సంగం సర్వర్ల స్వాధీనానికి ఏసీబీ యత్నం

ABN , First Publish Date - 2021-05-08T08:48:43+05:30 IST

సంగం డెయిరీలో ఏసీబీ సోదాలతో రోజుకో కొత్త వివాదం రేగుతోంది. శుక్రవారం డెయిరీ కీలక సర్వర్లను స్వాధీనం చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది

సంగం సర్వర్ల స్వాధీనానికి ఏసీబీ యత్నం

హైకోర్టు ఉత్తర్వులు అందలేదని వాదన

అడ్డుకున్న డెయిరీ ఉద్యోగులు

పోలీసులు, అధికారులతో వాగ్వాదం

కీలక సర్వర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఆరోపణ

ప్రభుత్వమే కుట్రచేస్తోందని ధ్వజం

దీంతో వెనక్కి తగ్గిన దర్యాప్తు అధికారులు

నేడు కోర్టు ఆదేశాలు చూపించాలని సూచన

కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు డెయిరీ సన్నద్ధం!


చేబ్రోలు, మే 7: సంగం డెయిరీలో ఏసీబీ సోదాలతో రోజుకో కొత్త వివాదం రేగుతోంది. శుక్రవారం డెయిరీ కీలక సర్వర్లను స్వాధీనం చేసుకోవడానికి దర్యాప్తు అధికారులు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే సర్వర్లను ప్రైవేటు వ్యక్తులతో ఆపరేట్‌ చేయిస్తున్నారని, డేటా చౌర్యానికి గురవుతోందని ఆరోపణలున్నాయి. తాజాగా సర్వర్ల స్వాధీనానికి దర్యాప్తు అదికారులు ఉపక్రమించడంతో సంగం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సర్వర్‌ రూం వద్ద పోలీసులు భారీగా మోహరించడంతో వారితో, ఏసీబీ అధికారులతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. కేసుకు సంబంధం లేని ఇతర వ్యవహారాల్లో ఏసీబీ అధికారులు జోక్యం చేసుకోవద్దని, సంగం సర్వర్ల యాక్సెస్‌ వంటి వాటి జోలికి వెళ్లొద్దని హైకోర్టు శుక్రవారమే ఉత్తర్వులిచ్చిందని వారు తెలిపారు. అయితే ఉత్తర్వుల కాపీలు తమకు అందలేదంటూ సర్వర్ల స్వాధీనానికి ఏసీబీ అధికారులు ప్రయత్నించారు. ఈ దశలో సిబ్బంది పట్ల పోలీసులు, దర్యాప్తు అధికారులు దురుసుగా వ్యవహరించారు. దీంతో డెయిరీ ఉద్యోగులు పెద్దసంఖ్యలో పరిపాలన భవనం వద్దకు చేరుకుని అక్కడే బైఠాయించి నిరసనలకు దిగారు. 


ఉత్తర్వుల కాపీలు అందలేదని కుంటి సాకులు చెబుతూ తమ సర్వర్ల స్వాధీనానికి ప్రయత్నించడం వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందని.. ప్రభుత్వం వెనుక ఉండి ఈ కుట్రను నడిపిస్తోందని ఆరోపించారు. కీలక సర్వర్లు హ్యాకింగ్‌కు గురైనట్లు తమ ఐటీ విభాగం సిబ్బంది గుర్తించారని కూడా తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు వెనక్కి తగ్గారు. సంగం సీనియర్‌ ఉద్యోగులతో చర్చించారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి సర్వర్ల స్వాధీనానికి పాల్పడడం సరికాదని ఉద్యోగులు తేల్చిచెప్పడంతో.. ఉత్తర్వుల కాపీలు చూపాలని ఏసీబీ అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఆర్డర్‌ కాపీ రావడానికి కొద్ది గంటల సమయం పడుతుందని.. తమకు సమయమివ్వాలని ఉద్యోగులు కోరారు. దీంతో శనివారం ఉదయం వరకు సర్వర్ల స్వాధీనం నిలిపివేస్తామని, ఈలోపు హైకోర్టు ఉత్తర్వులు అందజేయాలని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు. సంగం డెయిరీలో శుక్రవారం జరిగిన పరిణామాలను న్యాయస్ధానం దృష్టికి తీసుకెళ్లేందుకు యాజమాన్యం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

Updated Date - 2021-05-08T08:48:43+05:30 IST