తుపాకీ సామ్రాజ్యంతో.. డాన్‌గా ఎదగాలని

ABN , First Publish Date - 2020-07-11T07:09:51+05:30 IST

వికాస్‌ దూబే.. తనను అరెస్టు చేసేందుకు వచ్చిన 8 మంది పోలీసులను పాశవికంగా కాల్చి చంపిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌.. అతడి పేరు చెబితేనే కాన్పూర్‌ పరిసరాల్లో హడల్‌.. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దూబే, 20 ఏళ్లలో డాన్‌గా, రియల్‌

తుపాకీ సామ్రాజ్యంతో.. డాన్‌గా ఎదగాలని

  • అంచెలంచెలుగా వికాస్‌ దూబే సామ్రాజ్య విస్తరణ

వికాస్‌ దూబే.. తనను అరెస్టు చేసేందుకు వచ్చిన 8 మంది పోలీసులను పాశవికంగా కాల్చి చంపిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌.. అతడి పేరు చెబితేనే కాన్పూర్‌ పరిసరాల్లో హడల్‌.. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన దూబే, 20 ఏళ్లలో డాన్‌గా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిగా, జిల్లా రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌గా ఎదిగాడు. వికాస్‌ భార్య రిచా దూబే ప్రస్తుతం సమాజ్‌ వాదీ పార్టీ తరఫున ఘిమావ్‌ పంచాయతీ ప్రజాప్రతినిధి కావడం గమనార్హం.


హత్యకేసుతో నేరాల వైపు..

వికాస్‌ దూబే 1999లో బిక్రూ గ్రామంలో ఝున్నా బాబా అనే వ్యక్తితో కలిసి నేర ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఆస్తి తగాదా విషయంలో ఝున్నాను దారుణంగా హతమార్చాడు. 2000 సంవత్సరంలో.. అంటే 30 ఏళ్ల వయసులో ఇంటర్‌ చదివాడు. ఆ సమయంలో రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ సిద్ధేశ్వర్‌ పాండేను హత్య చేశాడు. ఈ కేసులో కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని అనుభవించాడు. జైలులో ఉండగానే.. శివరాజ్‌పూర్‌ నుంచి జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాడు. 2001లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే సంతోష్‌ శుక్లాను శివ్లీ పోలీ్‌సస్టేషన్‌లో కాల్చి చంపాడు. ఆరునెలల తర్వాత అతడు పోలీసులకు లొంగిపోయినా.. పోలీ్‌సస్టేషన్‌లో జరిగిన ఆ హత్యకు సాక్ష్యాధారాలు లేకుండా చేశాడు. ఫలితంగా కేసు వీగిపోయి, విడుదలయ్యాడు. అప్పటి నుంచి కాన్పూర్‌ పరిసర ప్రాంతాల్లో అతడి పేరు చెబితే హడలిపోయేలా పరిస్థితులను ఏర్పాటు చేసుకున్నాడు. 2002లో రూ.20 వేల విషయంలో జరిగిన గొడవలో దినేశ్‌ దూబే అనే కేబుల్‌ ఆపరేటర్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. 2004లో జైలులో ఉన్న సమయంలోనే.. రామ్‌బాబూ యాదవ్‌ అనే వ్యక్తి హత్యకు కుట్రపన్నాడు. బయట ఉన్న తన అనుచరగణంతో అతడిని చంపించాడు. 2013లో కూడా అతనిపై హత్యకేసు నమోదు కాగా.. 2018లో తన సమీప బంధువు అనురాగ్‌ను తన గ్యాంగ్‌తో చంపించాడు. ఆ సమయంలోనూ దూబే జైలులోనే ఉన్నాడు.


మారణాయుధాల రవాణా

ఉత్తరప్రదేశ్‌ సహరణపూర్‌లో అతనిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద, మారణాయుధాల చట్టం కింద కేసులున్నాయి. తుపాకులు, ఇతర మారణాయుధాలను సరఫరా చేయడమే అతడికి ప్రధాన ఆదాయ వనరు అని పోలీసులు తెలిపారు. అతనిపై కాన్పూర్‌, దేహత్‌, లఖ్‌నవూ, సహరణపూర్‌ పోలీస్‌ స్టేషన్లలో 62 కేసులు నమోదవ్వగా.. రెండింటిలో మాత్రమే నిర్దోషిగా తేలాడు. అతడు తన సోదరుడు దీపూ దూబేతో కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడని పోలీసులు గుర్తించారు. తద్వారా సంపాదించే మొత్తాన్ని రాజకీయాల్లో ఎదిగేందుకు వెచ్చించేవాడని సమాచారం.


రాజకీయాల్లో..

అఖిలేశ్‌ యాదవ్‌ సీఎంగా ఉన్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో, మాయావతి హయాంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీలో ఓ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2017లో బీజేపీలో చేరాడు. ఆ తర్వాత మళ్లీ సమాజ్‌వాదీ తీర్థం పుచ్చుకొన్నాడని అతడి తల్లి సరళాదేవి చెబుతోంది. అయితే.. సమాజ్‌ వాదీ పార్టీ దీన్ని ఖండిస్తోంది. రాజకీయ పార్టీల్లో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని, పోలీసు శాఖలో పరిచయాలు పెంచుకున్నాడు. స్థానిక పోలీసులను పోషిస్తూ.. తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఎంతలా అంటే.. డాన్‌గా ఎదగాలనే ఆంకాంక్షతో.. భూగర్భ గృహాల్లో ఉండేవాడు. జిల్లా రాజకీయాల్లో కింగ్‌ మేకర్‌లా మారాడు.

(సెంట్రల్‌ డెస్క్‌)

Updated Date - 2020-07-11T07:09:51+05:30 IST