అసంబద్ధ విభజన

ABN , First Publish Date - 2022-01-27T05:15:41+05:30 IST

రాయలసీమ ముఖద్వారంగా పేరెన్నికగన్న కర్నూలు జిల్లా రెండు భాగాలు కానుంది.

అసంబద్ధ విభజన

  1. కొత్త జిల్లాలపై జనంలో కలవరం
  2. అశాస్త్రీయంగా ప్రాంతాల కేటాయింపు
  3. నంద్యాల పక్కనున్న పాణ్యం.. కర్నూలుకు..
  4. కర్నూలు దగ్గరున్న నందికొట్కూరు నంద్యాలకు..
  5. డోన నియోజకవర్గ ప్రజలకు కర్నూలు అనుకూలం
  6. నంద్యాల జిల్లాలో కలపడం పట్ల తీవ్ర అభ్యంతరం
  7. ఆదోని జిల్లా కావాలని పశ్చిమవాసుల డిమాండ్‌ 


కొత్త నిర్ణయాలు సంబరాలు చేసుకునేలా ఉండాలి. కానీ గుబులు పుట్టిస్తున్నాయి. అసంతృప్తిని రాజేస్తున్నాయి. రాయలసీమ ముఖద్వారం.. కర్నూలు జిల్లా విభజన అశాస్త్రీయంగా జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడివారిని అక్కడ, అక్కడివారిని ఇక్కడ చేరుస్తూ అసౌకర్యం కలిగించడం ఏమిటని కొన్ని ప్రాంతాలవారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఉద్యమ తీవ్రత నుంచి దృష్టి మరల్చేందుకు హడావుడి నిర్ణయం తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.  పరిపాలనా సౌలభ్యం కోసం జరగాల్సిన విభజన ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉందని కొన్ని ప్రాంతాలవారు అంటున్నారు. 


కర్నూలు, ఆంధ్రజ్యోతి: రాయలసీమ ముఖద్వారంగా పేరెన్నికగన్న కర్నూలు జిల్లా రెండు భాగాలు కానుంది. పరిపాలనా సౌలభ్యం కోసం కర్నూలు, నంద్యాల జిల్లాలుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక గెజిట్‌ నోటిఫికేషనను బుధవారం విడుదల చేసింది. కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని మండలాలను రెండు జిల్లాలకు పంచుతారు.  కొత్త జిల్లాల ప్రతిపాదనలపై వివిధ వర్గాల సూచనలు, అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను కలెక్లర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టిన సమయంలో జిల్లాల విభజన గుర్తొచ్చిందా అని ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అధికార పార్టీ స్వలాభం కోసమే జిల్లాల విభజన అని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుత రెవెన్యూ డివిజన్లలోని పలు మండలాలను కొత్తగా ఏర్పడే డోన, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లలో కలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు నంద్యాల జిల్లాలో డోన, నందికొట్కూరు పట్టణాలను చేర్చడం పట్ల స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని పశ్చిమ ప్రాంతంవారు డిమాండ్‌ చేస్తున్నారు. కర్నూలు జిల్లాను మూడు జిల్లాలుగా ప్రకటించాలని రాజకీయ, మేధావి, పారిశ్రామిక వర్గాలు కూడా కోరుతున్నాయి. 

కర్నూలు జిల్లా

కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగల్‌, గూడూరు, కర్నూలు అర్బన, రూరల్‌, కోడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి మండలాలు ప్రస్తుతం కర్నూలు రెవెన్యూ డివిజన్లో ఉన్నాయి. వీటిని కర్నూలు జిల్లాలోనే కొనసాగిస్తారు. నంద్యాల రెవెన్యూ డివిజన్లోని పాణ్యం, గడివేముల మండలాలను కూడా కొత్తగా ఏర్పడే కర్నూలు జిల్లాలో కలుపుతారు. ఆదోని రెవెన్యూ డివిజన్లోని ఆదోని, మంత్రాలయం, పెదకడుబూరు, కోసిగి, కౌతాళం, ఆలూరు, దేవనకొండ, హోళగుంద, హాలహర్వి, ఆస్పరి, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల మండలాలను కొత్తగా ఏర్పడే కర్నూలు జిల్లాలో కలుపుతారు. 

