ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనులు వేగవంతం

ABN , First Publish Date - 2021-07-30T05:17:41+05:30 IST

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనులు వేగవంతం

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పనులు వేగవంతం
సర్వే చేస్తున్న అధికారుల బృందం

  • జినుగుర్తి గ్రామ సమీపంలో సర్వే
  • భూమిని పరిశీలించిన రాష్ట్ర అధికారుల బృందం

తాండూరు రూరల్‌ : తాండూరు ప్రాంతంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి గ్రామ శివారులో సర్వేనెంబర్‌-206లో వారం రోజులుగా రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి స్థలాన్ని కేటాయించేందుకు కసరత్తు ప్రారంభించారు. 206 సర్వేనెంబర్‌లో 305 ఎకరాల 34 గుంటల భూమిలో ప్రభుత్వం అప్పట్లో 222 ఎకరాల 24 గుంటల భూమిని రైతులకు అసైన్డ్‌ చేసింది. కాగా, కొందరు రైతులు భూమిని సాగు చేయకపోవడంతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కోసం కేటాయించేందుకు భూమిని అధికారుల బృందం పరిశీలించింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు తహసీల్దార్‌ చిన్నప్పలనాయుడు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌, సర్వేయర్‌ శ్రీహరి, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ సర్వేయర్‌ వెంకటయ్యతోపాటు మరో నలుగురు అధికారుల బృందం గత 15రోజులుగా సర్వే చేపట్టి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. అయితే ఈ భూమిలో ప్రస్తుతం 45 ఎకరాలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు కేటాయించేందుకు అవకాశం ఉందని ఉన్నతాధికారులకు  నివేదించారు. దీంతో గురువారం రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ అధికారుల బృందం మరోమారు భూమిని పరిశీలించి సర్వే నిర్వహించారు. మండల సర్వేయర్‌ శ్రీహరిని అడిగి సమగ్ర వివరాలను సేకరించారు. మరోమారు డ్రోన్‌ ద్వారా సర్వే చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు శ్రీహరి తెలిపారు.

Updated Date - 2021-07-30T05:17:41+05:30 IST