Abn logo
Sep 24 2021 @ 12:30PM

HYD: కూకట్‌పల్లి కార్యాలయంలో ఏసీబీ దాడులు

లంచం తీసుకుంటూ దొరికిన ఇద్దరు ఉద్యోగులు

హైదరాబాద్/కూకట్‌పల్లి: మూసాపేటలోని కూకట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇద్దరు జీహెచ్‌ఎంసీ సిబ్బంది బాధితుల నుంచి లంచం తీసుకొంటుండగా అధికారులు పట్టుకొన్నారు. 

వివరాల్లోకి వెళితే... బాలానగర్‌ ఐడీపీఎల్‌ కాలనీలో నివాసముండే చాంద్‌పాషా కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతని వద్దకు రెండు నెలలక్రితం ఆస్‌ బెస్టాస్‌ కాలనీకి చెందిన నాగరాజు తన ఇంటి మ్యూటేషన్‌ పని నిమిత్తం వెళ్లారు. మ్యూటేషన్‌ పని చేసేందుకు చాంద్‌పాషా అతన్ని రూ.8వేలు డిమాండ్‌ చేశాడు. రెండు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడు. దీంతో విసుగెత్తిన నాగరాజు గురువారం ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొన్న అధికారులు... ఏసీబీ డీఎస్పీ ఫయాజ్‌ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. చాంద్‌పాషా నాగరాజు నుంచి రూ.8వేలు నగదు తీసుకొంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అంతేకాకుండా చాంద్‌పాషా చాంబర్‌లో, ఇంట్లో తనిఖీలు నిర్వహించగా రూ.లక్షల్లో నగదు లభించిందని, సదరు నగదుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కార్యాలయంలో లభించిన డబ్బు జీహెచ్‌ఎంసీకి చెందినదా, సొంతందా అన్నది కూడా విచారణ చేస్తున్నామని డీఎస్సీ ఫయాజ్‌ తెలిపారు. 


శానిటేషన్‌ విభాగంలో...

అదేవిధంగా కూకట్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలోని పారిశుధ్య విభాగంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. అక్కడి అవుట్‌సోర్సింగ్‌  విధానంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసే షన్ముఖం అనే ఉద్యోగి ట్రేడ్‌ లైసెన్స్‌లో పేరు మార్చడం కోసం ఓ వ్యక్తి నుంచి రూ.2,500 లంచం తీసుకొంటుండగా అదుపులోకి తీసుకొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు మూడు బృందాలుగా తనిఖీలు నిర్వహించారు.