నంద్యాల జిల్లా

నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఉన్న నంద్యాల, గోస్పాడు, శిరివెళ్ల, దొర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ మండలాలను నంద్యాల కేంద్రంగా ఏర్పడే నంద్యాల జిల్లాకు కేటాయిస్తున్నారు. కర్నూలు రెవెన్యూ డివిజన్లో ఉన్న డోన, బేతంచర్ల, ప్యాపిలి మండలాలతో కొత్తగా డోన రెవెన్యూ డివిజన ఏర్పాటు చేస్తారు. నంద్యాల రెవెన్యూ డివిజన్లోని బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలను కూడా డోన రెవెన్యూ డివిజన్లోనే కలుపుతారు. వీటన్నింటినీ నంద్యాల జిల్లాలో చేరుస్తారు. నంద్యాల డివిజన్లోని బండి ఆత్మకూరు, కర్నూలు డివిజన్లోని శ్రీశైలం, ఆత్మకూరు వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడ్తూరు మండలాలతో ఆత్మకూరు రెవెన్యూ డివిజన ఏర్పాటు చేస్తారు. వీటిని నంద్యాల జిల్లా పరిధిలోకి చేరుస్తారు. 

ఇట్ల చేస్తే ఇబ్బంది కదా..

ఫ పాణ్యం నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పడే కర్నూలు జిల్లాలో కలపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో నంద్యాల పట్టణానికి అతి చేరువలో ఉండే పాణ్యం, గడివేముల మండలాలను కూడా కర్నూలు జిల్లాలో కలుపుతున్నారు. దీనికి ఆ మండలాల ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమౌతోంది. నంద్యాలకు కేవలం 10 కి.మీ. దూరంలో ఉంటున్న తమ మండలాలను నంద్యాల జిల్లాలో చేర్చకుండా, దూరంగా ఉన్న కర్నూలు జిల్లాలో చేర్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల తమకు ఆర్థికంగా, వ్యవసాయ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. రెండు మండలాలను నంద్యాల జిల్లాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

-  నందికొట్కూరు పట్టణాన్ని నంద్యాల జిల్లాలో కలుపుతున్నారు. నందికొట్కూరు నుంచి నంద్యాలకు 57.7 కి.మీ. దూరం ఉంది. కానీ కర్నూలు నగరానికి కేవలం 25 కి.మీ. దూరం ఉంది. పైగా ఈ ప్రాంత ప్రజలకు కర్నూలుతోనే ఎక్కువగా సంబంధాలు ఉన్నాయి. తమ పట్టణాన్ని నంద్యాల జిల్లాలో కలపడం సమంజసం కాదని, కర్నూలు జిల్లాలోనే ఉంచాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

-  నంద్యాల రెవెన్యూ డివిజన్లో ఉన్న బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలను కొత్తగా ఏర్పడే డోన రెవెన్యూ డివిజన్లో కలుపుతున్నారు. నంద్యాల డివిజనలోని బండి ఆత్మకూరు, కర్నూలు డివిజనలోని శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడ్తూరు మండలాలతో ఆత్మకూరు రెవెన్యూ డివిజన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రెవెన్యూ శాఖలో దొర్లే తప్పుల కారణంగా తాము ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నామని, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడం లేదని రైతులు వాపోతున్నారు. అలాంటిది ఏకంగా జిల్లానే మారితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు. 

-  కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో ఉన్న డోన, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలను కొత్తగా ఏర్పడే డోన రెవెన్యూ డివిజనలో కలపాలన్న ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. దశాబ్దాలుగా డోన పట్టణానికి కర్నూలు నగరంతో బలమైన బంధం ఉంది. రవాణా మార్గాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. రాజకీయంగా డోన పట్టణం  ప్రతిష్టాత్మకమైనది. అలాంటి ప్రాంతాన్ని కర్నూలు జిల్లాకు కాకుండా, నంద్యాల జిల్లాలో చేర్చడం పట్ల స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. 

- డోన నియోజకవర్గానికి కర్నూలుతో ఎంతో అనుబంధం ఉంది. దీన్ని నంద్యాల జిల్లాలోకి చేర్చడం పట్ల ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమౌతోంది. డోన నుంచి కర్నూలుకి 50 కి.మీ. దూరం ఉంది. అదే నంద్యాలకు 75 కి.మీ. దూరం ఉంది. కొత్తగా ఏర్పడే జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే డోన ప్రజలకు ఇబ్బందులు తప్పవు. దూరం పెరగడంతోపాటు సరైన రవాణా మార్గం లేదు. ఖర్చు, సమయం పెరుగుతాయని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డోన నుంచి కర్నూలుకు బస్సు, రైలు సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ రెండింటిని జాతీయ రహదారి అనుసంధానం చేస్తోంది. గంటలోపు గమ్యాన్ని చేరుకునే వెసులుబాటు ఉంది. డోన నుంచి నంద్యాలకి బస్సు, రైలు ప్రయాణాలు అసౌకర్యంగా ఉంటాయి. ప్రయాణ సమయం దాదాపు 2 గంటలు పడుతుంది. రైతులు ఎక్కువ ఇబ్బంది పడతారు. 

