లంచమిస్తేనే సర్వే!

ABN , First Publish Date - 2021-10-22T04:51:14+05:30 IST

నెల్లూరులోని చిల్డ్రన్స పార్కు సమీపంలో ఉన్న పావని ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న దొడ్డి ఆదినారాయణ తోటపల్లి గూడూరు మండల సర్వేయర్‌గా ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తున్నాడు.

లంచమిస్తేనే సర్వే!
అదుపులోకి తీసుకున్న సర్వేయర్‌

సర్వేయర్‌ అవినీతి బాగోతం

రూ.18వేలు తీసుకుని జాప్యం

మళ్లీ రూ.24వేలు కావాలని డిమాండ్‌

ఏసీబీని ఆశ్రయించిన రైతు

రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

ఆస్తులపై సోదాలు


నెల్లూరు(క్రైం), అక్టోబరు 21: 

ఓ రైతు తన పొలాన్ని సర్వే చేయమన్నందుకు ఆ అధికారి లంచం డిమాండ్‌ చేశాడు. డబ్బిస్తేనే పనవుతుందని తెగేసి చెప్పడంతో లంచావతారం అడిగినంత నగదును ఆ రైతు సమర్పించాడు. అయినా అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ సదరు రాబందు మళ్లీ డబ్బు కావాలన్నాడు. బాధిత కర్షకుడికి కడుపు మండి ఏసీబీని ఆశ్రయించాడు. వారు అవినీతి సర్వేయరు ఆట కట్టించారు. వివరాల్లోకి వెళితే...


నెల్లూరులోని చిల్డ్రన్స పార్కు సమీపంలో ఉన్న పావని ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న దొడ్డి ఆదినారాయణ తోటపల్లి గూడూరు మండల సర్వేయర్‌గా ఏడాదిన్నరగా విధులు నిర్వహిస్తున్నాడు. ముత్తుకూరు మండలానికి చెందిన టీ సురేంద్రరెడ్డికి టీపీ గూడూరు మండలం వరకవిపూడి గ్రామం కుమ్మరపాళెంలో సర్వేనెంబరు 154లో 93 సెంట్ల భూమి ఉంది. అయితే సదరు సర్వే నెంబరులో కేవలం 66 సెంట్ల భూమి మాత్రమే ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తుండటంతో సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని సర్వేయర్‌ ఆదినారాయణను ఈ ఏడాది జూలైలో రైతు సురేంద్ర రెడ్డి కోరాడు. అయితే భూమిని సర్వే చేసేందుకు ఆదినారాయణ రూ.18 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తాన్ని సరేంద్ర ముట్టజెప్పాడు. అయినా ఆదినారాయణ కాలయాపన చేస్తూ రైతును తిప్పుకోసాగాడు. దీనిపై ఇటీవల బాధితుడు నిలదీయగా రూ.24 వేలు లంచం ఇస్తే రిపోర్టు ఇస్తానని స్పష్టం చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు అవినీతి నిరోధక శాఖ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14400కు ఫోన చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ జీఆర్‌ఆర్‌ మోహన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డీఎస్పీ సూచన మేరకు గురువారం రైతు సురేంద్ర రెడ్డి సర్వేయర్‌ ఆదినారాయణ ఇంటికి వెళ్లి రూ.24వేలు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌ ఫ్లాట్‌లో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు, సుమారు 10.75 కేజీల బంగారు ఆభరణాలు, 5.50 కేజీల వెండి ఆభరణాలు, కారు తదితరాలను గుర్తించినట్లు సమాచారం. నిందితుడికి ఎస్‌బీఐలో లాకర్‌ కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇనస్పెక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


గతంలోనూ ఇంతే..!


సర్వేయర్‌ ఆదినారాయణ 2018లో కూడా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ ఏడాది మార్చి నెలలో నెల్లూరు నగరానికి చెందిన సంక్రాంతి కల్యాణ్‌ కుమార్తెకు సంబంధించిన భూమి విషయంలో సర్వే రిపోర్టు ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. 

Updated Date - 2021-10-22T04:51:14+05:30 IST