ్చు. అయితే ఆ కోర్సులు మన రాష్ట్రంలో లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవచ్చు. 


ఉద్యోగావకాశాలు

పాల ఉత్పత్తులకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఉన్న పరిశ్రమల్లో ఈ కోర్సు చేసిన వారికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో పేరొందిన హెరిటేజ్‌, దొడ్ల, విజయ డెయిరీ సహా పలు ప్రైవేటు  డెయిరీల్లో ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్‌ ఉంటుంది. 


తెలంగాణలో సీట్లు

పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం ఈ కోర్సును అందిస్తోంది. ఇంటర్‌ ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు  తెలంగాణ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మెరిట్‌ ప్రకారం నాలుగు సంవత్సరాల బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ కోర్సులో చేరవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో మాత్రమే ఈ కళాశాల ఉంది. ఇక్కడ ఏటా 35 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. కామారెడ్డిలోని కళాశాల అందిస్తున్న ఈ కోర్సులో 25 సీట్లు నేరుగా భర్తీ చేస్తా రు. ఫార్మర్స్‌ కోటా కింద అయిదు, ఐసీఏఆర్‌ నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఎంపికైనా వారికి మరో అయిదు కలిపి మొత్తం 35 సీట్లు ఈ కళాశాలలో ఉంటాయి.


ఏపీలో సీట్లు

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ క్యాంప్‌సలో మాత్రమే ఈ కోర్సును ఆఫర్‌ చేస్తున్నారు. 33 సీట్లు ఉన్నాయి. వీటిలో 28 సీట్లను ఏపీఈఏపీ సెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. 4 సీట్లు ఐసీఏఆర్‌ కోటీ కింద నింపుతారు. 


ఇది కూడా చదవండి

బీటెక్ పూర్తి చేసిన వారికి ఫారిన్‌లో అవకాశాలు ఎలా ఉంటాయి?

Updated Date - 2021-09-13T17:54:55+05:30 IST