కొన్ని శుష్క దినాల గురించి

ABN , First Publish Date - 2021-06-21T05:59:23+05:30 IST

ఎత్తుకుని పెంచిన పిల్లలు మనల్ని వదిలి ఎక్కడికో వెళిపోతున్నట్టు అనిపిస్తోంది ఇపుడు ఒక్కొక్క రోజు గడుస్తుంటే...

కొన్ని శుష్క దినాల గురించి

ఎత్తుకుని పెంచిన పిల్లలు

మనల్ని వదిలి 

ఎక్కడికో వెళిపోతున్నట్టు

అనిపిస్తోంది

ఇపుడు ఒక్కొక్క రోజు గడుస్తుంటే.


కాలం అంతా వ్యర్థంగా

జీవితమంతా ఏమీ చేయకుండానే

గడిచిపోయినట్టు అనిపిస్తోంది


గుర్తుకొస్తున్నాయి

కొన్ని వేసవి రోజులు

అలా శుష్కంగా

ఆకాశంలోకి చూస్తూ కూడా

వేగంగా గడిచిపోయిన రోజులు


ఏమీ చేయలేనితనం

అందరూ గెలిచినట్టు

నేను మటుకు ఓడిపోయినట్టు


నాకు రాని పదవుల గురించో

చదువుల గురించో

నాన్న బెంగపడటం 

ఎలా వస్తుందిరా అంత నిద్ర

అంటూ వాపోవడం.


నిస్సహాయతలో కూడా

ఏదో సుఖం అపుడు.


గుర్తుండిపోయేవి ఏమీ 

జరగని ఆ రోజులు

గుర్తుకొస్తున్నాయి


ఏమీ సాధించలేకపోయినా

ఆ రోజులు చాలా 

బాగున్నాయనిపిస్తోంది.


ఏమీ గెలవకపోయినా

ఆశలు కలలు

నిండా ఇంకా మిగిలివున్న రోజులు అవి.

2

ఇపుడు రోజులు 

కమిలిన చెట్లలా

నేలలోకి, 

ఇసక రేణువుల్లోకి

శిథిలం అయిపోతున్నట్టుగా-  

ఆకెళ్ళ రవిప్రకాష్‌

949051 7777


Updated Date - 2021-06-21T05:59:23+05:30 IST