విశిష్టులకే విద్యాపీఠాలు

ABN , First Publish Date - 2020-09-16T05:35:08+05:30 IST

విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విజ్ఞాన నైపుణ్యాలను నేర్పడంతో పాటు సమాజంలోని సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారాలు కనుగొంటాయి...

విశిష్టులకే విద్యాపీఠాలు

రాష్ట్ర ప్రభుత్వం తమ అభివృద్ధి కార్యకలాపాలలో ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ లక్ష్యసాధనకు ఉన్నత విద్య అభివృద్ధి పట్ల తమ విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి. ఇందులో భాగంగా విద్యారంగంలో, పరిశోధక రంగాలలో అత్యంత విశిష్టత, ప్రాముఖ్యత సంపాదించిన వారిని ఉప కులపతులుగా నియమించాలి.


విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు విజ్ఞాన నైపుణ్యాలను నేర్పడంతో పాటు సమాజంలోని సమస్యలకు పరిశోధనల ద్వారా పరిష్కారాలు కనుగొంటాయి. అలాంటి విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియమకాలలో రాష్ట్రప్రభుత్వం బాగా ఆలోచించి పరిపాలనా దక్షత కలిగిన గొప్ప విద్యావేత్తలను నియమించడం అవసరం. అర్హత, అనుభవం లేని వ్యక్తులను ఉప కులపతులుగా నియమిస్తే విశ్వవిద్యాలయాలు తిరోగమనానికి చేరతాయి. అందువల్ల ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాల ప్రక్రియలో రాజకీయాలకు, కులాలకు అతీతంగా వ్యవహరించాలి. రాష్ట్రంలో సంఖ్యాపరంగా విద్యా సంస్థలకు కొదవ లేదు గాని, నాణ్యత గల విద్య, పరిశోధనలు జరగడం లేదు. జాతీయ స్థాయిలో పోటీకి నిలబడే విధంగా మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలు లేవు.


ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంలో ఉప కులపతులు, సంచాలకులు ఎంత ముఖ్యమో, పాలకమండలి సభ్యులు కూడా విద్యాసంస్థల అభివృద్ధిలో అంతే భాగస్వాములు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విశ్వవిద్యాలయాల చట్టం 1991, విశ్వవిద్యాలయ సవరణ చట్టం 1995 ప్రకారం విశ్వవిద్యాలయాలలోని పాలకమండలి సభ్యులను రెండు కేటగిరీలుగా విభజించారు. కేటగిరి–-1లో ఉప కులపతి పాలకమండలి అధ్యక్షులుగా, రెక్టారు, విద్యాశాఖ కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, ఉన్నత విద్యా సంచాలకులు ఎక్స్‌ అఫీసియో సభ్యులుగా వ్యవహరిస్తారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఇ.ఓ సభ్యులుగా ఉంటారు.


ఇక కేటగిరి-–2లో విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్‌, సీనియర్‌ ప్రొఫెసర్స్‌, అనుబంధ కళాశాలల నుంచి సీనియర్‌ ప్రిన్సిపాల్‌, విశ్వవిద్యాలయం నుంచి ఒక ఉపాధ్యాయుడు, అనుబంధ కళాశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు పాలకమండలి సభ్యులుగా ఉంటారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వం ఆయా విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సంప్రదించి నియమిస్తుంది. వీరుకాక విద్యారంగం నుంచి, పరిశ్రమల విభాగం, సాంకేతిక విభాగం, వాణిజ్య విభాగం, న్యాయశాస్త్ర విభాగం నుంచి నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశుసంవర్థక శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయంలో రాష్ట్ర గవర్నరు ప్రతిపాదించిన ముగ్గురు మేధావులు పాలకమండలి సభ్యులుగా ఉంటారు. మరి డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలలో విశ్వవిద్యాలయ కులపతి ప్రతిపాదించిన ముగ్గురు విద్యావేత్తలు, రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయంలో ఆయా ట్రస్ట్‌ ప్రతిపాదించిన మేధావులు పాలకమండలి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ గమనించదగ్గ విషయమేమంటే రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కులపతిగా వ్యవహరించే గవర్నరు తరఫున పాలకమండలిలో ప్రాతినిధ్యం లేకపోవడం. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధ్యక్షులు ప్రతి మూడు మాసాలకొకసారి విశ్వవిద్యాలయాల ఉప కులపతులను సమావేశపరిచి, విశ్వవిద్యాలయాల విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కానీ ఆయన పాలకమండలి సభ్యుడిగా ఉండనవసరం లేదని భావన.


నేటి పోటీ ప్రపంచంలో ప్రతి దేశం ఉద్యోగ, వ్యాపార అవకాశాలను పెంచుకోవడానికి తమ మానవ వనరుల నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటోంది. ఏ చిన్నపాటి అశ్రద్ధ, ఏమరుపాటైనా దేశాన్ని వెనుకంజలోకి నెడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తమ అభివృద్ధి కార్యకలాపాలలో ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ లక్ష్యసాధనకు ఉన్నత విద్య అభివృద్ధి పట్ల తమ విధానాన్ని సమూలంగా మార్చుకోవాలి. ఇందులో భాగంగా విద్యారంగంలో, పరిశోధక రంగాలలో అత్యంత విశిష్టత, ప్రాముఖ్యత సంపాదించిన వారిని ఉపకులపతులుగా నియమించాలి. వీరి నియామకాలలో నెలకొంటున్న ఆలస్యానికి స్వస్తిపలికి, వారు పదవీ విరమణ పొందే రోజే కొత్తవ్యక్తిని ఉపకులపతిగా నియమించాలి. అప్పుడే ఉన్నత విద్య అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నదనే సంకేతం విద్యార్థులకు, బోధనా సిబ్బందికి, సమాజానికి చేరుతుంది.

కిలారి రామమూర్తి నాయుడు

Updated Date - 2020-09-16T05:35:08+05:30 IST