ఏసీబీ వలలో డీఈఈ

ABN , First Publish Date - 2020-11-28T06:11:51+05:30 IST

ఇరిగేషన్‌ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ)గా పని చేస్తున్న దామోదర్‌ మోహన్‌గాంధీ శుక్రవారం లంచం తీసుకుంటూ అవినీతినిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు.

ఏసీబీ వలలో డీఈఈ
ఏసీబీకి చిక్కిన డీఈఈ మోహన్‌గాంధీ

రూ. 2 లక్షలు  లంచం తీసుకుంటూ చిక్కిన దామోదర్‌ మోహన్‌గాంధీ 

అవినీతి అధికారి ఇంటిలోనూ సోదాలు

అనంతపురం క్రైం, నవంబరు 27 : ఇరిగేషన్‌ శాఖలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (డీఈఈ)గా పని చేస్తున్న దామోదర్‌ మోహన్‌గాంధీ శుక్రవారం లంచం తీసుకుంటూ అవినీతినిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కాడు. ముంపు గ్రామం కింద ప్రభుత్వం ప్రకటించిన పరిహారంలో ఓ బాధితురాలి నుంచి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్‌ తెలి పిన మేరకు.... ఇరిగేషన్‌శాఖ పరిధిలోని కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లిసబ్‌డివిజన్‌ చిత్రావతి బ్యాలె న్సింగ్‌ రిజర్వాయర్‌ కింద అనంతపురానికి చెందిన దామోదర్‌ మోహన్‌గాంధీ డీఈఈగా పనిచేస్తున్నారు. గతంలో చిత్రావతి రిజర్వాయర్‌ కింద కొన్ని గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించడంతో వాటికి ఇటీవల ప్రభుత్వం  పరిహారం మంజూరు చేసింది. ఈ క్రమంలో ముంపు గ్రామమైన జిల్లాలోని ముదిగుబ్బ మండలం రాఘవపల్లికి చెందిన లీలావతి ఇంటికి కూడా ప్రభుత్వం రూ.21 లక్షలు మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం నగరంలోని శ్రీనివా్‌సనగర్‌లో ఉంటున్న లీలావతి పరిహారం డబ్బు కోసం ఆ డీఈఈని కలిసింది.  నీకు పరిహారం డబ్బు చెల్లించాలంటే రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని ఆ డీఈఈ డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. డీఈఈ చెప్పిన విధంగా రూ. 2 లక్షలు నగదుతో శుక్రవారం జిల్లా కేంద్రంలోని రితీ జ్యూవెలరీ బంగారు దుకాణం వద్దకు వెళ్లి ఆయన్ను కలిసింది. డీఈఈకి డబ్బు అందజేస్తుండ గా... అప్పటికే ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచిన ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్‌ కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన ఏసీబీ సీఐలు కృష్ణారెడ్డి, సీతారాంరెడ్డి, ప్రభాకర్‌, చక్రవర్తి తదితర సిబ్బంది డీఈఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న అనంతరం సమీపంలోని ఓ డిగ్రీ కళాశాలలోకి తీసుకెళ్లి లోతుగా రహస్య విచారణ చేశారు. అంతేగాక ఆ ఉద్యోగికి చెందిన అనంతపురంలోని మూడో రోడ్డులోని ఇంటిపై సోదాలు ముమ్మరం చేశారు. విచారణ అనంతరం కర్నూలులోని ఏసీబీ కోర్టులో నిందితుడిని హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. 


ఆ శాఖ ఉద్యోగులలో అలజడి...

ముంపు గ్రామాలకు పరిహారం చెల్లింపులో భాగంగా రూ. 2లక్షలు లంచం తీసుకుంటూ డీఈఈ దామోదర్‌ మోహన్‌గాంధీ ఏసీబీకి పట్టుబడటంతో ఆ శాఖ ఉద్యోగులలో అలజడి మొదలైంది. ఆ ఉద్యోగికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు విచారణలో తేలినట్లు ఆ శాఖ వర్గాల నుంచి తెలిసింది. ఇంటి సమీపంలో ప్రత్యేక ఆఫీస్‌ తరహాలో ఏర్పాటు చేసుకుని ఇతర ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. మిగిలిన ముంపు గ్రామాల బాధితుల నుంచి పెద్దఎత్తున ఆ శాఖ ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు సమాచారం. 

Updated Date - 2020-11-28T06:11:51+05:30 IST