జిల్లా స్వరూపం

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచే కర్నూలుకు ప్రత్యేక గుర్తింపు, చరిత్ర  ఉన్నాయి. 1,74,658 చ.కి.మీ. వైశాల్యం ఉన్న కర్నూలు జిల్లాలో 3.45 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయి. సుమారు 40 లక్షల జనాభా ఉంది. ఉత్తరాన గద్వాల జిల్లా, దక్షిణాన అనంతపురం, కడప జిల్లాలు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున ప్రకాశం జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. నల్లమలలో శ్రీశైలం, అహోబిలం, మహానంది క్షేత్రాలు ఉన్నాయి. ఎర్రమల కొండల్లో యాగంటి, మద్దిలేటి స్వామి క్షేత్రాలు ఉన్నాయి. 1970లో ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఆ సమయంలో కంభం, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాలను కర్నూలు జిల్లా నుంచి విడదీసి ప్రకాశం జిల్లాలో కలిపారు. బళ్లారిలో భాగంగా ఉన్న ఆదోని, ఆలూరు తాలూకాలను కర్నూలు జిల్లాలో కలిపారు. రాజకీయ, జల వనరుల రాజధానిగా కర్నూలు జిల్లాకు పేరుంది. 1953లో మదరాసు నుంచి విడిపోయాక కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. జిల్లా వాసులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదవులు పొందారు. శ్రీశైలం ప్రాజెక్టు జిల్లా కంఠహారంగా ఉంది. 15 పర్యాయాలు లోక్‌సభ, 13 పర్యాయాలు శాసన సభ ఎన్నికలు చూసిన కర్నూలు జిల్లా, త్వరలో రెండుగా విడిపోనుంది. 1985లో విభజించిన 54 మండలాలే ప్రస్తుత కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. 


ఆలోచన మంచిదే..

పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజించడం మంచిదే. జిల్లాలకు పేర్లు పెట్టే ముందు స్థానిక పరిస్థితులను, చరిత్రను పరిగణలోకి తీసుకోవాలి. కర్నూలు జిల్లాను కర్నూలు, నంద్యాలతోపాటు ఆదోని జిల్లాగా విభజిస్తే బావుంటుంది. జిల్లాల విభజన ఆలోచన ఈనాటిది కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చిలకం రామచంద్రారెడ్డి ఉన్నప్పుడే ప్రతిపాదించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను విభజించాలని బీజేపీనే మొదట ప్రతిపాదించింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్టీఆర్‌ నియోజకవర్గాలను మండలాలుగా విభజించారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్లన ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. 

 - కె.కపిలేశ్వరయ్య, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు 


పక్కదోవ పట్టించేందుకే..

సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చింది. జిల్లాల విభజనను బీజేపీ స్వాగతిస్తోంది. జిల్లాలను ఏర్పాటు చేయడం అంటే.. సౌకర్యాలు కల్పించడంతోపాటు ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. కానీ ఉన్న ఉద్యోగులకే నెలనెలా జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రెవెన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించడానికి ప్రభుత్వ ఖజానాలో సొమ్ము లేదు. నిధులు ఎక్కడి నుంచి తెస్తారు..? 

 - డాక్టర్‌ పార్థసారథి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి


నిధులు ఏవీ..?

రాజకీయ ప్రయోజనాలు ఆశించే నంద్యాల పక్కనే ఉన్న పాణ్యం, గడివేముల మండలాలను కర్నూలులో కలుపుతున్నారు. ఈ మండలాలను నంద్యాలలో కలిపితే  అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంటా ఉంటుంది. కొత్త జిల్లాలో పరిశ్రమలు, విద్యాలయాలు, మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇలాంటి సమయంలో జిల్లాల ఏర్పాటు వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. ఓర్వకల్లు విమానాశ్రయం కర్నూలు జిల్లాకే పరిమితం అవుతుంది. నంద్యాల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి సుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి.  

 - జె.లక్ష్మీనరసింహ యాదవ్‌, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు 


ఒరిగిందేమీ లేదు..

కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒరిగేది ఏమీ లేదు. ప్రజలపై భారం పడుతుంది. నంద్యాల అభివృద్ధి చెందినా, జిల్లా కేంద్రం స్థాయికి చేరాలంటే దశాబ్దాలు పడుతుంది. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందాలి. వీటికి ఎంతో సమయం పడుతుంది. ఓర్వకల్లు విమానాశ్రయం కర్నూలు జిల్లాకు వెళ్లిపోతుంది. కాబట్టి నంద్యాల జిల్లాకు ఎయిర్‌పోర్ట్‌ ఏర్పాటు చేయాలి. 

