అబుదాబి టు లక్నో

భారతీయ జానపద కథ ‘విక్రమ్‌ ఔర్‌ భేతాళ్‌’ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌ వేదా’ తొలి షెడ్యూల్‌ అబుదాబిలో పూర్తయింది. 27 రోజుల పాటు జరిగిన షూటింగ్‌లో హృతిక్‌ రోషన్‌  పాల్గొన్నారు. లక్నోలో జరిగే రెండో షెడ్యూల్‌లో సైఫ్‌ అలీఖాన్‌ పాల్గొంటారు. హృతిక్‌, సైఫ్‌ అలీఖాన్‌, రాధికా ఆప్టే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ‘విక్రమ్‌ వేద’ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్‌, గాయత్రి ఈ సినిమాకు  కూడా  దర్శకత్వం వహిస్తుండడం విశేషం. టీ సిరీస్‌ ఛైర్మన్‌, ఈ చిత్రనిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ ఈ చిత్రం గురించి వివరిస్తూ ‘ఇద్దరు అసాధారణ వ్యక్తుల కథ ఇది. ఒకరు పోలీస్‌ ఆఫీసర్‌, మరొకరు గ్యాంగ్‌స్టర్‌. గ్యాంగ్‌స్టర్‌ను పట్టుకోవడానికి పోలీస్‌ ఆఫీసర్‌ చేసే ఆసక్తికరమైన ప్రయత్నమే ఈ  సినిమా. దాదాపు 20 ఏళ్ల తర్వాత హృతిక్‌, సైఫ్‌ కలసి నటిస్తున్నారు’ అని తెలిపారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30న చిత్రాన్ని విడుదల చేస్తామని మరో  నిర్మాత ఎస్‌.శశికాంత్‌ చెప్పారు.

Advertisement