ఊపందుకున్న వరికోతలు

ABN , First Publish Date - 2022-04-24T04:46:22+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో పండిన వరిధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో అధికార యంత్రాం గం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది.

ఊపందుకున్న వరికోతలు

- ఇప్పటికే 20 శాతం కోతలు పూర్తి

- ఉమ్మడి జిల్లా పరిధిలో 7,56,760 ఎకరాల్లో వరిసాగు

- కొనుగోలు కేంద్రాలకు రానున్న 15.53 లక్షల టన్నుల ధాన్యం

- 1141 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం

- ఇప్పటికే 60 కేంద్రాలు ప్రారంభం


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో పండిన వరిధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో అధికార యంత్రాం గం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతోంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 7,56,760 ఎకరాల్లో వరి సాగు జరగగా  17,53,127 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో సుమారు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం విత్తనోత్పత్తి కంపెనీలకు వెళ్లనుండగా 15.53 లక్షల టన్నుల ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తారని అంచనా వేశారు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా పరిధిలో 1,141 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 60 కేంద్రాలను ప్రారంభించినా ధాన్యం కొనుగోలుకు మాత్రం ఇంకా శ్రీకారం చుట్టలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగు రోజుల్లోగానే వరిధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి వారం రోజులు గడిచినా ఇంకా కొనుగోలు కేంద్రాల ప్రారంభమమే కాలేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పుడిప్పుడే వరి కోతలు ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే నాలుగు జిల్లాల్లో కలిసి 20 శాతం మేరకు వరి కోతలు పూర్తయ్యాయని అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లోనే 50 శాతం కోతలు పూర్తయి పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉండడంతో ఒకటి రెండు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలని రైతులు కోరుతున్నారు. 


కరీంనగర్‌ జిల్లాలో...


జిల్లాలో యాసంగిలో రైతులు 2,46,887 ఎకరాల్లో వరిసాగు చేశారు. వ్యవసాయశాఖ ఎకరాకు 23 క్వింటాళ్ల మేరకు దిగుబడి రావచ్చని అంచనా వేసింది. ఈ మేరకు జిల్లాలో 5,67,840 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముంది. జిల్లాలో సాగు చేసిన 2,46,887 ఎకరాల్లో 48వేల ఎకరాలు హైబ్రీడ్‌ సీడ్‌ సాగు చేశారు. ఈ హైబ్రీడ్‌ సీడ్‌ను రైతులు ఆయా కంపెనీలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకొని సాగు చేసినందువల్ల ధాన్యం కొనుగోలు విషయంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. జిల్లాలో 1.10 లక్షల టన్నుల హైబ్రీడ్‌ విత్తనం ఉత్పత్తి అయ్యే అవకాశమున్నది. మరో 55వేల ఎకరాల్లో రైతులు నోటిఫైడ్‌ సీడ్‌ రకాలను సాగు చేశారు. ఈ విస్తీర్ణంలో 1.26 లక్షల టన్నుల సీడ్‌ ఉత్పత్తి కానున్నది. ఈ ధాన్యాన్ని జిల్లాలో ఉన్న విత్తనశుద్ధి కర్మాగారాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా 1,43,887 ఎకరాల్లో దొడ్డు, సన్న, సాధారణ రకాల వరి సాగు జరిగింది. ఈ సాగు విస్తీర్ణంలో పండిన 3,39,127 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నది. జిల్లాలో 357 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 231 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 68 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 53 కేంద్రాలు, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 5 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు జిల్లాలో 38 కొనుగోలు కేంద్రాలను ప్రారం భించారు. అయితే కొనుగోళ్లకు మాత్రం ఇంకా శ్రీకారం చుట్టలేదు. జిల్లాకు 84 లక్షల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అంచనా వేయగా 15 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సగం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు పంపించారు. 


రాజన్న సిరిసిల్ల జిల్లాలో..


రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,18,893 ఎకరాల్లో వరి సాగు జరగగా, 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇక్కడ 265 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 75 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా ఇప్పటికే 15 లక్షల బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఈ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 185, ఐకేపీ ఆధ్వర్యంలో 66, డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 9, మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో 2, మెప్మా ఆధ్వర్యంలో 3 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తారు. 


 జగిత్యాల జిల్లాలో..


జగిత్యాల జిల్లాలో 2,08,000 ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ జిల్లాలో 5.20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసి వాటిని కొనుగోలు చేయడానికి 327 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల 216 కేంద్రాలను, ఐకేపీ 111 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. ఈ జిల్లాలో కోటి 30 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా 25 లక్షల గన్నీబ్యాగులను ఇప్పటికే సిద్ధం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు.


 పెద్దపల్లి జిల్లాలో..


పెద్దపల్లి జిల్లాలో 1,83,000 ఎకరాల్లో వరిసాగు జరిగింది. 3 లక్షల 94 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 292 గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 8 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు చెందిన 215, ఐకేపీకి చెందిన 58, డీఎంఎస్‌కు చెందిన 14, ఏఎంసీకి చెందిన 5 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 98 లక్షల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని అంచనా వేసి ఇప్పటికీ 13 లక్షల గన్నీబ్యాగులను సిద్ధంగా ఉంచారు. 

Updated Date - 2022-04-24T04:46:22+05:30 IST