 - వంకిరి రామచంద్రుడు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి,

యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు 


నంద్యాల జిల్లాలో కలపాలి.. 

నంద్యాల జిల్లా ఏర్పాటును స్వాగతిస్తున్నాం. కానీ పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలోనే చేర్చాలి. పక్కనే ఉన్న నంద్యాలలో కలపకుండా 60 కి.మీ. దూరంలో ఉండే కర్నూలు జిల్లాలో కలపడం సరికాదు. ఈ అంశంపై అమరణ దీక్ష చేపట్టేందుకు కూడా వెనుకాడం. ఎక్కడో ఉన్న డోనను నంద్యాల జిల్లాలో చేర్చారు. 

- రాజు నాయుడు, ఏఐఎ్‌ఫబీ రాష్ట్ర కార్యదర్శి, నంద్యాల


గడివేముల, పాణ్యం నంద్యాలలో కలపాలి: 

పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల మండలాలను నంద్యాల జిల్లాలో కలపాలి. ఈ రెండు మండలాలు నంద్యాలకు దగ్గరలో ఉంటాయి. ఓర్వకల్లు, కల్లూరు మండలాలను కర్నూలు జిల్లాలో కలపడం మంచిది. 

- డి.గౌస్‌దేశాయ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి 


తలనొప్పులు చాలా ఉన్నాయి: 

జిల్లాల విభజనలో చాలా తలనొప్పులు ఉన్నాయి. రెవెన్యూ, రవాణా, నీటిపారుదల, సరిహద్దులు, స్థానికత వంటి అంశాలను లెక్కలోకి తీసుకోవాలి. ఇవేవీ గుర్తించకుండా జిల్లాను విభజించడం సరి కాదు. జిల్లాను కర్నూలు, నంద్యాల, ఆదోని జిల్లాలు చేస్తే శ్రీశైలం డ్యామ్‌ నంద్యాలకు వెళ్లిపోతుంది. నీటి సమస్యలు వస్తాయి. 

- సండేల్‌ చంద్రశేఖర్‌, సీనియర్‌ సిటిజన, కర్నూలు 


దీన్ని ప్రజలు కోరుకోవడం లేదు: 

జిల్లాల విభజనను ప్రజలు కోరుకోవడం లేదు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. పక్కనే తుంగభద్ర, హంద్రీ పోతున్నా ఇప్పటికే తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయి. ఆదోని మరింత వెనుకబాటుకు లోనవుతుంది. ఒక్క నంద్యాల జిల్లాకే సాగునీరు, రవాణా, పరిశ్రమలు, పర్యాటక క్షేత్రాలు వెళ్లిపోతాయి. 

- పత్తి ఓబులయ్య, రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌, కర్నూలు 


 రాష్ర్టానికి రాజధానే లేదు.. కొత్త జిల్లాలా?: 

ఇప్పటికే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. రాజధానిని మూడు ముక్కలు చేస్తామంటున్నారు. ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. వీరి సమస్యలను పక్కదారి పట్టించేందుకే ముఖ్యమంత్రి కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకువచ్చారు. ప్రజల్ని గందరగోళానికి గురి చేసి తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని సీఎం చూస్తున్నారు. 

- గౌరు వెంకటరెడ్డి, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు


దామోదరం, పెండేకంటి పేర్లు పెట్టాలి: 

కర్నూలు జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత దామోదరం సంజీవయ్య పేరును పెట్టాల్సిందే. అలాగే ఆర్యవైశ్య ప్రముఖుడు, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన పెండేకంటి వెంకట సుబ్బయ్య పేరును నంద్యాల జిల్లాకు పెట్టాల్సిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం అహోరాత్రులు వీరిద్దరు శ్రమించారు. వీరిని గుర్తించాలి. 

- సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు


ఆదోని జిల్లాగా ప్రకటించాలి: 

కొన్నేళ్లుగా ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నాం. కంటితుడువుగా ఆదోని ఏరియా అభివృద్ధి అథారిటీ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ఆదోనిని కూడా జిల్లాగా ప్రకటించాలి. విద్య, వైద్యం, ఉపాధి, అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాం. జిల్లా సాధన కోసం దశలవారీగా ఉద్యమానికి సన్నద్ధమవుతాం. 

- ఆదినారాయణరెడ్డి, పశ్చిమ ప్రాంత అభివృద్ధి వేదిక కన్వీనర్‌



 

Updated Date - 2022-01-27T05:15:41+05:30 IST