అంకెల్లో అగాధాలు

ABN , First Publish Date - 2020-08-27T06:04:38+05:30 IST

కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకీ, వాస్తవ సంఖ్యలకూ మధ్య పెద్ద తేడాయే ఉందన్న అనుమానం కొత్తదేమీ కాదు. ప్రతిపక్షాలో, పత్రికలో అటువంటి ఆరోపణ చేసినప్పుడు ప్రభుత్వాలు...

అంకెల్లో అగాధాలు

కరోనా మరణాల విషయంలో అధికారిక లెక్కలకీ, వాస్తవ సంఖ్యలకూ మధ్య పెద్ద తేడాయే ఉందన్న అనుమానం కొత్తదేమీ కాదు. ప్రతిపక్షాలో, పత్రికలో అటువంటి ఆరోపణ చేసినప్పుడు ప్రభుత్వాలు అటువంటిదేమీ లేదని బుకాయిస్తున్నాయి. పైగా, ప్రశ్నించినందుకు ఉద్దేశాలను ఆపాదిస్తున్నాయి. శవరాజకీయాలు చేస్తున్నాయని నిందిస్తున్నాయి. కానీ, భారతదేశంలో ఇప్పటి లెక్కలు అనేక పరిమితులకు లోబడి రూపొందిస్తున్నవని, ఉద్దేశ్యపూర్వకంగా తగ్గించి చూపినందువల్లనే కాకుండా, సమాచారలోపంతో కూడా మరణాల సంఖ్య సత్యానికి ఎడంగా ఉంటుందని ప్రజారోగ్యశాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 


ప్రజారోగ్యం మీద పట్టింపు కలిగిన ఇద్దరు కమ్యూనిటీ వైద్యులు హేమంత్‌ షెవడే, గిరిధర గోపాల్‌ ఒక వెబ్‌ వేదిక ‘ది వైర్‌’లో కరణ్‌ థాపర్‌తో చేసిన విడియో చర్చలో తమ పరిశీలనలను ఇటీవల పంచుకున్నారు. అంతకు ముందు కూడా ఈ వైద్యులు ‘ది హిందూ’‌ ఆంగ్ల పత్రికలో వారి అధ్యయనం వివరాలను ప్రచురించారు. గత జూలై 31 నాటికి భారతదేశంలో ప్రతి పదిలక్షల మందికి 26 మరణాల చొప్పున 35,747 మరణాలు సంభవించాయని అధికారిక గణాంకాలు చెబుతుండగా, ఈ సంఖ్య ప్రతి పదిలక్షల మందికి 138 చొప్పున 1,88,939 ఉండవచ్చునని వారు చెబుతున్నారు. తమ అధ్యయన అనంతర కాలంలో, కరోనా వ్యాప్తి మరింత విస్తృతం అయిన తరువాత, అంటే, మహానగరాల నుంచి చిన్న పట్టణాలకు, గ్రామాలకు వ్యాపించిన ప్పుడు, అధికారిక, వాస్తవ గణాంకాల మధ్య తేడా మరింత పెరుగుతుందని వారు హెచ్చరించారు. 


భారతదేశంలోని గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలలో వైద్యవసతులు తక్కువ. వ్యాధి కారణాలను, మరణ కారణాలను నిర్ధారించగలిగే వైద్యనిపుణులు కూడా తక్కువ. అందువల్ల కొన్ని మరణాలు కొవిడ్‌–19 వల్ల సంభవించినా, వాటిని నిర్ధారించేవారు ఎవరూ ఉండరు. అట్లాగే, వైద్యసేవ కోసం ప్రయాణిస్తూ మార్గమధ్యంలోనే చనిపోయేవారు, నాన్‌–కోవిడ్‌ ఆస్పత్రులలో చనిపోయేవారు లెక్కలోకి రావడం లేదని ఆ నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకి చనిపోయినవారికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే, వారి మరణ కారణాలలో కొవిడ్‌–19ను ప్రస్తావించని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయని వారు చెబుతున్నారు. మరణాలను దాచడం సాధ్యం కాదని, మీడియా ఇంత క్రియాశీలంగా ఉన్న దేశంలో లెక్కల్లో తేడా ఉండే అవకాశం లేదని వినిపిస్తున్న వాదనల్లో పసలేదని ఆ ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వసతులలేమి కారణంగా వ్యాధిగ్రస్తుల సంఖ్య తక్కువగా నమోదు కావడం ఇతర జబ్బుల విషయంలో కూడా జరిగిందని, 2019లో క్షయవ్యాధి కారణంగా దేశంలో 80 వేల మంది మరణించారని మన లెక్కలు చెబుతుంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆ సంఖ్య 4,50,000 అని అంచనావేసింది. 


