Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘మద్యం’ దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లావ్యాప్తంగా 82 షాపులకు నోటిఫికేషన్‌ విడుదల 

 20న భువనగిరిలో లాటరీ ద్వారా ఎంపిక 

యాదాద్రి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): నూతన మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 82 షాపులకు 2021-23 సంవత్సరానికి సంబంధించిన లైసెన్స్‌కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జిల్లాయంత్రాంగం మంగళవారం జారీచేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి 18 వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆదివారం మినహాయించి అన్ని రోజుల్లోనూ దరఖాస్తులను స్వీకరించనున్నారు. భువనగిరి, ఆలేరు ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని దుకాణాలకు సంబంధించి  భువనగిరిలోని ఎక్సైజ్‌స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి. రామన్నపేట, మోత్కురు ఎక్సైజ్‌స్టేషన్లకు సంబంధించిన దరఖాస్తులను భువనగిరి బంజారాహిల్స్‌లోని జిల్లా ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో అందజేయాలి. ఈ నెల 19న దరఖాస్తులను పరిశీలించి, 20వ తేదీన భువనగిరిలోని రావి భద్రారెడ్డి ఫంక్షన్‌ హాల్లో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. ఒక్కో దుకాణానికి దరఖాస్తు ఫీజు రూ.2లక్షలు ఉంటుంది.  ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైన, ఎన్ని షాపులైన తీసుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో గతంలో 69 మద్యం దుకాణాలుండగా, ఈసారి ప్రభుత్వం మరో 13 షాపులను పెంచింది. ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా దుకాణాల కేటాయింపుపై రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో ఎస్సీలకు 7 దుకాణాలు, ఎస్టీలకు 1, గౌడ కులస్తులకు 21 దుకాణాలను కేటాయించింది. మిగతా 53 షాపులకు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. గత సంవత్సరం మొత్తం 1,629 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.32.58కోట్లు ఆదాయం సమకూరింది. ఈసారి జిల్లాలో 13 మద్యం దుకణాలు పెరగడంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. 


దరఖాస్తులను స్వీకరిస్తున్నాం : కృష్ణప్రియ

నూతనంగా మద్యం దుకాణాల లైసెన్స్‌ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా ఎక్సైజ్‌ శాఖ అధికారి కృష్ణప్రియ తెలిపారు. భువనగిరిలోని ఎక్సైజ్‌ శాఖ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. దరఖాస్తుదారులు రూ.2లక్షల డీడీని జిల్లా ఎక్సైజ్‌ శాఖ పేరుమీద తీయాలన్నారు. ఈనెల 20న కలెక్టర్‌ ఆధ్వర్యంలో  మద్యం దుకాణాల కేటాయింపుపై డ్రా ఉంటుందన్నారు.  

Advertisement
Advertisement