అంతం కానున్న ‘అకేషియా చెట్లు’

ABN , First Publish Date - 2021-07-22T16:20:55+05:30 IST

పచ్చదనానికి మారుపేరుగా..

అంతం కానున్న ‘అకేషియా చెట్లు’
పచ్చదనం నడుమ తిరుమల క్షేత్రం

రెండు వేల ఎకరాల్లో చెట్లను తొలగించనున్న టీటీడీ


(తిరుమల, ఆంధ్రజ్యోతి): పచ్చదనానికి మారుపేరుగా ఉండే తిరుమల శేషాచల కొండల్లోని అకేషియా చెట్లు కనుమరుగు కానున్నాయి. జీవవైవిధ్యాన్ని దెబ్బతీసే ఈ చెట్లను తొలగించేందుకు టీటీడీ సిద్ధమవుతోంది. దాదాపు 2 వేల ఎకరాల్లో ఉన్న అకేషియా చెట్లను దశలవారీగా తొలగించి దేశీయ మొక్కలను నాటేలా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. 


తిరుమల శేషాచల అడవుల్లో వివిధ రకాల జాతుల చెట్లున్నాయి. వాటిలో తిరుమల క్షేత్రం చుట్టూ ఉన్న మొక్కలన్నీ అకేషియానే. పచ్చదనాన్ని వేగంగా పెంచడానికి ఈ అకేషియా చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని 1980నుంచి దాదాపు 800 హెక్టార్లలో ఈ చెట్లను నాటారు. ఆస్ర్టేలియా తుమ్మచెట్టుగా పిలిచే ఈ ఆకేషియా చెట్లు కేవలం పది నుంచి పదేహేను ఏళ్లలోపే తిరుమలగిరులను పచ్చగా మార్చేశాయి. అయితే ఈ చెట్ల ద్వారా జీవవైవిధ్యం దెబ్బతినడంతో పాటు చెట్ల కింద భూసాంద్రత నాశనమవుతోందని స్టేట్‌ బయోడైవర్సిటీ బోర్డు టీటీడీ దృష్టికి తీసుకువచ్చింది. అలాగే 4.5 శాతానికి పీహెచ్‌ చేరుకుని భూమిలో ఆమ్లాల శాతం అధికమవుతోందని హెచ్చరించింది.


భూగర్భ జలమట్టం అడుగంటిపోవడంతో పాటు ఆకేషియా చెట్ల కింద ఏ చెట్లూ పెరగవన్న వృక్షశాస్త్ర పరిశోధనలను కూడా టీటీడీ పరిగణనలోకి తీసుకుంది. అలాగే ఆకేషియా చెట్ల ఆకులు నేలభాగంలో పేరుకుపోవడంతో మట్టి అందక ఇతర మొక్కలకు సంబంధించిన విత్తనాలు మొలకెత్తడం లేదని గుర్తించారు. ఈ కారణాలతోనే టీటీడీ ఆకేషియా చెట్ల తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఈ చెట్లను విడతల వారీగా పదేళ్లలో తొలగించాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఈ చెట్లు తొలగించిన ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా పురాణాల్లో విశేషంగా వర్ణించబడిన చెట్లను పెంచాలని నిర్ణయించారు. మనోరజితం, రుద్రాక్ష, ఉసిరి, సంపంగి, పొగడ, పున్నాగ, ఎండాకుల అరటి వంటి దాదాపు 15 నుంచి 20 రకాల దేశీయ మొక్కలను నాటాలని టీటీడీ యోచిస్తోంది.  


సహజ అటవీ సంపద నాశనమైపోతోంది

ఆకేషియా చెట్ల ద్వారా సహజ అటవీ సంపద నాశనమైపోతోంది. వాటి నుంచి అధికంగా రాలే ఆకుల ద్వారానే అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే ఈ చెట్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు ఇతర విత్తనాలు ఈ చెట్ల కింద పడినా మొలకెత్తవు. ఎందుకంటే ఆకేషియా ఆకు నేలపై రాలి ఓ పొరగా మారిపోతుంది. తద్వారా భూమి అందక ఇతర మొక్కలు పెరగడం కష్టంగా మారిపోతోంది. అప్పటి అధికారులు అవగాహన లేకుండా ఈ చెట్లను నాటిన ఫలితం దాదాపు 20, 30 ఏళ్ల తర్వాత మనకు తెలుస్తోంది. 

           - మాధవశెట్టి, బోటనీ ప్రొఫెసర్‌, ఎస్వీ యూనివర్సిటీ 




Updated Date - 2021-07-22T16:20:55+05:30 IST