కీలక సమాచారం ఉంది ఇస్తానంటే తీసుకోరేం!

ABN , First Publish Date - 2021-04-17T09:15:51+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సమాచారం తన వద్ద ఉందని రాష్ట్ర నిఘా విభాగం మాజీ

కీలక సమాచారం ఉంది ఇస్తానంటే తీసుకోరేం!

వివేకా హత్య కేసులో సీబీఐకి ఏబీవీ లేఖ

నా సమాచారాన్ని సీఐడీ, సిట్‌కు ఇచ్చా

వాడుకున్నారో లేదో తెలియదు

సీబీఐకి కూడా ఇస్తానన్నాను

మీ జేడీతో 2 సార్లు ఫోన్లో మాట్లాడా

హత్య జరిగినప్పుడు నేనే నిఘా చీఫ్‌

సమాచార సేకరణకు మా వాళ్లు వెళ్లారు

ఇంట్లోకి, మృతదేహం వద్దకు రానివ్వలేదు

స్వచ్ఛందంగా వివరాలిస్తానన్నా తీసుకోరా?

ఇప్పటికైనా ఆ సమాచారం తీసుకోండి

సంబంధిత అధికారులనూ ప్రశ్నించండి

 సీబీఐ డైరెక్టర్‌కు వెంకటేశ్వరరావు సూచన


అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సమాచారం తన వద్ద ఉందని రాష్ట్ర నిఘా విభాగం మాజీ అధిపతి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈ మేరకు సీబీఐ (తాత్కాలిక) డైరెక్టర్‌ ప్రవీణ్‌ సిన్హాకు ఆయన లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. ఉగాదికి ముందు రాసిన ఈ లేఖ తాజాగా వెలుగులోకి వచ్చింది. సమాచారం తీసుకోవాలని రెండుసార్లు తెలియజేసినా సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌, దర్యాప్తు బృందం నుంచి స్పందన లేదని.. ఇకనైనా తక్షణమే స్పందించాలని ఆయన అందులో పేర్కొన్నారు. తనతోపాటు రాష్ట్ర నిఘా విభాగం వద్ద ఉన్న సమాచారం, రికార్డులను తీసుకోవలసిందిగా వివేకా హత్య కేసును విచారిస్తున్న అధికారులను ఆదేశించాలని సీబీఐ డైరెక్టర్‌ను కోరారు.


ఈ కేసులో నాటి సంబంధిత అధికారులను కూడా ప్రశ్నించాలని సూచించారు. వివేకా హత్యోదంతం తర్వాత నిఘా చీఫ్‌గా తాను, తన బృందం ఇచ్చిన సమాచారాన్ని ఈ కేసును తొలుత విచారించిన సీఐడీ, సిట్‌ బృందాలు ఉపయోగించుకున్నాయో లేదోనని ఏబీవీ సందేహం వ్యక్తం చేయడం గమనార్హం. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కీలక సమాచారం ఇస్తామని సీబీఐ జేడీకి రెండుసార్లు తెలియజేసినా స్పందించలేదని నేరుగా సీబీఐ డైరెక్టర్‌ దృష్టికి ఆయన లిఖితపూర్వకంగా తీసుకొచ్చారు. తన తండ్రిని ఎవరు చంపారో తేల్చి.. చట్టపరంగా శిక్షించాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె వేడుకుంటున్న తరుణంలో రాష్ట్ర నిఘా మాజీ చీఫ్‌ కీలక సమాచారం తన వద్ద ఉందనడం కలకలం సృష్టిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లేఖలోని ముఖ్యాంశాలివీ..


మా హెడ్‌ కానిస్టేబుల్‌ వెళ్లారు..

2019 మార్చి 14-15 రాత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో తన సొంతింట్లో దారుణ హత్యకు గురైన విషయం మీకు తెలిసిందే. సంఘటన జరిగిన వెంటనే ఆయన గుండెపోటుతో మరణించారని, బాత్‌రూమ్‌లో కిందపడిపోయినప్పుడు ప్రమాదవశాత్తు ఇది జరిగి ఉంటుందని ఓ వర్గం మీడియా ప్రసారం చేసింది. కొందరు ఎంపీలు కూడా ఇదే ప్రకటించారు. కానీ ఆ రోజు మధ్యాహ్నం వివేకా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినప్పుడే ఆయన దారుణ హత్యకు గురయ్యారని నిర్ధారణ అయింది. అప్పటి దాకా నేరం జరిగిన ప్రాంతం, మృతదేహం పూర్తిగా కుటుంబ సభ్యుల నియంత్రణలోనే ఉన్నాయి. కేసును సీఐడీ, ఆ తర్వాత సిట్‌లు విచారించినా కొలిక్కి తీసుకురాలేదు.


ఈ సంఘటన వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు దర్యాప్తు అధికారులు సత్వరమే కేసును ఛేదించేందుకు ఉపకరించే సమాచారం సేకరణకు నిఘా విభాగం తన బలగాలను రంగంలోకి దించింది. స్థానిక డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ కన్నా ముందు ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, హోం గార్డు ఆ ఇంటికి చేరుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి గానీ, మృతదేహం ఉన్న చోటకు గానీ అనుమతించలేదు. ఆ సమయంలో ఎంపీ అవినాశ్‌రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నారు. 


సీబీఐ జేడీకి ఫోన్‌ చేసి మాట్లాడా.. 

వివేకా సతీమణి దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ ఆధారంగా హైకోర్టు ఈ కేసు విచారణను నిరుడు మార్చి 11న సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలుసుకుని, విచార ణాధికారిగా ఉన్న జాయింట్‌ డైరెక్టర్‌ ఎన్‌ఎమ్‌ సింగ్‌కు ఫోన్‌చేసి మాట్లాడాను. కేసును ఛేదించేందుకు నా వద్ద ఉన్న సమాచారం అందిస్తానని తెలియజేశాను. ఆయన అంగీకరించారు. కానీ ఆయన బృందం తగిన చొరవ తీసుకోలేదు. జూలై 22న మరోసారి సింగ్‌కు ఫోన్‌చేసి మాట్లాడాను. కానీ ఇప్పటివరకు నావద్ద ఉన్న సమాచారం తీసుకోలేదు. వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టి ఏడాది దాటిపోయింది.


హత్య జరిగిన సమయంలో నిఘా చీఫ్‌గా ఉన్న నేనే స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. కేసు విచారణకు ఉపయోగపడే కీలక సమాచారం ఇస్తానని చెప్పినా దర్యాప్తు బృందం చొరవ తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కాబట్టి మీరు జోక్యం చేసుకుని.. ఆ సమాచారం తీసుకునేలా మీ బృందాలను ఆదేశించాలని కోరుతున్నాను. అలాగే సంబంధిత అధికారులు, వ్యక్తులను కూడా  విచారించాలి.


వివేకా హత్య వార్త తెలియగానే.. సమాచార సేకరణకు నిఘా విభాగానికి చెందిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌, హోం గార్డు ఆ ఇంటికి చేరుకున్నారు. వారిని కుటుంబ సభ్యులు ఇంట్లోకి గానీ, మృతదేహం వద్దకు గానీ రానివ్వలేదు. 

మేం సేకరించిన సమాచారాన్ని కేసును విచారిస్తున్న విభాగానికి అందించాం. అయితే దానిని సీఐడీ, సిట్‌లు ఉపయోగించుకున్నాయో లేదో తెలియదు.  

 సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు

Updated Date - 2021-04-17T09:15:51+05:30 IST