వైరస్‌ సోకిన వ్యక్తిని గుర్తించడం, వేరుచేయడం ద్వారా వ్యాప్తిని కట్టడి చేయాలన్న తొలినాటి ఆలోచన, రానురాను పలచబడిపోయి, ఇప్పుడు ఎటువంటి చర్యలు లేని స్థితి ఏర్పడింది. జరుగుతున్న పరీక్షలన్నీ ప్రభుత్వ లెక్కల్లోకి చేరుతున్నాయో లేదో, పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారందరూ తగిన చోట తగిన వైద్య సలహా లేదా చికిత్స పొందుతున్నారో లేదో తెలియదు. ఒకరినుంచి ఒకరికి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఎటువంటి పర్యవేక్షణా లేదు. కరోనాతో మరణించిన వారంతా లెక్కల్లోకి చేరుతున్నారో లేదో గ్యారంటీ లేదు. బాధ్యత అంతా వ్యక్తులకు, కుటుంబాలకు బదలాయింపు జరిగిపోయింది. నిర్దిష్ట ఆస్పత్రులు మినహాయించి సామాజిక రంగంలో వ్యాప్తినిరోధానికి ప్రభుత్వాలు చేసేది బాగా తగ్గిపోయింది. 


ఈ పరిస్థితులలో సరి అయిన గణాంకాలను ఆశించలేం. సరైన లెక్కలు లేకపోతే, పరిస్థితి తీవ్రత అర్థం కాదు. తీవ్రత తెలియకపోతే, అందుకు తగ్గ చర్యలు ఉండవు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వద్ద ఉన్న ఆర్థిక వనరులకు మించి చేయలేకపోతున్నాయి. కేంద్రాన్ని గట్టిగా విమర్శించే పరిస్థితి లేదు. లెక్కల్లోనే ఏదో కష్టపడితే, అందరి దృష్టిలో పడకుండా ఉంటాం– అనుకుంటున్నాయి. కానీ, దాచిన లెక్కలు ఎప్పుడో ముప్పు తీసుకువస్తాయి. మళ్లీ మళ్లీ కరోనా విజృంభిస్తున్న ఢిల్లీని చూసి జాగ్రత్త పడాలి. 


ఈ దశలో కూడా రాష్ట్రాలకు విడుదల చేయవలసిన పన్ను వాటా ఆదాయం ఇవ్వకుండా, డబ్బు పోగేసుకోవడం కేంద్రానికి మంచిది కాదు. బుధవారం నాడు సోనియా పూనిక మేరకు జరిగిన ప్రతిపక్ష ముఖ్యమంత్రుల సమావేశం ఆ ఆందోళననే వ్యక్తం చేసింది. పరిస్థితి చక్కబడకుండా, సంసిద్ధతకు మించి ఆర్థికరంగాన్ని పరుగు       తీయించాలన్న అత్యుత్సాహం కూడా మంచిది కాదు. నీట్‌, జెఇఇ పరీక్షల నిర్వహణ విషయంలో కూడా ఆరోగ్యదృష్టితో కేంద్రం వ్యవహరించడం లేదు. పరిస్థితి పెద్దగా మెరుగుపడలేదని, ఇంకా దాటవలసిన కష్టకాలం మిగిలే ఉందని గుర్తించవలసి ఉంది.

Updated Date - 2020-08-27T06:04:38+05:30 IST