40 కోట్ల స్థలం.. 30 లక్షల లంచం

ABN , First Publish Date - 2020-06-07T08:48:59+05:30 IST

40 కోట్ల స్థలం.. 30 లక్షల లంచం

40 కోట్ల స్థలం.. 30 లక్షల లంచం

ఏసీబీ వలలో షేక్‌పేట ఆర్‌ఐ, బంజారాహిల్స్‌ ఎస్సై

ఆర్‌ఐ నాగార్జునరెడ్డిని 

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

తహసీల్దార్‌ పాత్రపై అనుమానాలు

ఆమె నివాసంలోనూ సోదాలు

భారీగా నగలు, నగదు స్వాధీనం

ఎస్సై రవీంద్ర నాయక్‌కు

3 లక్షలు ఇచ్చినట్టు ఫిర్యాదు


బంజారాహిల్స్‌/చిక్కడపల్లి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): కోర్టు కేసులో ఉన్న స్థలాన్ని అప్పగిస్తామని చెప్పి.. లంచం తీసుకుంటూ షేక్‌పేట రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కందల నాగార్జునరెడ్డి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇదే వివాదంలో బాధితుడిని క్రిమినల్‌ కేసు నుంచి తప్పిస్తానంటూ లంచం తీసుకొన్న బంజారాహిల్స్‌ ఎస్సై రవీందర్‌నాయక్‌ కూడా ఏసీబీకి దొరికిపోయాడు.


వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్డు నం.14లో సర్వే నంబరు 129/59లో ఎకరం స్థలం ఉంది. దీని విలువ ప్రస్తుతం సుమారు రూ.40 కోట్లు. ఈ స్థలంపై ప్రభుత్వానికి, మీరాలం మండికి చెందిన సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలిద్‌ అనే వ్యక్తికి మధ్య కోర్టులో వివాదం ఉంది. ఇది తమ పూర్వీకులదని ఖాలిద్‌ వాదిస్తున్నారు. ఈలోపు షేక్‌పేట రెవెన్యూ అధికారులు స్థలం ప్రభుత్వానిది అంటూ సూచిక బోర్డు పెట్టారు. కోర్టులో వివాదం కొనసాగుతుండగానే జనవరిలో ఆ స్థలంలోకి ఖాలిద్‌ ప్రవేశించడంతో కేసు నమోదైంది. లాక్‌డౌన్‌ సమయంలో ఖాలిద్‌ సూచిక బోర్డును తొలగించారు. దీనిపై షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌.. ఖాలిద్‌పై కేసులు నమోదు చేశారు. అయితే స్థలం తనదేనని, సర్వే చేసి అప్పగించాలంటూ ఖాలిద్‌ తహసీల్దార్‌ను కలిసి దరఖాస్తు చేసుకున్నాడు. ఫైల్‌ ఆర్‌ఐ వద్ద ఉందని, ఆయనను కలవాలని తహసీల్దార్‌ చెప్పడంతో ఖాలిద్‌.. నాగార్జునరెడ్డి వద్దకు వెళ్లాడు. స్థలంపై వివాదం లేకుండా చేసేందుకు రూ.30 లక్షలు ఇవ్వాల్సిందిగా ఆర్‌ఐ కోరాడు. అంత ఇవ్వలేనని ఖాలిద్‌ చెప్పినా ఆర్‌ఐ వినిపించుకోలేదు. దీంతో ఖాలిద్‌ ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు  తొలుత రూ.15 లక్షలు ఇస్తానని ఆర్‌ఐతో చెప్పాడు. శనివారం బంజారాహిల్స్‌ రోడ్డు నం.2 సాగర్‌ సొసైటీ చౌరస్తాలో.. ఖాలిద్‌ నుంచి డబ్బు  తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆర్‌ఐని పట్టుకున్నారు. యూసు్‌ఫగూడలోని అతడి నివాసంలో సోదాలు చేశారు. క్రిమినల్‌ కేసు నుంచి తప్పించేందుకు బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రూ.3 లక్షలు అడిగాడని, అందులో లక్షన్నర ఇచ్చానని ఖాలిద్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ రవీందర్‌నాయక్‌ను అదుపులోకి తీసుకుని, ఆయన ఇంట్లో తనిఖీలు జరిపారు. ఆర్‌ఐ, ఎస్‌ఐపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆర్‌ఐ అవినీతిలో తహసీల్దార్‌ సుజాత పాత్రపై విచారణ చేస్తున్నారు. గాంధీనగర్‌లోని ఆమె నివాసంలో సోదాలు జరిపారు. రూ.30 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-06-07T08:48:59+05:30 IST