ప్రాణాలు నిలబెడుతున్నారు

ABN , First Publish Date - 2021-05-31T06:03:26+05:30 IST

పద్నాలుగు మంది మహిళలు... పద్నాలుగు నెలలుగా విశ్రమం లేకుండా శ్రమిస్తున్నారు. అత్యవసర సేవలు అందక అల్లాడుతున్న ఎందరో కరోనా బాధితుల ప్రాణాలు నిలబెడుతున్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా

ప్రాణాలు నిలబెడుతున్నారు

పద్నాలుగు మంది మహిళలు... పద్నాలుగు నెలలుగా విశ్రమం లేకుండా శ్రమిస్తున్నారు. అత్యవసర సేవలు అందక అల్లాడుతున్న ఎందరో కరోనా బాధితుల ప్రాణాలు నిలబెడుతున్నారు. హెల్ప్‌లైన్‌ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నారు. సొంతవారే దూరం జరుగుతున్న వేళ మేమున్నామంటూ పేద రోగులకు భరోసానిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన ‘యాక్సెస్‌ ఫౌండేషన్‌’ నిర్వాహకులు.ఈ విపత్కాలంలో ఆపద్బాంధవులుగా మారిన ఈ స్వచ్ఛంద సంస్థ సేవా మార్గం గురించి దాని వ్యవస్థాపకుల్లో ఒకరైన మారియా తబస్సుమ్‌ మాటల్లోనే...


‘‘ఒక్క మనిషి ప్రాణాన్ని కాపాడినా సరే సమస్త మానవాళికి ఉపకారం చేసినట్టే’... పవిత్ర ఖురాన్‌లోని ఈ వాక్యమే మా అందరికీ ప్రేరణ. ఆ స్ఫూర్తితోనే ‘యాక్సిస్‌ ఫౌండేషన్‌’ ద్వారా పద్నాలుగు నెలలుగా కొవిడ్‌ సేవలను అందించగలుగుతున్నాం. అదీ పూర్తి ఉచితంగా.! కరోనా కష్టకాలంలో ఒకవైపు కొన్ని వేలమంది చావుబతుకులతో కొట్టుమిట్టాడుతుంటే మేము మాత్రం చూస్తూ ఎలా ఉండగలం? అందుకే కొవిడ్‌ నష్టాల్ని ముందుగానే ఊహించి, తక్షణ సహాయ చర్యలను ప్రారంభించాం. 



హెల్ప్‌లైన్‌ నంబర్‌...  

ఫస్ట్‌వేవ్‌లో కొవిడ్‌ వ్యాప్తికన్నా సమాజంలోని భయాందోళనలే ప్రధాన సమస్యగా మారాయి. కరోనా వచ్చినవారంతా ఆస్పత్రిలో చేరక్కర్లేదు. అలా అని ఇంట్లో ఉంటూ చికిత్స పొందేవాళ్లలో ఎంతమందికి వైద్యులు అందుబాటులో ఉంటారు! అదే సమయంలో వ్యక్తిగత ఆరోగ్యంపై రకరకాల సందేహాలు, అనుమానాలు మనసును తొలిచేస్తుంటాయి. ఈ సందేహాలను నివృత్తి చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు ఆరోగ్య సలహాలివ్వడం, వాళ్లల్లో ఆత్మస్థైర్యం నింపడం లక్ష్యంగా పెట్టుకున్నాం. దాని కోసం మా బృందంలోని డాక్టర్‌ ఇరమ్‌ జవహర్‌, డాక్టర్‌ హఫ్సాల చొరవతో ‘హమ్‌’ కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించాం. ఇరవై నాలుగు గంటలూ నడిచే ఈ హెల్ప్‌లైన్‌లో 120 మంది వాలంటీర్లు, 60మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. రోజుకి సుమారు రెండు వందల కాల్స్‌కు సమాధానమిస్తున్నారు. అదే సమయంలో పదివేల నిత్యావసర సరుకుల కిట్లను వలస కార్మికులకు అందించాం. 


ఆపదలో అంబులెన్స్‌లు... 

కొవిడ్‌ రోగి ఆస్పత్రికనో, వైద్య పరీక్షలకనో ఒకచోట నుంచి మరొక చోటకు వెళ్లాలంటే నరకమే. ప్రభుత్వ అంబులెన్స్‌లు లేవు. ప్రైవేటు అంబులెన్స్‌ను పిలిస్తే పది రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. అందరూ అంత ఖర్చు భరించలేరు కదా! పైగా అంబులెన్స్‌ల కొరతా మన దగ్గర ఉందని గుర్తించాం. మా వంతుగా 6 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచాం. దీనికి ఒక్క రూపాయి చార్జి చేయం. అలాగే కరోనా మృతుల అంతిమయాత్ర కోసం ఒక ప్రత్యేక వాహనాన్ని కేటాయించాం.  



130 పడకలతో ఐసొలేషన్‌ వార్డులు... 

ఇలా 14 మాసాలుగా కొవిడ్‌ బాధితులకు మాకు చేతనైన సాయం అందిస్తున్నాం. సుమారు 200 మంది వాలంటీర్లు కార్యక్షేత్రంలో ఉన్నారు. ఇక ఆర్థిక సహకారం అందిస్తూ మాకు వెన్నుదన్నుగా నిలిచిన దాతలు ఎందరో! గోల్కొండ, మలక్‌పేటల్లో 130 బెడ్లతో రెండు ఐసొలేషన్‌ వార్డులను ఆదివారం ప్రారంభించాం. అత్యవసర సేవలు కావల్సిన వారి కోసం మా సంస్థ పర్యవేక్షణలో రెండు వాట్సప్‌ గ్రూపులున్నాయి. మా దృష్టికొచ్చిన వారందరి సమస్యలు పరిష్కరించే దిశగా పని చేస్తున్నాం. కొవిడ్‌ సమయంలో సమాజానికి మా వంతు సహకారం అందించేందుకు ముందున్నాం. అదే పనిలో నిమగ్నమయ్యాం. ఈ కష్ట కాలం పూర్తిగా తొలగే వరకూ మా సేవ కొనసాగిస్తాం. మా కార్యక్రమాలకు ‘సఫా బైతుల్‌ మాల్‌, మాహీర్‌’ స్వచ్ఛంద సంస్థలూ తోడ్పడుతున్నాయి.


మహిళా సాధికారత కోసం... 

నిజానికి ‘యాక్సెస్‌ ఫౌండేషన్‌’ మహిళా సాధికారత లక్ష్యంగా 2016లో మొదలైంది. ఆరోగ్యం, ఆత్మస్థైర్యం కల్పిస్తూ తద్వారా నలుగురికీ ఆనందాన్ని పంచడమే దీని లక్ష్యం. విద్య, వైద్య రంగాల్లో స్థిరపడిన 14 మంది మహిళలం కలిసి ఈ సంస్థను స్థాపించాం. విశ్రాంత ప్రొఫెసర్‌ అనీస్‌ అయేషా సంస్థ అధ్యక్షురాలు. నేను కోశాధికారిని. వైద్య రంగంలో స్థిరపడిన ఇరం జవహర్‌, హఫ్సా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. కష్టాల్లో ఉన్నవారికి సంతోష మార్గంలోకి యాక్సెస్‌ (ప్రవేశ సౌలభ్యం) కల్పించడమే మా ఫౌండేషన్‌ పేరు వెనకున్న అర్థం. బస్తీల్లోని ఆడపిల్లల చదువును ప్రోత్సహించడం, వాళ్లకు వృత్తివిద్యా నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించడం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. బడి మానేసిన 300 మంది అమ్మాయిలతో ఓపెన్‌ స్కూలు ద్వారా పదోతరగతి పూర్తిచేయించాం. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో శాస్త్రినగర్‌లో వస్త్ర పరిశ్రమను నెలకొల్పి తద్వారా యాభై మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. అక్కడే పేదల కోసం యాక్సెస్‌ క్లినిక్‌ పేరుతో ఒక ఆస్పత్రినీ నిర్వహిస్తున్నాం. వైద్య పరీక్షలు, మందులు ఉచితం. ముషీరాబాద్‌లోనూ టైలరింగ్‌ వర్క్‌షాపు నిర్వహిస్తున్నాం. ఉచిత కంప్యూటర్‌ శిక్షణ కేంద్రం నెలకొల్పాం. కులమతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్న ప్రతి మనిషికీ సాయం చేయాలనేది మా సంకల్పం. 


ఆక్సిజన్‌ సిలిండర్లు...

హెల్ప్‌లైన్‌ నిర్వహిస్తున్న క్రమంలో మందులు కొనుక్కోడానికీ స్థోమతలేని చాలామంది కొవిడ్‌ రోగులు మాకు తారసపడ్డారు. వారి అవసరాలను గుర్తించి, వాళ్లకు మందులతో పాటు థర్మామీటర్లు, ఆక్సీమీటర్‌లు ఉచితంగా అందిస్తున్నాం. కొవిడ్‌ రెండవ దశ వ్యాప్తిలో ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. దాని కోసం చాలామంది మాకు ఫోన్‌చేసి ప్రాధేయపడేవారు. ఆ కన్నీటి వేడుకోళ్లు మా మనసులను మెలిపెట్టేవి. అందుకే పేద రోగులకు ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించాం. మా వద్ద ఉన్న 80 ఆక్సిజన్‌ సిలిండర్లు, 45 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లతో ఇప్పటి వరకు మూడొందల మందికి పైగా బాధితులకు సాయపడగలిగాం. గాంధీ, కింగ్‌ కోఠి, ఎర్రగడ్డ ఛాతీ ప్రభుత్వ ఆస్పత్రుల వెలుపల సైతం రోగుల కోసం ఆక్సిజన్‌ థెరపీని అందుబాటులో ఉంచాం.


యాక్సెస్ ఫౌండేషన్ సేవల కోసం:

ఆంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్లకు:9908820066(హైదరాబాద్‌లోని వారికి మాత్రమే)

‘హోమ్ కొవిడ్ హెల్ప్‌లైన్ నెంబర్:7306600600

Updated Date - 2021-05-31T06:03:26+05:30 IST